కార్ లవర్స్ కు కొత్త సంవత్సరంలో షాక్!
ముంబై: నూతన సంవత్సరం 2017 కార్ లవర్స్ కు భారీగానే షాకిచ్చింది. కొత్త ఏడాదిలో కారు కొనుక్కుందామనుకున్న వారికి భారీగా పెరిగి ధరలు పలకరించనున్నాయి. ఇప్పటికే పలు ధరల పెంపును ప్రకటించగా, తాజా ఈ కోవలోకి మరో రెండు దిగ్గజాలు కూడా చేరిపోయాయి. ప్రముఖ కార్ల దిగ్గజాలు కూడా కొత్త సంవత్సరంలో కార్ లవర్స్ కు నిరాశనే మిగల్చనున్నాయి. మార్కెట్లో టాప్ టు కంపెనీలు మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను అమాంతం పెంచేశాయి. గత కొన్ని నెలల్లోముడి పదార్థం ధరల భారీ పెరుగుదల, ఇటీవలి భారీ డిస్కౌంట్లు, బలహీనపడిన రూపాయి తదితర పరిణామాలను తమ మార్జిన్ మీద ప్రభావం చూపించాయని వెల్లడించాయి.
ఆయా మోడల్స్ పై రూ. 2500 నుంచి లక్ష రూపాయలను పెంచుతున్నట్టు మారుతి ప్రకటించింది. ఇటీవలి కాలంలో అధిక డిస్కౌంట్లు, రూపాయి విలువతగ్గడం సహా పలు కారణాలతో ధరలను పెంచక తప్పలేదని మారుతి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆర్ఎస్ కల్సి తెలిపారు. జనవరిలో రెండు శాతం ధరలు పెంచనున్నట్టు తెలిపారు. ఏ మోడల్ కు ఎంత ధర పెరగనుందీ తమ టీమ్ లెక్కిస్తోందని చెప్పారు.
కొత్త సంవత్సరం సందర్భంగా వినియోగదారులు కార్లకొనుగోలుకు మొగ్గు చూపుతారనే అంచనాలతో ఆటోమోటివ్ పరిశ్రమలో కార్ల ధరలను పెంచడం ఆనవాయితీ. కానీ భారత్ లో అమ్ముడుబోయే ప్రతి రెండు వాహనాల్లో ఒకదాన్ని సాధించే మారుతి సుజికి మాత్రం సంవత్సర ఆరంభంలో వాహనాల ధరల పెంపునకు ఇప్పటి వరకూ దూరంగా ఉంటోందనే చెప్పాలి. మరోవైపు ఆరు నెలల్లో మారుతి కార్ల ధరలను పెంచడం ఇది రెండవ సారి.
దాదాపు ఇదే కారణాలతో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా కార్ల ధరలను 4 వేల లక్షలవరకు పెంచనుంది. తమ అన్ని రకాల కార్లపై ఈ పెంపును జనవరి నుంచి వర్తింప జేయనున్నట్టు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీనివాస్తవ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ ప్రీమియం ఎస్ యూవీ ధర శాంటా ఫే ధర లక్ష రూపాయలు పెరగనుంది.
కాగా డీమానిటైజేషన్ కారణంగా ఇప్పటికే టయోటా, హోండా,మహీంద్రా, టాటా మోటార్స్ ఇప్పటికే ఈ కొత్త సంవత్సరం లో కార్ల ధరలను 3శాతం పెంచాయి. ఇపుడు ఈ దిగ్గజాల అడుగుజాడల్లో మిగిలిన కార్ కంపెనీలు కూడా త్వరలో కార్ల ధరల్ని పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.