‘సినిమా వాళ్లు మాత్రమే అని భ్రమ కలిగిస్తున్నారు’
అమరావతి: డ్రగ్స్ కేసులో కేవలం సినిమా రంగాన్నే టార్గెట్ చేయడం సరికాదని సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. సిట్ అధికారులు, మీడియా కలిసి సినిమాలు తీసేవాళ్లకే సినిమా చూపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్. నారాయణమూర్తి సోమవారమిక్కడ మాట్లాడుతూ సినిమా వాళ్లు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నట్లు భ్రమ కలిగిస్తున్నారన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన ఉద్యోగులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు కూడా డ్రగ్స్ వాడుతున్నారని నారాయణమూర్తి అన్నారు.
వాళ్ల అందరిని వదిలేసి కేవలం సినిమా వాళ్లనే ఫోకస్ చేయడం సరికాదన్నారు. మన దేశంలో 1960 నుంచి డ్రగ్స్ వాడకం ఉందని, దీన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఓ వైపు సిగరేట్, మద్యం బాటిల్స్ మీద ఆరోగ్యానికి హానికరం అంటూనే ఆదాయం కోసం ప్రభుత్వాలే వాటిని ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఇక స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్‌కి బానిసలుగా మారడం బాధాకరమన్నారు. ఈ కేసులో మూలాలు వెతికి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నారాయణమూర్తి అన్నారు.
కాగా డ్రగ్స్ మాఫియా కేసులో పలువురు సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ నోటీసులు అందుకున్నవారిలో పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్ హాజరు కాగా, ఇవాళ నవదీప్ సిట్ ఎదుట విచారణకు హాజరు అయ్యారు.