ప్రపంచంలోనే అతిచిన్న ద్రోన్..
రాజమౌళి సినిమాలో ఈగ మాదిరిగా రకరకాల విన్యాసాలు చేసే ఈ ‘రోబో ఈగ’ ప్రపంచంలోనే అతిచిన్న ద్రోన్ . కార్బన్ ఫైబర్‌తో తయారుచేసిన ఈ ద్రోన్ 106 మిల్లీగ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. తలపై పిరమిడ్ ఆకారంలో ఉండే లైట్ సెన్సర్ ఆధారంగా దేహాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎలక్ట్రానిక్ కండరాలతో రెక్కలను ఆడిస్తూ ఇది ముందుకెళుతుంది. తేలికైన, అతిసన్ననైన తీగ సాయంతో విద్యుత్‌ను అందుకుని పనిచేస్తుంది.
భవనాలు కూలినప్పుడు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు చిన్న రంధ్రాల్లోంచి సైతం శిథిలాల కిందికి వెళ్లి పరిస్థితిని తెలియజేసేందుకు, పర్యావరణ సంబంధిత పర్యవేక్షణకు, వివిధ పంటల మధ్య పరాగ సంపర్కం జరపడానికీ ఈ రోబో ఈగ ఉపయోగపడుతుందట. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమను తాము వేగంగా నియంత్రించుకుంటూ కీటకాలు ఎగరడాన్ని స్ఫూర్తిగా తీసుకున్న హార్వార్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు.