Rs.15
-
పాపం పండింది
జంగారెడ్డిగూడెం : అవినీతి నిరోధక శాఖ ఉచ్చునుంచి రెండుసార్లు తప్పించుకున్న జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ డి.జయరాజు మూడోసారి పన్నిన వలలో దొరికిపోయారు. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన స్థలానికి రిజిస్ట్రేషన్ పూర్తయినా.. సంబంధిత పత్రాలు ఇచ్చేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డారు. డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంకు చెందిన బైర్రాజు ఫణీంద్రవర్మ అదే గ్రామంలో 238 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయగా.. సదరు స్థలాన్ని అతడి పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ జయరాజు రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు. ఆ సొమ్ము ఇస్తేనే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తానని.. లేదంటే రిజిస్ట్రేషన్ రద్దవుతుందని భయపెట్టారు. దీంతో ఫణీంద్రవర్మ ఏసీబీని ఆశ్రయించగా, డీఎస్పీ వి.గోపాలకృష్ణ, సీఐ జీజే విల్సన్ సబ్ రిజిస్ట్రార్‌పై వల పన్నారు. ఫణీంద్రవర్మకు రూ.15 వేలు ఇచ్చి పంపించారు. సబ్ రిజిస్ట్రార్ జయరాజు ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రైవేట్ వ్యక్తి ద్వారా వ్యవహారం సబ్ రిజిస్ట్రార్ జయరాజు మామూళ్ల వసూలు వ్యవహారమంతా రాజు అనే ఓ ప్రైవేట్ వ్యక్తి ద్వారా నిర్వహిస్తున్నారని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. తాము దాడి చేసిన సమయంలో రాజు పరారయ్యాడన్నారు. అతని వద్ద రూ.లక్ష వరకు ఉన్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. రాజు కోసం గాలిస్తున్నామని, అతనిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ జయరాజుకు సంబంధించి ఆస్తుల వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. రెండుసార్లు తప్పించుకున్నా.. గతంలో ఏసీబీ దాడి నుంచి సబ్ రిజిస్ట్రార్ జయరాజు రెండుసార్లు తప్పించుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. ఏడాది కాలంలో రెండుసార్లు తనిఖీ చేయగా.. అతని వద్ద అనధికారికంగా ఉన్న నగదు దొరికిందని తెలిపారు. దీనిపై అప్పట్లో ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. రెండుసార్లు తనిఖీలు నిర్వహించినా సబ్ రిజిస్ట్రార్ జయరాజు తీరు మార్చుకోలేదని డీఎస్పీ పేర్కొన్నారు. -
ఏసీబీ వలలో వీఆర్వో
పెనమకూరు (తోట్లవల్లూరు): ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. భూమి రికార్డుల పనిలో లంచం కోసం రైతును పట్టిపీడిస్తున్న పెనమకూరు వీఆర్వో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. జిల్లా ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ, బాధితుడు ఈడే శ్రీనివాస్ కథనం మేరకు... మండలంలోని గరికపర్రుకు చెందిన శ్రీనివాస్‌కు కనకవల్లి వద్ద సుమారు 6.50 ఎకరాల వ్యవసాయ భూమి పిత్రార్జితంగా వచ్చింది. 2014లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రికార్డుల్లో తన పేరు ఎక్కించుకోవటంతోపాటు పట్టాదారు పాస్సుస్తకం కోసం రైతు శ్రీనివాస్ గత నెల 9న మీసేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ అర్జీ పెనమకూరు వీఆర్వో పి.రాజబాబు వద్దకు చేరింది. రికార్డుల్లో పేరు నమోదు కోసం ఆయన రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకుంటే.. ఫైలు వెనక్కి అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫైల్ వెనక్కి పంపుతానని వీఆర్వో హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో రైతు శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో అవినీతి నిరోధకశాఖ డిఎస్పీ వి.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఏసీబీ సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు ఆదివారం మధ్యాహ్నం... వీఆర్వో రాజబాబు పెనమకూరులోని తన కార్యాలయంలో శ్రీనివాస్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు డిఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. పట్టుబడిన వీఆర్వో మూడు నాలుగు నెలల క్రితం పమిడిముక్కల మండలం కృష్ణాపురం నుంచి బదిలీపై పెనమకూరుకు వచ్చాడు. నిందితున్ని సోమవారం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
50 పిడకలు @ రూ.15
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. పండగంటే ముందుగా గుర్తుకు వచ్చేది భోగి మంటలు. గోవు పేడతో పిడకలు చేసి దండగా మార్చి భోగి మంటలలో వేస్తారు. ఈ సంప్రదాయం పట్టణ ప్రాంతాల్లో కొంతమేర తగ్గినా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కనిపిస్తోంది. అయితే పల్లెవాసులకు పిడకలు తయారుచేసే తీరిక, ఆసక్తి తగ్గుతోంది. దీనినే వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. 50 పిడకలను దండగా కట్టి రూ.15 విక్రయిస్తున్నారు. మొగల్తూరులోని పలు దుకాణాల వద్ద పిడకల దండలు కనిపిస్తున్నాయి. పిడకల తయారీపై గ్రామీణులలోనూ ఆసక్తి తగ్గిందనడానికి ఇది నిదర్శనం.