రూ.130 కోట్లు.. ఆధునిక హంగులు
లక్ష చదరపు అడుగుల్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్
ఇవీ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ భవన విశేషాలు
రేపు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
వివరాలు వెల్లడించిన వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి
ఎంజీఎం : తెలంగాణ రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ భవనాన్ని రూ.130 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించనున్నారు. వరంగల్‌లోని సెంట్రల్ జైలు ఆవరణలో భవనం నిర్మించనుండగా.. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం శంకుస్థాపన చేస్తారు. మెదక్ జిల్లా గజ్వేల్ జరగనున్న కార్యక్రమంలో పాల్గొంటున్న మోదీ అక్కడి నుంచే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు వివరాలను యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ బి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. అలాగే, హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పురోగతిని వీసీ వివరించారు.
2014లో ప్రారంభం
తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రప్రభుత్వం 2014 సెప్టెంబర్ 29న రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలల నిర్వహణ కోసం ప్రత్యేకంగా కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల కేంద్రంగా యూనివర్సిటీని ప్రారంభించగా 2015 జూలై 16న రిజిస్ట్రార్‌గా టి.వెంకటేశ్వర్రావును, నవంబర్ 23వ తేదీన హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా డాక్టర్ కరుణాకర్‌రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా వీసీ యూనివర్సిటీ పరిధిలోకి కళాశాలలను తీసుకరావడంతో పాటు మొట్టమొదటిసారి పీజీ అడ్మిషన్లను యూనివర్సిటీ పరిధిలో విజయవంతంగా చేపట్టారు.
కాగా, కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో పాత పోస్టాఫీసు భవనాన్ని పునరుద్ధరించి యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అలాగే, ప్రభుత్వం విడుదల చేసిన రూ.కోటి నిధులతో ఫర్నీచర్, వాహనాలు కొనుగోలు చేయగా, ఈ ఏడాది మార్చిలో యూనివర్సిటీ లోగోను సైతం ఇక్కడి సిబ్బంది రూపొందించగా ప్రభుత్వం అమోదముద్ర వేసింది. అలాగే, యూనివర్సిటీ కార్యకలాపాల కోసం కేయూలో ఉద్యోగ విరమణ చేసి జాయింట్ రిజిస్ట్రార్, ఇద్దరు డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఇద్దరు సెక్షన్ల సూపరిండెంట్లతో పాటు ఎంజీఎం ఆస్పత్రి నుంచి ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లను డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. అయితే, త్వరలోనే టీపీపీఎస్సీ ద్వారా 25 మంది శాశ్వత ఉద్యోగులను నియమించనున్నారు.
రూ.45 కోట్లతో పరిపాలన భవనం
కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, రిజిస్ట్రార్‌తో కలిసి పలు యూనివర్సిటీల భవనాలను సందర్శించిన వీసీ కరుణాకర్‌రెడ్డి నమూనా రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఈమేరకు భవనాన్ని రూ.130 కోట్లతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం కాగా, నమూనా సైతం ఖరారైంది. కాగా, యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగించేందుకు తొలుత రూ.45 కోట్లతో అడ్మినిస్ట్రేవ్ బ్లాక్(పరిపాలన భవన నిర్మాణాన్ని) దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష చదరపు అడుగుల స్థలంలో నిర్మించనున్నట్లు వీసీ తెలిపారు. వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో నిర్మించనున్న ఈ భవనానికే ప్రధాని ఆదివారం గజ్వేల్ నుంచి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. భవన నమూనాను టీమ్ వన్ ఇండియా కన్సల్టెంట్ రూపొందించగా, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణానికి ప్రభుత్వం ముందస్తుగా రూ.25 కోట్లు విడుదల చేసిందని, ఏడాదిలోగా ఈ పనులను పూర్తి చేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని వీసీ తెలిపారు.
విజయవంతంగా పీజీ అడ్మిషన్లు
తెలంగాణలోని పది జిల్లాల్లో కొనసాగుతున్న 167 వైద్య విద్య కళాశాలలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి డీ అఫ్లియేట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2016న ఫిబ్రవరి 9వ తేదీన ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ వెంటనే కళాశాలలను కాళోజీ నారాయణరావు హెల్త్యూనివర్సిటీకి అప్లియేట్ చేసేలా 10వ తేదీన కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్స్స్ అధికారులకు విన్నవించగా.. మార్చి 2న అనుమతులు మంజూరుయ్యాయి. ఈ మేరకు ఏప్రిల్‌లో పీజీ అడ్మిషన్లను విజయవంతంగా చేపట్టారు. ఇక రాష్ట్రంంలోని పది జిల్లాలో కొనసాగుతున్న వైద్యవిద్య కళాశాలలోని విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను నారాయణరావు యూనివర్సిటీ పరిధిలో జరిగేలా చేయడమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అనంతరం కళాశాలలోని అధ్యాపక సిబ్బంది, వైద్యవిద్య ప్రమాణాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.