ఫలితాల్లో దూసుకుపోయిన సన్ ఫార్మా
ముంబై: భారతీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా మెరుగైన ఫలితాలను ప్రకటించింది. వడోదరకు చెందిన ఈ కంపెనీ అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నికర లాభం రూ. 556 కోట్ల నుంచి రూ. 2034 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం కూడా 22 శాతం ఎగసి రూ. 8243 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 65 శాతం పెరిగి రూ. 2921 కోట్లుగా నమోదైంది. ఇబిటా మార్జిన్లు కూడా 26.1 శాతం నుంచి 35.4 శాతానికి భారీగా బలపడ్డాయి. ఈ కాలంలో రూ. 685 కోట్లమేర అనూహ్య నష్టాలు(ఎక్సెప్షనల్ లాస్) నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. అలాగే పన్ను వ్యయాలు రూ. 113 కోట్ల నుంచి రూ. 353 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. ఈ ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు భారీగా లాభపడింది. ముగింపులో 0.95 శాతం లాభపడి రూ. 800 దగ్గర స్థిర పడింది.