ఎక్సైజ్ సీఐ ఆస్తులు రూ.2 కోట్లు
Published Wed, Feb 5 2014 2:28 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
రాజమండ్రి రూరల్,న్యూస్‌లైన్ : ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో పెద్దచేప మంగళవారం ఏసీబీ వలకు చిక్కింది. శాఖలో 1995లో ఎస్సైగా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం ఉయ్యూరు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న యామల జయరాజు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గుర్తించారు. ఏకకాలంలో తొమ్మిది ప్రాంతాలలో ఆయనకు సంబంధించిన ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈదాడులలో ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ, హైదరాబాద్ ప్రాంతాల ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. ఆయనకు రూ.రెండుకోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు ఈ తనిఖీల్లో వెల్లడైంది.
వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి మోరంపూడిలోని గణేష్‌నగర్‌లో కృష్ణాజిల్లా ఉయ్యూరు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ యామల జయరాజు ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడిచేసి తనిఖీలు నిర్వహించారు. పశ్చిమగోదావరిజిల్లా బాదంపూడికి గ్రామానికి చెందిన జయరాజు గతంలో ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల్లో పనిచేశారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు, సిబ్బంది మంగళవారం ఉదయం 9 గంటలనుంచి తనిఖీలు చేపట్టారు. మోరంపూడి గణేష్‌నగర్‌లో జయరాజు స్వగృహంపైన, ఇన్నీసుపేట, శ్యామలానగర్ ప్రాంతాల్లోని ఆయన సొంత ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడిలోని రెండు ఇళ్లల్లో, జయరాజు కుటుంబసభ్యులు నివసిస్తున్న హైదరాబాద్, కాకినాడ ప్రాంతాలలోనూ, ఉయ్యూరు ఎక్సైజ్ స్టేషన్‌లోను, అక్కడ ఆయన నివసిస్తున్న అద్దె ఇంట్లోనూ కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
రాజమండ్రి గణేష్‌నగర్‌లోని ఇంట్లో జయరాజు భార్య రాఘవ శ్రీసుధాచైతన్యస్కూల్ నిర్వహిస్తున్నారు. జయరాజుకు మొత్తం ఐదు భవనాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. గణేష్‌నగర్‌లో రెండు, ఇన్నీసుపేటలో రెండు, శ్యామలానగర్‌లో ఒకటి చొప్పున ఈ భవనాలు ఉన్నాయి. సబ్‌రిజిస్ట్రార్ విలువ ప్రకారం రూ.కోటి, మార్కెట్ వాల్యూ ప్రకారం రూ.రెండుకోట్లు పైనే ఇవి చేస్తాయని వారు పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాలలో కూడా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. రాజమండ్రి గణేష్‌నగర్‌లో మంగళవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. పలు కీలక పత్రాలను ఈ తనిఖీల్లో భాగంగా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జయరాజ్‌కు ఒక లాకర్ ఉందని తనిఖీల్లో తేలిందని, బుధవారం దానిని తెరిచి తనిఖీ చేస్తామని ఏసీబీ సిబ్బంది చెప్పారు. కాగా ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జయరాజును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు గడించారు
ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతోనే ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జయరాజు ఇళ్లు, ఆఫీసులో తనిఖీలు చేశాం. మార్కెట్‌విలువ ప్రకారం ఆయన ఆస్తులు రూ.రెండు కోట్లపైనే ఉంటాయి. జయరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం. ఏకకాలంలో తొమ్మిదిచోట్ల దాడులు నిర్వహించాం. ఒక లాకర్ తాళం దొరికింది. బుధవారం లాకర్ తెరిచి తనిఖీ చేస్తాం.
- ఐ.వెంకటేశ్వర్లు, డీఎస్పీ, ఏసీబీ, ఏలూరు
Advertisement