R.narayanamurthy
-
‘సినిమా వాళ్లు మాత్రమే అని భ్రమ కలిగిస్తున్నారు’
-
‘సినిమా వాళ్లు మాత్రమే అని భ్రమ కలిగిస్తున్నారు’
అమరావతి: డ్రగ్స్ కేసులో కేవలం సినిమా రంగాన్నే టార్గెట్ చేయడం సరికాదని సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. సిట్ అధికారులు, మీడియా కలిసి సినిమాలు తీసేవాళ్లకే సినిమా చూపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్. నారాయణమూర్తి సోమవారమిక్కడ మాట్లాడుతూ సినిమా వాళ్లు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నట్లు భ్రమ కలిగిస్తున్నారన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన ఉద్యోగులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు కూడా డ్రగ్స్ వాడుతున్నారని నారాయణమూర్తి అన్నారు. వాళ్ల అందరిని వదిలేసి కేవలం సినిమా వాళ్లనే ఫోకస్ చేయడం సరికాదన్నారు. మన దేశంలో 1960 నుంచి డ్రగ్స్ వాడకం ఉందని, దీన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఓ వైపు సిగరేట్, మద్యం బాటిల్స్ మీద ఆరోగ్యానికి హానికరం అంటూనే ఆదాయం కోసం ప్రభుత్వాలే వాటిని ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఇక స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్‌కి బానిసలుగా మారడం బాధాకరమన్నారు. ఈ కేసులో మూలాలు వెతికి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నారాయణమూర్తి అన్నారు. కాగా డ్రగ్స్ మాఫియా కేసులో పలువురు సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ నోటీసులు అందుకున్నవారిలో పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్ హాజరు కాగా, ఇవాళ నవదీప్ సిట్ ఎదుట విచారణకు హాజరు అయ్యారు. -
విలువలను పెంపొందించే సినిమాలు అవసరం
నీతి నిజాయితీలను పెంపొందించే చిత్రం‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి మధురపూడి : మానవ విలువలను పెంపొందించే సినిమాలు సమాజాభివృద్ధికి దోహదపడతాయని ప్రముఖ సినీ కథానాయకుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. సోమవారం హైదరాబాద్ వెళ్లేందుకు రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన ఆయన ఉదయం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మానవ విలువలు ఆర్థిక విలువలను అధిగమిస్తాయన్నారు. ఈనెల 14న విడుదలైన హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా నీతి, నిజాయితీలకు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. వెంకట్రామయ్య అవినీతిపై నిరంతరం పోరాడి విజయం సాధిస్తాడన్నారు. పై అధికారుల తప్పుడు నిర్ణయాలను, ఆర్థిక సమస్యలు చేధించడమే ఇతివృత్తంగా తీసుకున్నట్టు చెప్పారు. వ్యవస్థపరంగా, రాజకీయపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎలా అ«ధిగమిస్తాడనేది సారాంశంగా నిలుస్తుందని, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తుందన్నారు. సినిమాలో ప్రముఖ సినీనటి జయసుధ కథానాయికగా నటించగా, దర్శకనిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సినిమాను అద్భుతంగా రూపొందించారన్నారు. నదులు అనుసంధానం కావాలి ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కె.ఎల్.రావు చెప్పినట్టు గంగ నుంచి గోదావరి వరకు నదులు అనుసంధానం ద్వారా దే శం సస్యశ్యామలం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గో దావరి, కృష్ణ, పెన్న నదులను అనుసంధానం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి, ఏలేరు, నాగవళి, గోస్తని నదులను అనుసంధానం చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్య లు చేపట్టాలన్నారు. ముందుగా ఎయిర్‌పోర్టు రోడ్డులో ఆయన వాకింగ్ చేసి హల్చల్సృష్టించారు. ఆదివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన సోమవారం ఉదయం స్పైస్‌జెట్ విమానంలో హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. ఆయనకు బూరుగుపూడి మాజీ సర్పంచ్ కంటే వీరవెంకటసత్యనారాయణ వీడ్కోలు తెలిపారు. -
మెరుగైన సేవలు అందిస్తేరోజూ దసరానే..
