మురిగిన గుడ్లు...పుచ్చిన కూరగాయలు
తనకల్లు: స్థానిక హరిజనవాడలోని అంగన్వాడీ కేంద్రానికి సరఫరా చేసిన కోడిగుడ్లు కుళ్లిపోగా, వంట చేయాడానికి తెచ్చిన కూరగాయలు పుచ్చిపోయాయని విద్యార్థులు తల్లిదండ్రులు విలేకరులతో వాపోయారు. శనివారం వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు మంచి పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తామని బీరాలు ప్రభుత్వం పలుకుతోందే కానీ.. అది వాస్తవ విరుద్ధమన్నారు.
మండలకేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే గ్రామాల్లోని కేంద్రాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. కుళ్లిన గుడ్లు, పుచ్చిపోయిన కూరగాయలు తింటే తమ పిల్లల ఆరోగ్యం ఏం కావాలని వారు ప్రశ్నించారు. ఐసీడీఎస్ అధికారులు ఏజెన్సీల నుంచి ముడుపులు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. ఉన్నాతాధికారులు స్పందించి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ పిల్లలను కేంద్రాలకు పంపేది లేదని వారు హెచ్చరించారు.