rolled
-
ఒడిశా : లోయలోకి దూసుకెళ్లిన బస్సు
భువనేశ్వర్ : ఒడిశాలో ప్రమాదవశాత్తూ శుక్రవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ బస్సు లోయలో పడిపోయింది. కందమాల్ జిల్లా గడియపొడ ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని.. వీరిలో 25 మంది గాయపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.పుల్వాని నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. -
పెళ్ళి బస్సు బోల్తా : ముగ్గురికి తీవ్రగాయాలు
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లాలో శనివారం రాత్రి ఓ పెళ్లి బస్సు బోల్తాపడిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా..అందులో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. తుని నుంచి కాకినాడ బయలుదేరిన పెళ్లి బృందం బస్సు పిఠాపురంలోని పెందుర్తి జంక్షన్ వద్దకు చేరుకోగానే బ్రేకులు ఫెయిలై బస్సు బోల్తాపడింది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా లక్ష్మీ(45) అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటనలో నాలుగేళ్ళ చిన్నారి చైతన్య సురక్షితంగా బయటపడ్డాడు. -
ఆటో బోల్తా..15 మందికి గాయాలు
బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం ఓ ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలు కాగా..అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారంతా రెబ్బన మండలం పులికుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బెల్లంపల్లిలోని బుగ్గదేవాలయానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సిలిండర్ల లారీ బోల్తా
మహబూబ్నగర్(మానవపాడు): ఖాళీ సిలిండర్లతో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న లారీ ఒకటి ప్రమాదవశాత్తూ గురువారం ఉదయం 7 గంటలకు బోల్తా పడింది. ఈ ప్రమాదం మహబూబ్ నగర్ జిల్లా మానవపాడు మండలం ఉండవెల్లి శివారులో జరిగింది. సిలిండర్లు రహదారిపై చెల్లాచెదురగా పడి ఉన్నాయి. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. లారీలో ఖాళీ సిలిండర్లు మాత్రమే ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. జాతీయ రహదారి సిబ్బంది పట్టించుకోకపోవడంతో 44వ జాతీయ రహదారిపై సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. -
ఆర్టీసీ బస్సు బోల్తా..
అనంతపురం(కనగానపల్లి): అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని దాదులూర్ సమీపంలో 44 వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది. -
కాలువలో పడ్డ స్కూల్ బస్సు
తడ (నెల్లూరు): వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా తడ మండలం ఎన్ఎమ్ కంద్రిగ (పెద్ద,చిన్న మాంబట్టు పంచాయతీ) వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. సూళ్లూరుపేటలోని నారాయణ స్కూల్కు చెందిన బస్సు పిల్లలను తీసుకొని బయలుదేరింది. డ్రైవర్ సింగిల్ రోడ్డులో వేగంగా బస్సును నడపడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కాలువలో పడింది. దీంతో బస్సులో ఉన్న ఏడుగురికి గాయాలయ్యాయి. కాగా, ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. పిల్లల్ని గ్రామస్తులు సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. పిల్లల గురించి విచారించాల్సిన నారాయణ స్కూల్ యాజమాన్యం సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.