భూపాలపల్లి: ఆంధ్రుడినైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సహకరించా. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1953లోనే చెప్పాడు. హి రెకమండెడ్ తెలంగాణ అండ్ విదర్బ స్టేట్స్ అని సినీ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆచార్య జయశంకర్ జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కోటి గొంతుకలతో గొంతుకలిపా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం «న్యాయమైందని భావించి కోటి గొంతుకలతో గొంతు కలిపా.. అడుగుల్లో అడుగువేశా. చిన్న రాష్ట్రాలతో నీళ్లు, నియామకాలు, నిధులు స్థానికులే అనుభవించే మార్గం సుగమం అవుతుంది. అందుకే ఉద్యమానికి సహకరించా. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు వారంతా కలిసే ఉండాలి. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిపై దృష్టి సారించి ముందుకు సాగుతుండటం సంతోషకరం. అద్భుత ఫలితాలు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 14 జిల్లాలను 31 జిల్లాలకు పెంచడం హర్షించదగిన విషయం. చిన్న జిల్లాలతో పరిపాలనా సౌలభ్యం పెరుగుతుంది. జిల్లా యంత్రాంగం కనుసన్నల్లో ఉంటుంది. కష్టనష్టాలు వస్తే ప్రజలు సరాసరి జిల్లా అధికారులను సంప్రదిస్తే సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. అలాగే జిల్లా కేంద్రంతో పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయి. నిన్నటి భూపాలపల్లి.. ఈ రోజు భూపాలపల్లి పట్నం.. రేపు గొప్ప సిటీ కాబోతోంది. ఈ జిల్లాలో సహజ వనరు లు పుష్కలంగా ఉన్నాయి. సింగరేణి, కేటీపీపీ, కాళేశ్వరం, మేడారం జాతరతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. రాజకీయ నాయకులు వస్తారు.. పోతారు. అధికారులు మెరుగైన సేవలు అందిస్తే ప్రజలకు ప్రతి రోజు దసరానే. ఆదివాసీలు బుద్ధిష్టులు.. ఆదివాసీలు బుద్ధిష్టులు. వారికి కోరికలు ఉండవు. వారు నేటికి దోపిడీకి గురవుతున్నారు. ఆదివాసీలకు రక్షణ కవచంలా ఉన్న 1/17 యాక్ట్‌కు తూట్లు పొడవకుండా, షెడ్యుల్ 5, 6లను విచ్ఛిన్నం చేయకుండా రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వం అమలు చేయాలి. గ్లోబలైజేషన్, మెకానైజేష¯ŒSతో కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. ఆ వర్ణాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేనిపక్షంలో మిగులు భూములను పంచాలి. దళితులకు మూడెకరాల భూమిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలి. -
మట్టి నుంచి, చెమట నుంచి ఆర్.నారాయణమూర్తి కథలు పుడతాయి
‘‘కళాశాలలో ఫ్యూన్‌గా పనిచేసే ఓ పేద తండ్రి కథ ఇది. తన ఇద్దరు కూతుళ్లకూ జరిగిన అన్యాయానికి ఆ తండ్రి ఎలా ప్రతిస్పందించాడు? తదనంతరం జరిగిన పరిణామాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే నా ‘నిర్భయ భారతం’’’ అన్నారు ఆర్.నారాయణమూర్తి. ఢిల్లీలో జరిగిన నిర్భయ దుర్ఘటన ఆధారంగా స్వీయ దర్శకత్వంలో ఆయన నటించి, నిర్మించిన ఈ చిత్రం పాటలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. శేఖర్‌కమ్ముల ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని బి.జయ, వందేమాతరం శ్రీనివాస్‌లకు అందించారు. ఇంకా నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ‘నిర్భయ భారతం’ వరకూ నా సినిమాల ద్వారా సమస్యలతో పోరాడుతూనే ఉన్నాను. కమిట్మెంట్తో ముందుకెళుతున్నాను. ఈ సినిమా ద్వారా నేను చెప్పాలనుకుంది ఒక్కటే. ‘నేరానికి వెంటనే శిక్ష పడాలి’. సమాజానికి కావాల్సింది ఇదే. ప్రపంచం మొత్తాన్నీ నిర్భయ ఒక చోటకు చేర్చింది. అందుకే ఆడకూతురున్న ప్రతి ఇంటివారూ చూడాల్సిన సినిమా. నిర్భయ గురించి స్పందించిన వారిలో పదిశాతం మంది ఈ సినిమా చూసి స్పందించినా సినిమాకు భారీ విజయం తథ్యం. వరంగల్ శ్రీనివాస్, సాయిచంద్, ధర్మవరపు వెంకటరమణ, దయా నర్శింగ్, యష్పాల్ తదితర ప్రజాకవులు నా సినిమాకు పాటలందించారు’’ అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ -‘‘ప్రతి ఒక్కరి హృదయాన్ని నిర్భయ ఉదంతం కదిలించింది. నా వరకూ నేను నా పరిధి మేరకు ఈ దుర్ఘటనపై పోరాటం చేశాను. కళాశాలలు తిరిగి మరీ విద్యార్థులను చైతన్య పరిచాను. కానీ అది చాలదు. దర్శకునిగా వెండితెర ఆయుధంగా ఏదైనా చేయాలి? అని అనుకుంటున్న సమయంలో నారాయణమూర్తిగారు ‘నిర్భయ భారతం’ ప్రకటించారు. ఈ కథకు ఆయన చేసినంత న్యాయం ఎవరూ చేయలేరని నా అభిప్రాయం’’ అని చెప్పారు. ‘‘నారాయణమూర్తి కథలు ఏసీ గదుల్లో పుట్టవ్. ఇంగ్లిష్ సినిమాల కథల్ని కాపీ కొట్టడం నారాయణమూర్తికి తెలీదు. మట్టి నుంచి, చెమట నుంచి ఆర్.నారాయణమూర్తి కథలు పుడతాయి. మనసు మండితే మాటలు పుడతాయి. అదీ నారాయణమూర్తి అంటే’’ అని జొన్నవిత్తుల అన్నారు. విప్లవ చిత్రాల్లో నారాయణమూర్తి ‘అర్ధరాత్రి స్వతంత్రం’ ఓ భగవద్గీత లాంటిదని వరంగల్ శ్రీనివాస్ అన్నారు.