Rome Olympics
-
ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: భారత్ ఫుట్‌బాల్‌లో ‘స్వర్ణయుగం’లాంటి గత తరానికి ప్రతినిధిగా నిలిచిన ఆటగాళ్లలో మరొకరు నిష్క్రమించారు. నగరానికి చెందిన ప్రముఖ ఫుట్‌బాలర్, 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్న సయ్యద్ షాహిద్ హకీమ్ ఆదివారం గుల్బర్గాలో కన్ను మూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. డెంగీ సోకడంలో ఆయనను ఆస్పత్రిలో చేర్చామని, చికిత్స పొందుతుండగానే గుండెపోటుతో హకీమ్ మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత ఏడాది జూలైలో కోవిడ్ బారిన పడిన ఆయన అనం తరం కోలుకున్నారు. భారత ఫుట్‌బాల్‌లో దిగ్గజ కోచ్ అయిన ఎస్ఏ రహీమ్ కుమారుడైన హకీమ్... ఆటకు అందించిన సేవలకుగాను 2017లో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్ అవార్డు’ అవార్డును కూడా అందుకున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా... తండ్రి రహీమ్ అడుగుజాడల్లో ఫుట్‌బాల్‌లోకి అడుగు పెట్టిన హకీమ్ సుమారు 25 ఏళ్ల పాటు ఆటతో తన అనుబంధాన్ని కొనసాగించారు. హకీమ్ అద్భుత ప్రదర్శనతోనే హైదరాబాద్ జట్టు 1956, 1957 లలో వరుసగా రెండు సార్లు ప్రఖ్యాత సంతోష్ ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. సెంట్రల్ మిడ్‌ఫీల్డర్‌గా, హాఫ్ బ్యాక్ స్థానంలో ఆయన తన ప్రతిభను ప్రదర్శించారు. 1950వ, 60వ దశకాల్లో భారత కీలక ఆటగాడిగా నిలిచిన హకీమ్...1960 రోమ్ ఒలింపిక్స్‌లో ఆరో స్థానంలో నిలిచిన మన టీమ్‌లో భాగంగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత రిఫరీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన హకీమ్...1989 వరకు 33 అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. అనంతరం తండ్రి బాటలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన హకీమ్...శిక్షకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన శిక్షణలో మహీంద్రా అండ్ మహీంద్రా జట్టు 1988లో అత్యంత పటిష్టమైన ఈస్ట్ బెంగాల్‌ను ఓడించి ప్రతిష్టాత్మక డ్యురాండ్ కప్‌ను గెలుచుకోవడం హకీమ్ కెరీర్లో మరచిపోలేని ఘట్టం. సాల్గావ్కర్, బెంగాల్ ముంబై ఎఫ్‌సీ జట్లకు కూడా ఆయన కోచ్‌గా వ్యవహరించారు. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఆయన పని చేశారు. ఆపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో రీజినల్, ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా దశాబ్ద కాలం పాటు సేవలందించారు. ఎయిర్‌ఫోర్స్‌లో సుదీర్ఘ కాలం స్క్వాడ్రన్ లీడర్ హోదాలో పని చేసిన హకీమ్ అదే క్రమశిక్షణ, నిజాయితీని అన్ని చోట్లా చూపించేవారు. ఫుట్‌బాలర్లకు మేలు చేసేందుకు ‘ఆఖరి విజిల్’ వరకు పోరాడేందుకు సిద్ధమని చెబుతూ ఉండే హకీమ్...తన ఆటగాళ్లకు సరైన సౌకర్యాలు కల్పించమంటూ ఒక దశలో ‘సాయ్’ అధికారులతో తలపడేందుకు సిద్ధమయ్యారు. దాంతో సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వం ఆయన పెన్షన్, ఇతర సౌకర్యాలనూ నిలిపివేసింది. అయినా తగ్గకుండా తాను నమ్మిన బాటలోనే చివరి వరకు నడిచారు. చదవండి: ఇంగ్లండ్ ఆటగాళ్లు అతి చేస్తుంటే కోచ్ ఏం చేస్తున్నాడు..? -
ఒలింపిక్స్‌లో స్వర్ణం మిస్సయిన మిల్కా సింగ్..
