మహిళా ప్రయాణికుల భద్రత కోసం ‘రిస్తా’
మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ద.మ. రైల్వే జీఎం
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోన్న దక్షిణమధ్య రైల్వే.. తాజాగా మరో మొబైల్ అప్లికేషన్ ‘రిస్తా’ను ప్రారంభించింది.
గురువారం లింగంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ దీన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ప్రయాణ సమయంలో అసాంఘిక శక్తులు, నేరస్తులు, ఈవ్టీజర్స్తో ఎదురయ్యే ఇబ్బందులపై ఈ యాప్ ద్వారా ఆర్పీఎఫ్కు సమాచారం అందజేయవచ్చునన్నారు. ఈ యాప్‌కు వచ్చే ఫిర్యాదులు, బాధితుల వివరాలు, వాట్సప్ దృశ్యాలు గోప్యంగా ఉంటాయన్నారు. రిస్తాను ప్రయోగాత్మకంగా పరిశీలించే దశలోనే రూ.9 లక్షల విలువైన ఆభరణాల చోరీకి పాల్పడిన ఒక నిందితుడిని ఆర్పీఎఫ్ అదుపులోకి తీసుకుందన్నారు.
నగరంలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత గడువు ప్రకారం రెండో దశ రైళ్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. పునర్నిర్మించిన లింగంపల్లి స్టేషన్ భవనం, రూ.2 కోట్లతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. అంతకుముందు సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లో ప్రయాణించిన జీఎం.. ప్రయాణికులతో ముచ్చటించారు. ఎంఎంటీఎస్ సేవలపై ఆరా తీశారు. రెళ్ల రాకపోకల్లో జాప్యానికి తావు లేకుండా తగు చర్యలు తీసుకోనున్నట్లు జీఎం వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో పాటు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి లింగంపల్లి రైల్వేస్టేషన్కుఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న దక్షిణమధ్య రైల్వే జీఎం పి.కె.శ్రీవాత్సవ