2020 నాటికి చౌకగా రోబోటిక్ సర్జరీలు
రోబోటిక్ సదస్సులో ప్రముఖ ఆంకోసర్జన్ నామ్కిమ్
సాక్షి, హైదరాబాద్: ‘రోబోల తయారీలో అమెరికా కంపె నీలదే గుత్తాధిపత్యం. 2020 నాటికి మరో 3 కంపెనీలు రోబోలను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. వీటి రాకతో రోబో ఖరీదు తగ్గడంతో పాటు ఇప్పటి వరకు వాటి ద్వారా చేస్తున్న చికిత్సల ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది’ అని ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కొలోరెక్టల్ సర్జరీలు చేసిన ప్రముఖ రోబోటిక్ ఆంకోసర్జన్ డాక్టర్ నామ్కిమ్ చెప్పారు. యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన రోబోటిక్ మినిమల్లీ ఇన్వేసివ్ ఆంకోసర్జరీ (ఎంఐఓఎస్) లైవ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. వైద్య రంగంలో రోబోల ప్రవేశంతో క్లిష్టమైన గొంతు, పెద్దపేగు, చిన్నపేగు కేన్సర్‌తో పాటు మెదడు చికిత్సలు సులభమైనట్లు తెలిపారు. రోబోల తయారీలో అమెరికా గుత్తాధిపత్యం కొనసాగుతోందని, వారు నిర్ణ యించిన ధరలకే వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని, పరోక్షంగా ఆ భారం రోగులపై పడుతుందన్నారు. రోబో చికిత్సలకు ఇన్సూరెన్స్‌ను వర్తింపజేయకపోవడం, ఖరీదు కావడంవల్ల పేద, మధ్యతరగతి రోగులకు ఈ సేవలు అందడంలేదన్నారు.
వేపుళ్లు.. మసాలాల వల్లే...
యశోద ఆస్పత్రి రోబోటిక్ సర్జన్ డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ... వేపుళ్లు, కాల్చిన మాంసం, మసాలా ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్లే మిగతా దేశాలతో పోలిస్తే అధిక శాతం మంది భారతీయులు పెద్ద పేగు కేన్సర్‌కు గురవుతున్నారన్నారు. నగరంలో వారానికి 3 పెద్దపేగు, 2 రొమ్ము, 3 గర్భాశయ, 2 ప్రొస్టేట్ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జి.సురేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.