భూపాలపల్లి: ఆంధ్రుడినైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సహకరించా. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1953లోనే చెప్పాడు. హి రెకమండెడ్ తెలంగాణ అండ్ విదర్బ స్టేట్స్ అని సినీ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆచార్య జయశంకర్ జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
కోటి గొంతుకలతో గొంతుకలిపా..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం «న్యాయమైందని భావించి కోటి గొంతుకలతో గొంతు కలిపా.. అడుగుల్లో అడుగువేశా. చిన్న రాష్ట్రాలతో నీళ్లు, నియామకాలు, నిధులు స్థానికులే అనుభవించే మార్గం సుగమం అవుతుంది. అందుకే ఉద్యమానికి సహకరించా. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు వారంతా కలిసే ఉండాలి. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిపై దృష్టి సారించి ముందుకు సాగుతుండటం సంతోషకరం.
అద్భుత ఫలితాలు..
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 14 జిల్లాలను 31 జిల్లాలకు పెంచడం హర్షించదగిన విషయం. చిన్న జిల్లాలతో పరిపాలనా సౌలభ్యం పెరుగుతుంది. జిల్లా యంత్రాంగం కనుసన్నల్లో ఉంటుంది. కష్టనష్టాలు వస్తే ప్రజలు సరాసరి జిల్లా అధికారులను సంప్రదిస్తే సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. అలాగే జిల్లా కేంద్రంతో పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయి. నిన్నటి భూపాలపల్లి.. ఈ రోజు భూపాలపల్లి పట్నం.. రేపు గొప్ప సిటీ కాబోతోంది. ఈ జిల్లాలో సహజ వనరు లు పుష్కలంగా ఉన్నాయి. సింగరేణి, కేటీపీపీ, కాళేశ్వరం, మేడారం జాతరతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. రాజకీయ నాయకులు వస్తారు.. పోతారు. అధికారులు మెరుగైన సేవలు అందిస్తే ప్రజలకు ప్రతి రోజు దసరానే.
ఆదివాసీలు బుద్ధిష్టులు..
ఆదివాసీలు బుద్ధిష్టులు. వారికి కోరికలు ఉండవు. వారు నేటికి దోపిడీకి గురవుతున్నారు. ఆదివాసీలకు రక్షణ కవచంలా ఉన్న 1/17 యాక్ట్‌కు తూట్లు పొడవకుండా, షెడ్యుల్ 5, 6లను విచ్ఛిన్నం చేయకుండా రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వం అమలు చేయాలి. గ్లోబలైజేషన్, మెకానైజేష¯ŒSతో కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. ఆ వర్ణాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేనిపక్షంలో మిగులు భూములను పంచాలి. దళితులకు మూడెకరాల భూమిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలి.