పాపం పండింది
పాపం పండింది
Published Tue, Apr 25 2017 12:01 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
జంగారెడ్డిగూడెం : అవినీతి నిరోధక శాఖ ఉచ్చునుంచి రెండుసార్లు తప్పించుకున్న జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ డి.జయరాజు మూడోసారి పన్నిన వలలో దొరికిపోయారు. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన స్థలానికి రిజిస్ట్రేషన్ పూర్తయినా.. సంబంధిత పత్రాలు ఇచ్చేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డారు. డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంకు చెందిన బైర్రాజు ఫణీంద్రవర్మ అదే గ్రామంలో 238 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయగా.. సదరు స్థలాన్ని అతడి పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ జయరాజు రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు. ఆ సొమ్ము ఇస్తేనే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తానని.. లేదంటే రిజిస్ట్రేషన్ రద్దవుతుందని భయపెట్టారు. దీంతో ఫణీంద్రవర్మ ఏసీబీని ఆశ్రయించగా, డీఎస్పీ వి.గోపాలకృష్ణ, సీఐ జీజే విల్సన్ సబ్ రిజిస్ట్రార్‌పై వల పన్నారు. ఫణీంద్రవర్మకు రూ.15 వేలు ఇచ్చి పంపించారు. సబ్ రిజిస్ట్రార్ జయరాజు ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ప్రైవేట్ వ్యక్తి ద్వారా వ్యవహారం
సబ్ రిజిస్ట్రార్ జయరాజు మామూళ్ల వసూలు వ్యవహారమంతా రాజు అనే ఓ ప్రైవేట్ వ్యక్తి ద్వారా నిర్వహిస్తున్నారని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. తాము దాడి చేసిన సమయంలో రాజు పరారయ్యాడన్నారు. అతని వద్ద రూ.లక్ష వరకు ఉన్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. రాజు కోసం గాలిస్తున్నామని, అతనిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ జయరాజుకు సంబంధించి ఆస్తుల వివరాలు సేకరిస్తామని వెల్లడించారు.
రెండుసార్లు తప్పించుకున్నా..
గతంలో ఏసీబీ దాడి నుంచి సబ్ రిజిస్ట్రార్ జయరాజు రెండుసార్లు తప్పించుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. ఏడాది కాలంలో రెండుసార్లు తనిఖీ చేయగా.. అతని వద్ద అనధికారికంగా ఉన్న నగదు దొరికిందని తెలిపారు. దీనిపై అప్పట్లో ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. రెండుసార్లు తనిఖీలు నిర్వహించినా సబ్ రిజిస్ట్రార్ జయరాజు తీరు మార్చుకోలేదని డీఎస్పీ పేర్కొన్నారు.
Advertisement