వీరప్పన్‌ను కలిసిన సూపర్ స్టార్
పెరంబూర్: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎంజీఆర్ కళగం పార్టీ అధ్యక్షుడు ఆర్ఎం.వీరప్పన్‌ను శుక్రవారం ఆయన ఇంటిలో కలిసి గంటకు పైగా మంతనాలు జరిపారు. వీరి కలయిక తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. రజనీకాంత్‌కు ఆర్ఎం.వీరప్పన్‌కు మధ్య చాలాకాలంగా సత్సంబంధాలున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ కథానాయకుడిగా సత్యామూవీస్ పతాకంపై ఆర్ఎం.వీరప్పన్ బాషా, మూండ్రముగం వంటి సంచలన విజయాలను సాధించిన చిత్రాలను నిర్మించారన్నది గమనార్హం. కాగా 1995లో బాషా చిత్ర విజయోత్సవ వేదికపై రజనీకాంత్ అన్నాడీఎంకే పార్టీని తీవ్రంగా విమర్శించారు.
ఆయన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను కలకలాన్నే సృష్టించాయి. అంతే కాదు ఆ ప్రభావం ఆర్ఎం.వీరప్పన్పైనా పడింది. అప్పట్లో మంత్రిగా ఉన్న ఆయన పదవి కోల్పోయారు. తరువాత రజనీకాంత్‌తో ఆయన రాజకీయ గురువుగా చెప్పబడిన చోరామస్వామి, ఆర్వీ.వీరప్పన్లు రాజకీయ సమాలోచనలు జరిపారు. ఇలాంటి పరిణామాల తరువాత తాజాగా జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాల్లో నెలకొన్న పరిణామాల మధ్య ఆర్ఎం.వీరప్పన్‌ను రజనీకాంత్ కలవడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల భారతీయ జనతా పార్టీ రజనీకాంత్‌కు గాలం వేయడం, అదే సమయంలో ఆయన అభిమానులు రాజకీయాల్లోకి రావాలని తరచూ ఒత్తిడి చేస్తున్నారు.
అదే విధంగా ఈ నెల 12 నుంచి 17 వరకూ రజనీకాంత్ తన అభిమానులతో సమావేశం కానుండటం లాంటి పరిస్థితులను గమనిస్తున్న రాజకీయ వర్గాలు ఈ ఊహించని పరిణామంతో రజనీ ఆలోచనా ధోరణిని అంచానా వేసే పనిలో పడ్డాయి. అదే విధంగా ప్రస్తుతం ఆర్ఎం.వీరప్పన్, రజనీకాంత్ కలయికలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తదితర పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. రజనీకాంత్ తన అభిమానుల ఆకాంక్షను నెరవేర్చడానికి సిద్ధం అవుతున్నారా? తన రాజకీయరంగ ప్రవేశానికి తగిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నారా? అందుకే ఆర్ఎం.వీరప్పన్‌ను కలిసి మంతనాలు జరుపుతున్నారా? లాంటి ప్రశ్నలు రాజకీయవర్గాల్లో తలెత్తుతున్నాయి.