మట్టి నుంచి, చెమట నుంచి ఆర్.నారాయణమూర్తి కథలు పుడతాయి
‘‘కళాశాలలో ఫ్యూన్‌గా పనిచేసే ఓ పేద తండ్రి కథ ఇది. తన ఇద్దరు కూతుళ్లకూ జరిగిన అన్యాయానికి ఆ తండ్రి ఎలా ప్రతిస్పందించాడు? తదనంతరం జరిగిన పరిణామాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే నా ‘నిర్భయ భారతం’’’ అన్నారు ఆర్.నారాయణమూర్తి. ఢిల్లీలో జరిగిన నిర్భయ దుర్ఘటన ఆధారంగా స్వీయ దర్శకత్వంలో ఆయన నటించి, నిర్మించిన ఈ చిత్రం పాటలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
శేఖర్‌కమ్ముల ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని బి.జయ, వందేమాతరం శ్రీనివాస్‌లకు అందించారు. ఇంకా నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ‘నిర్భయ భారతం’ వరకూ నా సినిమాల ద్వారా సమస్యలతో పోరాడుతూనే ఉన్నాను. కమిట్‌మెంట్‌తో ముందుకెళుతున్నాను. ఈ సినిమా ద్వారా నేను చెప్పాలనుకుంది ఒక్కటే. ‘నేరానికి వెంటనే శిక్ష పడాలి’. సమాజానికి కావాల్సింది ఇదే. ప్రపంచం మొత్తాన్నీ నిర్భయ ఒక చోటకు చేర్చింది.
అందుకే ఆడకూతురున్న ప్రతి ఇంటివారూ చూడాల్సిన సినిమా. నిర్భయ గురించి స్పందించిన వారిలో పదిశాతం మంది ఈ సినిమా చూసి స్పందించినా సినిమాకు భారీ విజయం తథ్యం. వరంగల్ శ్రీనివాస్, సాయిచంద్, ధర్మవరపు వెంకటరమణ, దయా నర్శింగ్, యష్‌పాల్ తదితర ప్రజాకవులు నా సినిమాకు పాటలందించారు’’ అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ -‘‘ప్రతి ఒక్కరి హృదయాన్ని నిర్భయ ఉదంతం కదిలించింది. నా వరకూ నేను నా పరిధి మేరకు ఈ దుర్ఘటనపై పోరాటం చేశాను. కళాశాలలు తిరిగి మరీ విద్యార్థులను చైతన్య పరిచాను. కానీ అది చాలదు.
దర్శకునిగా వెండితెర ఆయుధంగా ఏదైనా చేయాలి? అని అనుకుంటున్న సమయంలో నారాయణమూర్తిగారు ‘నిర్భయ భారతం’ ప్రకటించారు. ఈ కథకు ఆయన చేసినంత న్యాయం ఎవరూ చేయలేరని నా అభిప్రాయం’’ అని చెప్పారు. ‘‘నారాయణమూర్తి కథలు ఏసీ గదుల్లో పుట్టవ్. ఇంగ్లిష్ సినిమాల కథల్ని కాపీ కొట్టడం నారాయణమూర్తికి తెలీదు. మట్టి నుంచి, చెమట నుంచి ఆర్.నారాయణమూర్తి కథలు పుడతాయి. మనసు మండితే మాటలు పుడతాయి. అదీ నారాయణమూర్తి అంటే’’ అని జొన్నవిత్తుల అన్నారు. విప్లవ చిత్రాల్లో నారాయణమూర్తి ‘అర్ధరాత్రి స్వతంత్రం’ ఓ భగవద్గీత లాంటిదని వరంగల్ శ్రీనివాస్ అన్నారు.