న్యూఢిల్లీ: జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి నిత్యం శ్రమించాలి. ఏమాత్రం ఏమారపాటుగా ఉన్న వెంటుకవాసిలో ఓటమి పాలవుతాం. చదువు విషయానికి వస్తే పరీక్షల ముందు ప్రిపేరషన్ ప్రారంభించినా సరిపోతుందేమో కానీ.. క్రీడల విషయంలో మాత్రం అలా కాదు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఒలింపిక్స్ జరిగేది నాలుగేళ్లకోసారి కదా.. మూడో ఏట నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతానంటే సరిపోదు. నాలుగేళ్లు శ్రమిస్తేనే మన కల సాకారం అవుతుంది అంటారు అభినవ్ బింద్రా. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డ్ సృష్టించారు అభినవ్ బింద్రా. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించారు. అయితే అభినవ్ విజయం కన్నా దాదాపు 50 ఏళ్ల ముందే భారత్ ఖాతాలో ఈ రికార్డు నమోదయ్యేది. అది కూడా పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ వల్ల. కానీ దురదృష్టం కొద్ది ఆ అవకాశం చేజారింది. ఈ విషయాన్ని స్వయంగా మిల్కా సింగ్ తెలిపారు. ఇండియాటుడేకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి వెల్లడించారు. ఆ వివరాలు.. 1958లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 200మీటర్లు, 400 మీటర్ల విభాగంలో మిల్కా సింగ్ స్వర్ణం గెలిచారు. ఆ తర్వాత మిల్కా సింగ్ లక్ష్యం 1960లో జరిగిన రోమ్ ఒలింపిక్స్. అందుకోసం తీవ్రంగా శ్రమించారు మిల్కా సింగ్. అప్పటికి ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు మిల్కా సింగ్ స్వర్ణం గెలుస్తారని భావించారు. కానీ దురదృష్టం కొద్ది ఆయన నాలుగో స్థానానికే పరిమితం అయ్యారు. ఈ బాధ తనను జీవితాంతం వెంటాడుతుందన్నారు మిల్కా సింగ్. ఇండియాటుడేకిచ్చిన ఇంటర్వ్యూలో మిల్కా సింగ్ మాట్లాడుతూ.. ‘‘1960 రోమ్ ఒలింపిక్స్‌లో సెమి ఫైనల్స్, ఫైనల్స్ మధ్య రెండు రోజుల విరామం ఉంది. ఆ 2 రోజులు నామీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ప్రపంచం నన్ను గమనిస్తుంది.. నేను తప్పక విజయం సాధించాలని భావించాను. రోమ్కు వెళ్లడానికి ముందు ప్రతి ఒక్కరు నేను 400మీటర్ల విభాగంలో స్వర్ణం సాధిస్తానని భావించారు. రేసులో నేను ముందంజలో ఉన్నాను. 200మీటర్ల దూరాన్ని 21 సెకన్లలో పూర్తి చేశాను. ఇప్పటివారికి ఇది పూర్తిగా అసాధ్యం. అయితే అదే వేగంతో వెళ్తే నేను రేస్ పూర్తి చేయలేనని భావించి నా వేగాన్ని కాస్త తగ్గించాను. అదే నేను చేసిన పెద్ద తప్పదం. ఆ తర్వాత నేను ఎంత ప్రయత్నించినా మునుపటి వేగాన్ని అందుకోలేకపోయాను. ఫలితంగా నాలుగో స్ధానంలో నిలిచాను. ఇది నా దురదృష్టం కాదు.. ఇండియాది. చనిపోయే వరకు ఈ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది’’ అన్నారు మిల్కా సింగ్. ఈ రేస్‌లో మిల్కా సింగ్ 45.6 సెకండ్స్‌తో నాలుగో స్థానంలో నిలవగా అమెరికాకు చెందిన ఓటిస్ డేవిస్ 44.9 సెకండ్స్లో రేసు ముగించి స్వర్ణం గెలిచాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఒలింపియన్ ఫుట్‌బాలర్ హకీమ్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, 1960 రోమ్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన సయ్యద్ షాహిద్ హకీమ్ కోవిడ్–19 బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని హైదరాబాద్‌కు చెందిన 81 ఏళ్ల హకీమ్ స్వయంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన నగరంలోని ఒక హోటల్లో ప్రభుత్వ పర్యవేక్షణలో క్వారంటైన్లో ఉన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకొని త్వరలోనే ఇంటికి వెళతానని హకీమ్ విశ్వాసం వ్యక్తం చేశారు. హకీమ్‌కు ముందుగా న్యుమోనియా సోకగా... పరీక్షల అనంతరం కరోనాగా తేలింది. గతంలో ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన ఆయన ముందుగా మిలిటరీ ఆస్పత్రిలో చేరేందుకు ప్రయత్నించగా పడకలు అందుబాటులో లేవని తెలిసింది. ప్రభుత్వ ఆస్పత్రిలలో సౌకర్యాలపై సందేహంతో చివరకు హోటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. భారత దిగ్గజ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ (ఎస్ఏ) రహీమ్ కుమారుడైన హకీమ్ రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా, రిఫరీగా కూడా పని చేశారు. ఫుట్‌బాల్‌కు హకీమ్ అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2017లో ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారంతో గౌరవించింది. -
పతకానికి చేరువై.. అంతలోనే దూరమై..
