JAYARAJU
-
పాపం పండింది
జంగారెడ్డిగూడెం : అవినీతి నిరోధక శాఖ ఉచ్చునుంచి రెండుసార్లు తప్పించుకున్న జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ డి.జయరాజు మూడోసారి పన్నిన వలలో దొరికిపోయారు. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన స్థలానికి రిజిస్ట్రేషన్ పూర్తయినా.. సంబంధిత పత్రాలు ఇచ్చేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డారు. డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంకు చెందిన బైర్రాజు ఫణీంద్రవర్మ అదే గ్రామంలో 238 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయగా.. సదరు స్థలాన్ని అతడి పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ జయరాజు రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు. ఆ సొమ్ము ఇస్తేనే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తానని.. లేదంటే రిజిస్ట్రేషన్ రద్దవుతుందని భయపెట్టారు. దీంతో ఫణీంద్రవర్మ ఏసీబీని ఆశ్రయించగా, డీఎస్పీ వి.గోపాలకృష్ణ, సీఐ జీజే విల్సన్ సబ్ రిజిస్ట్రార్‌పై వల పన్నారు. ఫణీంద్రవర్మకు రూ.15 వేలు ఇచ్చి పంపించారు. సబ్ రిజిస్ట్రార్ జయరాజు ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రైవేట్ వ్యక్తి ద్వారా వ్యవహారం సబ్ రిజిస్ట్రార్ జయరాజు మామూళ్ల వసూలు వ్యవహారమంతా రాజు అనే ఓ ప్రైవేట్ వ్యక్తి ద్వారా నిర్వహిస్తున్నారని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. తాము దాడి చేసిన సమయంలో రాజు పరారయ్యాడన్నారు. అతని వద్ద రూ.లక్ష వరకు ఉన్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. రాజు కోసం గాలిస్తున్నామని, అతనిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ జయరాజుకు సంబంధించి ఆస్తుల వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. రెండుసార్లు తప్పించుకున్నా.. గతంలో ఏసీబీ దాడి నుంచి సబ్ రిజిస్ట్రార్ జయరాజు రెండుసార్లు తప్పించుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. ఏడాది కాలంలో రెండుసార్లు తనిఖీ చేయగా.. అతని వద్ద అనధికారికంగా ఉన్న నగదు దొరికిందని తెలిపారు. దీనిపై అప్పట్లో ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. రెండుసార్లు తనిఖీలు నిర్వహించినా సబ్ రిజిస్ట్రార్ జయరాజు తీరు మార్చుకోలేదని డీఎస్పీ పేర్కొన్నారు. -
సమానత్వంతోనే నవసమాజ నిర్మాణం : ఆర్.నారాయణమూర్తి
చేవెళ్ల రూరల్: సమానత్వంతోనే నవసమాజం నిర్మాణం జరుగుతుందని, జాతి, కుల, మత, వర్ణ విబేధాలు లేకుండా మనుషులంతా ఒక్కటిగా ఉన్నప్పుడే బీఆర్.అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే కలలు సాకారమవుతాయని సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. చేవెళ్లలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి, ప్రజాకవి జయరాజు, జాతీయ దళితసేన అధ్యక్షుడు జేబీ.రాజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేజీఆర్ గార్డెన్లో దళిరత్న అవార్డు గ్రహీత బి.ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చిన జ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే లాంటి వారిని దేశం ఎందుకు గుర్తించటం లేదని ప్రశ్నించారు. వారికోసం ‘ఎడ్యుకేషనల్ డే’ లాంటి వాటిని ప్రారంభిస్తే తాము స్వాగతిస్తామన్నారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం రావాలని కోరుకున్న మహాత్ముల కలలు నిజం కావాలంటే అందరూ బాగా చదువుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో పేదవాడికో న్యాయం, సంపన్నుడికో న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం అందరికీ సమానమే అని అందరూ అంటున్నా... అది ఆచరణలో విఫలమవుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే దళితుడిని, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారని, ముఖ్యమంత్రి పదవి అనేది ఏమైనా వస్తువా..? అని ఆయన ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడితేగానీ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి లేదనీ, దీనికి నిదర్శనం ఇటీవలే రాష్ట్ర హోంమంత్రి తనవద్ద డబ్బులు లేవని ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాలేదని చెప్పిన మాటలను నారాయణమూర్తి గుర్తు చేశారు. జాతీయ దళితసేన అధ్యక్షుడు, వరల్డ్ మార్వలెస్ అవార్డు గ్రహీత జేబీ.