Robin Minz
-
IPL 2024: కీలక ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసిన గుజరాత్, రాజస్థాన్
ఐపీఎల్ 2024 సీజన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు వివిధ కారణాల చేత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో గుజరాత్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు తమను మిస్ అయిన కీలక ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేశాయి. వేలంలో జాక్‌పాట్ (3.6 కోట్లు) కొట్టి, బైక్ యాక్సిడెంట్ కారణంగా సీజన్ మొత్తానికే దూరమైన యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ స్థానాన్ని గుజరాత్ యాజమాన్యం మరో వికెట్‌కీపర్ బ్యాటర్ బీఆర్ శరత్‌తో (కర్ణాటక) భర్తీ చేయగా.. వ్యక్తిగత కారణాల చేత సీజన్ నుంచి తప్పుకున్న ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా (1.5 కోట్లు) స్థానాన్ని రాజస్థాన్ రాయల్స్ ముంబై స్పిన్నర్ బ్యాటర్ తనుశ్ కోటియన్తో భర్తీ చేసింది. (తనుశ్ కోటియన్) కొత్తగా భర్తీ చేయబడ్డ శరత్, తనుశ్లను ఆయా ఫ్రాంచైజీలు బేస్ ధర 20 లక్షలకు సొంతం చేసుకున్నాయి. వీరిద్దరూ అతి త్వరలో ఆయా జట్లతో చేరతారని తెలుస్తుంది. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల రవి శరత్ కర్ణాటక తరఫున 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 42 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 28 టీ20లు ఆడి 1600 పైచిలుకు పరుగులు సాధించాడు. వికెట్‌కీపింగ్‌లో అతను మొత్తంగా 162 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. (బీఆర్ శరత్) ముంబై రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన 25 ఏళ్ల తనుశ్ కోటియన్ సొంత జట్టు తరఫున 26 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 19 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 23 టీ20లు ఆడాడు. ఇందులో అతను 119 వికెట్లు 1300లకు పైగా పరుగులు చేశాడు. తనుశ్ ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ కీలక మ్యాచ్‌లో 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేశాడు. ఇతని ఖాతాలో 11 ఫస్ట్‌క్లాస్ హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ప్రారంభంకాబోయే ఐపీఎల్ 2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న (ముంబైతో) ఆడనుండగా.. రాజస్థాన్ రాయల్స్ మార్చి 24ననే జరిగే మరో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. ఇవాళ జరిగే సీజన్ ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది. -
గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. రూ. 3 కోట్ల ఆటగాడు దూరం
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ వికెట్ కీపర్ రాబిన్ మింజ్ ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా శనివారం ధ్రువీకరించాడు. జార్ఖండ్‌కు చెందిన రాబిన్ మింజ్ ఇటీవల బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మింజ్ ప్రస్తుతం కోలుకునే క్రమంలో ఉన్నాడు. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడానికి 4 నుంచి 6 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికి మింజ్ దూరమయ్యాడు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రాబిన్ మింజ్‌ను రూ. 3.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో వేలంలో అమ్ముడు పోయిన మొట్ట మొదటి ఆదివాసీ క్రికెటర్‌గా నిలిచాడు. కానీ దురదృష్టం మాత్రం అతడిని రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. తన తొలి సీజన్లో సత్తాచాటాలని భావించిన మింజ్.. ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. -
రోడ్డు ప్రమాదానికి గురైన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్
గుజరాత్ టైటాన్స్ యువ వికెట్‌కీపర్, ఐపీఎల్ 2024 వేలంలో ఊహించని ధర దక్కించుకున్న ఝార్ఖండ్ ఆటగాడు రాబిన్ మింజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శనివారం రాంచీలో బైక్‌పై వెళ్తుండగా రాబిన్ ప్రయాణిస్తున్న కవాసకీ సూపర్‌బైక్ అదుపు తప్పి వేగంగా వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో రాబిన్ టూ వీలర్ నుజ్జుగుజ్జయ్యింది. స్వల్ప గాయాలతో రాబిన్ బయటపడ్డాడు. ప్రమాదంలో రాబిన్‌కు పెద్ద దెబ్బలు ఏవీ తగల్లేదని అతని తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ ధృవీకరించాడు. ప్రస్తుతం రాబిన్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఆయన తెలిపాడు. 21 ఏళ్ల రాబిన్‌ను 2024 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 3.6 కోట్లకు సొంతం చేసుకుంది. రాబిన్ తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తాడు. కొద్ది రోజుల కిందటే అతను.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కలిసాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటో నెట్టింట వైరలైంది. రాబిన్ ఇటీవల కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో క్వార్టర్ ఫైనల్లో సెంచరీతో (137) మెరిశాడు. ఆ మ్యాచ్‌లో రాబిన్ శతక్కొట్టినా అతను ప్రాతినిథ్యం వహించిన ఝార్ఖండ్ టీమ్ ఓటమిపాలైంది. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ వికెట్‌కీపర్ అయిన రాబిన్.. ఆదివాసీ తెగకు చెందిన ఆటగాడు. ఈ బ్యాక్ గ్రౌండ్ నుంచి పై స్థాయి క్రికెట్ ఆడే అవకాశం రావడం అంటే ఆషామాషీ విషయం కాదు. రాబిన్ మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రీ సీజన్ క్యాంప్‌లో జాయిన్ కావాల్సి ఉండింది,. అయితే ఈ ప్రమాదం కారణంగా అతను కాస్త ఆలస్యంగా జట్టుతో చేరతాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు సంబంధించిన తొలి షెడ్యూల్ కొన్ని రోజుల కిందటే విడుదలైంది. తొలి విడతగా 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు నిర్వహకులు. గుజరాత్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24వ తేదీన ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్.. ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.