రెప్పపాటులో... వెంట్రుకవాసి తేడాతో... అర క్షణంలో...ఈ మాటలు అప్పుడప్పుడు అలవోకగా మనం వాడేస్తుంటాం. కానీ వాస్తవంలో వచ్చే సరికి వీటి విలువ ఎంత? ఇదే ప్రశ్న మిల్కా సింగ్‌ను అడిగితే ‘జీవిత కాలమంత’ అనే సమాధానం వస్తుందేమో! ఎందుకంటే ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు చేరువై... అంతలోనే దూరమైన విషాదానికి నిలువెత్తు నిదర్శనం మిల్కా సింగ్. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగులో మిల్కా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయిన క్షణాన్ని భారత అభిమానులు మరచిపోలేరు. ఆ తర్వాత ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల ప్రదర్శనను బట్టి చూస్తే... పతకం దక్కకపోయినా నాటి ఘటనకు భారత క్రీడా చరిత్రలో ఉన్న ప్రాతినిధ్యం ఏమిటో అర్థమవుతుంది. ఆ జ్ఞాపకాలన్నీ... రోమ్ ఒలింపిక్స్‌కు ముందే మిల్కా సింగ్ భారత అథ్లెటిక్స్‌కు సంబంధించి తనదైన ప్రత్యేక ముద్ర వేశాడు. దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోవడంతో పాటు అనేక కష్టాలను ఎదుర్కొన్న మిల్కా ఎంతో పోరాటంతో వాటిని అధిగమించాడు. భారత సైన్యంలో చేరడంతో అతని జీవితానికి ఒక దిశ లభించింది. అక్కడే అథ్లెట్‌గా పాఠాలు నేర్చుకున్న అతను కొన్నాళ్లకు పూర్తి స్థాయిలో 400 మీటర్ల పోటీని తన ప్రధాన ఈవెంట్‌గా మార్చుకున్నాడు. 1958 కటక్ జాతీయ క్రీడల్లో 200 మీ., 400 మీ. విభాగాల్లో స్వర్ణాలతో వెలుగులోకి వచ్చిన మిల్కా... అదే ఏడాది టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో ఈ రెండు విభాగాల్లోనే స్వర్ణ పతకాలు గెలుచుకొని తన సత్తా చాటాడు. కొద్ది రోజులకే కార్డిఫ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా 400 మీటర్ల పరుగు (440 గజాలు)లో అగ్ర స్థానంలో నిలవడంతో మిల్కా పేరు మారుమోగిపోయింది. దాంతో దేశవ్యాప్తంగా అతనికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఎక్కడకు వెళ్లినా మిల్కాకు జనం బ్రహ్మరథం పట్టారు. అయితే దురదృష్టవశాత్తూ ఒలింపిక్ వేదికకు వచ్చే సరికి అతను అంచనాలు అందుకోలేకపోయారు. ఫలితంగా 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో మిల్కా 200 మీ., 400 మీ. రెండింటిలో పాల్గొన్నా... హీట్స్ దశను దాటి ముందుకు వెళ్లలేకపోయాడు. గుండె పగిలిన క్షణం... గత ఒలింపిక్స్ నుంచి పాఠాలు నేర్చుకున్న మిల్కా నాలుగేళ్ల పాటు తీవ్రంగా శ్రమించాడు. మెల్బోర్న్లో 400 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన చార్లెస్ జెన్కిన్స్ను కలిసి తన గురించి చెప్పుకున్నాడు. అతని నుంచి ప్రాక్టీస్‌కు సంబంధించి కొత్త తరహా టెక్నిక్‌లు, శిక్షణలో పద్ధతుల గురించి తెలుసుకున్నాడు. దాంతో 1960 రోమ్‌లో పోటీలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమై వచ్చాడు. ఒలింపిక్స్‌కు ముందు సన్నాహకంగా జరిగే రేసులలో అతను అద్భుతమైన టైమింగ్‌లు నమోదు చేయడంతో మళ్లీ అందరి దృష్టి మిల్కాపై పడింది. హీట్స్‌లో, క్వార్టర్ ఫైనల్లో, సెమీ ఫైనల్లో మెరుగైన ప్రదర్శనతో మిల్కా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. గన్ పేలింది... పరుగు ప్రారంభమైంది. ఐదో లేన్‌లో ఉన్న మిల్కా వేగంగా దూసుకుపోయాడు. ఒటిస్ డేవిస్ తర్వాత రెండో స్థానంలో అతను కొనసాగుతున్నాడు. 100 మీ., 200 మీ., 250 మీటర్లు ముగిశాయి. మిల్కాకు మంచి అవకాశం కనిపించింది. అంతలో అనూహ్యం జరిగింది! తన పోటీదారులు ఎక్కడ ఉన్నారో అన్నట్లుగా పరుగెడుతూనే లిప్తకాలం పాటు అతని దృష్టి పక్కకు పడింది. అంతే... ఆ అర క్షణంలోనే వేగం మందగించింది. ఈ చిన్న పొరపాటు మిల్కాసింగ్‌కు జీవిత కాలం బాధను మిగిల్చింది. అప్పటి వరకు వెనుకంజలో ఉన్న ఇద్దరు అథ్లెట్లు దూసుకుపోయారు. కోలుకొని శక్తిమేరా పరుగెత్తేలోపే రేసు ముగిసిపోయింది. ఫలితంగా నాలుగో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఒటిస్ డేవిస్ (అమెరికా –44.9 సె.), కార్ల్ కాఫ్ మన్ (జర్మనీ– 44.9 సె.) తొలి రెండు స్థానాల్లో నిలవగా... కాంస్యం సాధించిన మాల్కమ్ స్పెన్స్ (దక్షిణాఫ్రికా – 45.5 సె.)కు మిల్కా సింగ్ (45.6 సె.) మధ్య తేడా చూస్తే ఆ బాధ ఏమిటో అర్థమవుతుంది. 38 ఏళ్ల పాటు... ‘అధికారికంగా ఫలితాలు ప్రకటించక ముందే నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైపోయింది. 250 మీటర్లు అద్భుతంగా పరుగెత్తిన తర్వాత నెమ్మదించడం నాకు చేటు చేసింది. నేను ఆ వ్యత్యాసాన్ని సరి చేయలేకపోయాను. మా అమ్మానాన్నలు చనిపోయిన తర్వాత నేను ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు. కొన్ని రోజుల పాటు ఏడుస్తూనే ఉండిపోయాను’ అని మిల్కా సింగ్ స్వయంగా చెప్పుకున్నాడు. మ్యాన్యువల్‌గా లెక్కించిన టైమింగ్‌లను ముందుగా ఈ ఈవెంట్లో ఫలితాల సమయంలో ప్రకటించారు. కానీ ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డు ప్రకారం ఆ తర్వాత వాటిని సవరించారు. దీని ప్రకారం మిల్కా 400 మీటర్ల టైమింగ్ అధికారికంగా 45.73 సెకన్లుగా నమోదైంది. భారత్ తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... 1998లో పరమ్‌జీత్ సింగ్ 45.70 సెకన్లలో (జాతీయ చాంపియన్‌షిప్‌లో) రేసు పూర్తి చేయడంతో మిల్కా రికార్డు కనుమరుగైంది. అయితే ఇన్నేళ్ల ఒలింపిక్ చరిత్రలో భారత అథ్లెట్లు ఎవరూ దీనికి సమమైన ప్రదర్శనను ఇవ్వలేకపోయారు. ఒక్క పతకం గెలుచుకోలేకపోగా... మిల్కా తరహాలో కనీసం నాలుగో స్థానం వరకు కూడా వెళ్లలేకపోయారు. ఇది చాలు మిల్కా ఘనత ఏమిటో చెప్పడానికి. –సాక్షి క్రీడా విభాగం