రాజు మాట్లాడుతూ అట్టడుగు బడుగు, బలహీనవర్గాల ప్రజల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిరావుపూలే అన్నారు. అగ్రవరాణల అహంకారానికి వ్యతిరేకంగా దళిత, గిరిజన, వెనకబడినవర్గాల ప్రజల్లో సామాజిక చైతన్యం తెచ్చిన సామాజిక విప్లవ పితామహుడని కొనియడారు. సామాజిక వర్గాలకు విద్యనందించిన ఘనత అయనకే దక్కుతుందన్నారు. సామాజికవర్గానికి రాజ్యాధికారం రావాలని ఎంతో కృషిచేస్తున్న సినీ దర్శకుడు మన కోసం ‘రాజ్యధికారం’ సినిమా నిర్మించాడని చెప్పారు. ఆ సినిమాను చూడటమే మనం అయనకు ఇచ్చే గౌరవమన్నారు. ప్రజాకవి జయరాజు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటగా కుల వ్యవస్థపై పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావుపూలే అన్నారు. మహిళలకు విద్యను అందించేందుకు భార్య సావిత్రిబాయిపూలేకు విద్యను నేర్పించి, ఆమెతో మహిళలకు విద్యనందించిన మహనీయుడన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని గేయాలు పాడి అందరినీ అలరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, డీసీసీ మాజీ అధ్యక్షులు పి.వెంకటస్వామి, పీఏసీఎస్ చైర్మన్ డి.వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పద్మ, స్వరూప, నాయకులు రమణారెడ్డి, వసంతం, వెంకటేశంగుప్త, శ్రీనివాస్, సత్యనారాయణ, భాగ్యలక్ష్మి, మధుసూదన్‌గుప్త, రాజేందర్, రాములు, నారాయణ, అనంతం, నారాయణరావు, కృష్ణ, చేవెళ్ల అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. -
ప్రకృతిని పాడే వాగ్గేయరాజు
ప్రశ్న: మీకు ప్రకృతి మీద ప్రేమ ఎలా ఏర్పడింది? జవాబు: ఏమో తెల్వదు సార్. అలా ఏర్పడిపోయిందంతే. జయరాజు ప్రకృతికి పర్యాయపదం. లేదా జయరాజుకు ప్రకృతి పర్యాయపదం. మనిషి, ప్రకృతి కలగలసి పోవడమే అతడి పాట. జయరాజు ప్రకృతినే తన తత్త్వంగా చేసుకున్నాడు. ప్రకృతి కోసమే గొంతెత్తి పాడతాడు. ‘వానమ్మ వానమ్మ వానమ్మో ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మా’... అని వాన గురించి రాసినా ‘రూపమన్నది లేనివాడికి రూపమిచ్చిన జాతి నాది... ఏడుకొండల వేంకటేశుని ఎత్తి చూపిన ఖ్యాతి నాది’... అని రాళ్ల గురించి రాసినా, ‘ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నను గన్న తల్లి’ అని నేల తల్లి గురించి రాసినా, ‘పంట చేనులారా మీకు పాద పాదాన వందనాలు చేను చెలకలారా మీకు చెమట చుక్కల వందనాలు’ అంటూ పంట చేల గురించి రాసినా అవన్నీ ప్రయత్నం మీద పుట్టిన పాటలు కావు. జయరాజులో నుంచి సహజంగా ఉద్భవించినవి. ఎవరు గింజలు చల్లారని అడవి మొలిచింది? ఎవరు అడిగారని జయరాజు పాట పాడేది? అది అతడికి సహజాతం. తెలంగాణ కవిగాయకుడిగా జయరాజు ప్రస్థానం చాలా సుదీర్ఘమైనది. అతడి జీవితం ముళ్లబాట. ఉద్యమంలో ఎదుర్కొన్నది రాళ్లబాట. నిర్బంధం కానుక గాయాల వేడుక అతడి జీవితంలో భాగమయ్యాయి. వీటి నడుమ జయరాజు పాటతో నేస్తు కట్టాడు. కిటికీలో నుంచి చందమామ కనిపిస్తే ఒక పాట. దాపున సీతాకోక చిలుక వాలితే ఒక పాట. చెట్టు చిగురిస్తే ఒక పాట. పచ్చాని చెట్టు నేనురా... పాలుగారె మనసు నాదిరా... కొమ్మను నే రెమ్మను... నీకు తోడుగ ఉండే అమ్మను... మీ పొలమున దున్ని నాగలై... పంటను మోసిన బండినై... అమ్మమ్మ చేతిలో కవ్వమై... తాతయ్య చేతిలో కర్రనై... అమ్మపాటతో ఊగిన ఊయలై.... ఆ పాడేటి పిల్లన గ్రోవినై... అంటూ జయరాజు చెట్టు గురించి పాడితే కన్నీరు ఉబుకుతుంది. కనిపించిన ప్రతి చెట్టునూ గట్టిగా కావలించుకోబుద్ధవుతుంది. అవసరమైనప్పుడు ప్రజల పక్షం అనుక్షణం ప్రకృతి పక్షం వహిస్తూ ప్రజావాహినికి చైతన్య గీతమై గాన ప్రబోధమై సాగుతున్న జయరాజు పాటకు మరో వెయ్యేళ్ల ఆయుష్షుంటుంది. ప్రకృతి దానిని ఆశీర్వదిస్తుంటుంది. - సాక్షి సాహిత్యం (జూన్ 29న వరంగల్ జిల్లా పాలకుర్తిలో సోమనాథ కళాపీఠం వారు జయరాజుకు ‘వాగ్గేయరాజు’ బిరుదు అంకితం చేయనున్న సందర్భంగా) -
