రెక్కల కష్టం బూడిదపాలు
మొక్కజొన్న పంటను దహనం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
రూ. 3 లక్షల ఆస్తినష్టం
పరిగి: ఆరుగాలం రెక్కలుముక్కలు చేసుకొని సాగుచేసిన పంట బూడిద పాలైంది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో రూ. 3 లక్షల విలువైన మొక్కజొన్న పంట కాలిపోయింది. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని నారాయణ్‌పూర్‌లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ్‌రెడ్డి తనకున్న మూడెకరాల పొలంలో పత్తిసాగుచేశాడు. స్థానికంగా మరో ఎనిమిది ఎకరాల పొలం కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేశాడు. రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి సాగుచేయగా పంట బాగా వచ్చింది.
పంట కోతకు రావటంతో వారం రోజులుగా కూలీలతో మొక్కజొన్న కంకులు సేకరించి కల్లంలో వేసి నూర్పిడికి సిద్ధంగా ఉంచాడు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న కంకులకు నిప్పు పెట్టారు. బుధవారం తెల్లవారు జామున నారాయణ్‌రెడ్డి పొలానికి వెళ్లి చూడగా పంట కాలిపోతూ కనిపించింది. తోటి రైతుల సాయంతో మంటలు ఆర్పే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున ్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేశారు. అప్పటికే రూ. 3 లక్షలకు పైగా నష్టం జరిగిందని బాధిత రైతు తెలిపాడు. నారాయణ్‌రెడ్డి కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.
80 క్వింటాళ్ల పత్తి దగ్ధం రూ. 4.2 లక్షల ఆస్తినష్టం
ధారూరు: పొలంలో నిల్వ ఉంచిన దాదాపు 80 క్వింటాళ్ల పత్తి ప్రమాదవశాత్తు కాలిపోయింది. దీంతో రూ. 4.2 లక్షల నష్టం జరిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని నాగసమందర్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. నాగసమందర్ గ్రామానికి చెందిన వరద మల్లికార్జున్‌కు చె ందిన 42 ఎకరాల పొలాన్ని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన సుబ్బారావు కౌలుకు తీసుకుని ఖరీఫ్ సీజన్లో పత్తి పంటను సాగుచేశాడు.
20 రోజుల నుంచి పత్తిని సేకరించారు. 175 క్వింటాళ్లు ఓ దగ్గర, 250 క్వింటాళ్లు మరో దగ్గర పత్తిని రెండు కుప్పలుగా నిల్వ చేశాడు. బుధవారం సాయంత్రం 175 క్వింటాళ్ల పత్తికుప్పకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో రైతు సుబ్బారావు స్థానికులతో కలిసి ట్యాంకర్ల ద్వారా మంటలను ఆర్పే యత్నం చేశారు. అనంతరం వికారాబాద్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పేసింది. అప్పటిలోగా 80 క్వింటాళ్ల పత్తి పూర్తిగా కాలిపోయింది. మిగిలిన 95 క్వింటాళ్ల పత్తి ఫైర్ ఇంజిన్నీటితో పాడైంది. దీనిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపరని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. ఆరుగాలం రెక్కలుముక్కలు చేసుకొని కుటుంబీకులమంతా కష్టపడ్డామని, ప్రమావశాత్తు పంట కాలిపోవడంతో రూ. 4.2 లక్షల ఆస్తినష్టం జరిగిందని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.