ముగిసిన శ్యామ్ కె నాయుడు విచారణ
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కెమెరామన్ శ్యామ్ కె నాయుడు విచారణ ముగిసింది. ఉదయం 10 గంటలకు తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. సుమారు ఐదున్నర గంటల పాటు సాగింది. డ్రగ్స్ మాఫియా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో శ్యామ్ కె నాయుడు సంబంధాలపై సిట్ ఆరా తీసింది. అయితే తనకు సిగరెట్ అలవాటే లేదని, కెల్విన్ ఎవరో తనకు తెలియదని ఆయన సిట్ విచారణలో తెలిపినట్లు సమాచారం. కాగా నిన్న దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను సిట్ బృందం విచారణ చేసింది. అలాగే శుక్రవారం నటుడు సుబ్బరాజును విచారణ చేయనుంది.
విచారణ అనంతరం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాట్లాడుతూ.. విచారణకు శ్యామ్ కె నాయుడు సహకరించినట్లు తెలిపారు. డ్రగ్స్ కేసు వ్యవహారం ఆషామాషీ కాదని, చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నోటీసులు అందుకున్నవారు దర్యాప్తుకు సహకరిస్తే సాధ్యమైనంత త్వరలో విచారణ పూర్తి చేస్తామని చంద్రవదన్ పేర్కొన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇవాళ మూడు కొరియర్ సంస్థలతో సమావేశం అయ్యారు. డీహెచ్‌ఎల్, బ్లూ డాట్, ఫెడెక్స్ కొరియర్ సంస్థల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఇతర దేశాల నుంచి డ్రగ్స్ కొరియర్ ద్వారా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.