ఎక్సైజ్ సీఐ ఆస్తులు రూ.2 కోట్లు
రాజమండ్రి రూరల్,న్యూస్‌లైన్ : ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో పెద్దచేప మంగళవారం ఏసీబీ వలకు చిక్కింది. శాఖలో 1995లో ఎస్సైగా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం ఉయ్యూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న యామల జయరాజు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గుర్తించారు. ఏకకాలంలో తొమ్మిది ప్రాంతాలలో ఆయనకు సంబంధించిన ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈదాడులలో ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ, హైదరాబాద్ ప్రాంతాల ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. ఆయనకు రూ.రెండుకోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు ఈ తనిఖీల్లో వెల్లడైంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి మోరంపూడిలోని గణేష్‌నగర్‌లో కృష్ణాజిల్లా ఉయ్యూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ యామల జయరాజు ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడిచేసి తనిఖీలు నిర్వహించారు. పశ్చిమగోదావరిజిల్లా బాదంపూడికి గ్రామానికి చెందిన జయరాజు గతంలో ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల్లో పనిచేశారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు, సిబ్బంది మంగళవారం ఉదయం 9 గంటలనుంచి తనిఖీలు చేపట్టారు. మోరంపూడి గణేష్‌నగర్‌లో జయరాజు స్వగృహంపైన, ఇన్నీసుపేట, శ్యామలానగర్ ప్రాంతాల్లోని ఆయన సొంత ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడిలోని రెండు ఇళ్లల్లో, జయరాజు కుటుంబసభ్యులు నివసిస్తున్న హైదరాబాద్, కాకినాడ ప్రాంతాలలోనూ, ఉయ్యూరు ఎక్సైజ్ స్టేషన్లోను, అక్కడ ఆయన నివసిస్తున్న అద్దె ఇంట్లోనూ కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రాజమండ్రి గణేష్‌నగర్‌లోని ఇంట్లో జయరాజు భార్య రాఘవ శ్రీసుధాచైతన్యస్కూల్ నిర్వహిస్తున్నారు. జయరాజుకు మొత్తం ఐదు భవనాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. గణేష్‌నగర్‌లో రెండు, ఇన్నీసుపేటలో రెండు, శ్యామలానగర్‌లో ఒకటి చొప్పున ఈ భవనాలు ఉన్నాయి. సబ్‌రిజిస్ట్రార్ విలువ ప్రకారం రూ.కోటి, మార్కెట్ వాల్యూ ప్రకారం రూ.రెండుకోట్లు పైనే ఇవి చేస్తాయని వారు పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాలలో కూడా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. రాజమండ్రి గణేష్‌నగర్‌లో మంగళవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. పలు కీలక పత్రాలను ఈ తనిఖీల్లో భాగంగా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జయరాజ్‌కు ఒక లాకర్ ఉందని తనిఖీల్లో తేలిందని, బుధవారం దానిని తెరిచి తనిఖీ చేస్తామని ఏసీబీ సిబ్బంది చెప్పారు. కాగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జయరాజును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించారు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతోనే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జయరాజు ఇళ్లు, ఆఫీసులో తనిఖీలు చేశాం. మార్కెట్‌విలువ ప్రకారం ఆయన ఆస్తులు రూ.రెండు కోట్లపైనే ఉంటాయి. జయరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం. ఏకకాలంలో తొమ్మిదిచోట్ల దాడులు నిర్వహించాం. ఒక లాకర్ తాళం దొరికింది. బుధవారం లాకర్ తెరిచి తనిఖీ చేస్తాం. - ఐ.వెంకటేశ్వర్లు, డీఎస్పీ, ఏసీబీ, ఏలూరు