బరిలో కోళ్లు.. ఢీ కొట్టిన పొట్టేళ్లు
* గోదావరి జిల్లాల్లో కోడిపందాలజోరు
* తొలిరోజు రూ.100 కోట్ల పందాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : భోగి పండుగనాడు గోదావరి జిల్లాల్లో పందెం కోళ్లు జూలు విదిల్చాయి. పందాలు జరిగే బరులన్నీ పందెంరాయుళ్లు, ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్లోని పోలీసు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో పోలీసు పికెట్లను ఎత్తివేయడంతో పందెం రాయుళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక కృష్ణా జిల్లాలో పొట్టేళ్ల పందాలు నిర్వహించారు. నెల్లూరు ఎడ్లబండ్ల పోటీలు సాగాయి. గురువారం రాత్రి పొద్దుపోయే నాటికి ఉభయగోదావరి జిల్లాల్లో రూ.100 కోట్లు చేతులు మారాయనేది ఓ అంచనా.
ఇక సంక్రాంతి పర్వదినమైన శుక్రవారం, కనుమ రోజైన శనివారం నాటికి ఈ రెండు జిల్లాల్లో మొత్తం రూ.300 కోట్లపైనే చేతులు మారే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గురువారం పాలకొల్లు బైపాస్ రోడ్డులో కోడిపందేలను తిలకించగా, ‘స్వామి రారా’ డెరైక్టర్ సుధీర్ వర్మ కొణితివాడలో పందాలను చూశారు. సంక్రాంతి పర్వదినమైన శుక్రవారం మరింతమంది సినీ, రాజకీయప్రముఖులు తరలిరానున్నారు.
కిక్కిరిసిన భీమవరం, పరిసర గ్రామాలు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం, సమీప గ్రామాలు జాతర్లను తలపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన ఎన్నారైలతో బరులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. గురువారం నాడు భీమవరం పరిసర ప్రాంతాల్లోనే రూ.50 కోట్ల మేర పందాలు జరిగినట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు రూ.25 కోట్ల మేర పందేలు జరిగినట్టు అంచనా.
మినీ స్టేడియంలా ....
అమలాపురం: పదిహేను ఎకరాల సువిశాల స్థలం.. కోడి పందాలు జరిగే బరి చుట్టూ ఐరెన్ ఫెన్సింగ్.. 150 మంది కూర్చునేందుకు వీలుగా వీఐపీ గ్యాలరీ.. 3 వేలమంది పట్టే విధంగా పెవిలియన్.. పందెం కోళ్లు తలపడే దృశ్యాలు కనిపించే విధంగా మూడు పెద్ద ఎల్సీడీ టీవీలు.. ఏర్పాటు చేశారు. కామెంటేటర్లు గొంతు సవరించారు.
ఇవి తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో బరి వద్ద దృశ్యాలు. వీఐపీలకు డ్రింకులు, జ్యూస్లు, కోస (పందెంలో ఓడిన పుంజు) మాంసాలతో ఆతిథ్యం. ఫుడ్ కోర్టులు వెలిశారుు. ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేశారు. మరో వైపు కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో పొట్టేళ్ల పందేలు, ఎడ్లబండ్ల పరుగుల పోటీలు వంటివి ఈమారు సంక్రాంతికి అదనపు హంగును చేకూర్చాయి.