సమానత్వంతోనే నవసమాజ నిర్మాణం : ఆర్.నారాయణమూర్తి | New social structure with the equality | Sakshi
Sakshi News home page

సమానత్వంతోనే నవసమాజ నిర్మాణం : ఆర్.నారాయణమూర్తి

Published Fri, Nov 28 2014 11:43 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

సమానత్వంతోనే నవసమాజ నిర్మాణం : ఆర్.నారాయణమూర్తి - Sakshi

సమానత్వంతోనే నవసమాజ నిర్మాణం : ఆర్.నారాయణమూర్తి

చేవెళ్ల రూరల్: సమానత్వంతోనే నవసమాజం నిర్మాణం జరుగుతుందని, జాతి, కుల, మత, వర్ణ విబేధాలు లేకుండా మనుషులంతా ఒక్కటిగా ఉన్నప్పుడే బీఆర్.అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే కలలు సాకారమవుతాయని సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. చేవెళ్లలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా నారాయణమూర్తి, ప్రజాకవి జయరాజు, జాతీయ దళితసేన అధ్యక్షుడు జేబీ.రాజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేజీఆర్ గార్డెన్‌లో దళిరత్న అవార్డు గ్రహీత బి.ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చిన జ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే లాంటి వారిని దేశం ఎందుకు గుర్తించటం లేదని ప్రశ్నించారు.

వారికోసం ‘ఎడ్యుకేషనల్ డే’ లాంటి వాటిని ప్రారంభిస్తే తాము స్వాగతిస్తామన్నారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం రావాలని కోరుకున్న మహాత్ముల కలలు నిజం కావాలంటే అందరూ బాగా చదువుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో పేదవాడికో న్యాయం, సంపన్నుడికో న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం అందరికీ సమానమే అని అందరూ అంటున్నా... అది ఆచరణలో విఫలమవుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే దళితుడిని, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారని, ముఖ్యమంత్రి పదవి అనేది ఏమైనా వస్తువా..? అని ఆయన ఎద్దేవా చేశారు.

కోట్ల రూపాయలు ఖర్చు పెడితేగానీ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి లేదనీ, దీనికి నిదర్శనం ఇటీవలే రాష్ట్ర హోంమంత్రి తనవద్ద డబ్బులు లేవని ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాలేదని చెప్పిన మాటలను నారాయణమూర్తి గుర్తు చేశారు. జాతీయ దళితసేన అధ్యక్షుడు, వరల్డ్ మార్వలెస్ అవార్డు గ్రహీత జేబీ.రాజు మాట్లాడుతూ అట్టడుగు బడుగు, బలహీనవర్గాల ప్రజల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిరావుపూలే అన్నారు. అగ్రవరాణల అహంకారానికి వ్యతిరేకంగా దళిత, గిరిజన, వెనకబడినవర్గాల ప్రజల్లో సామాజిక చైతన్యం తెచ్చిన సామాజిక విప్లవ పితామహుడని కొనియడారు. సామాజిక వర్గాలకు విద్యనందించిన ఘనత అయనకే దక్కుతుందన్నారు. సామాజికవర్గానికి రాజ్యాధికారం రావాలని ఎంతో  కృషిచేస్తున్న సినీ దర్శకుడు మన కోసం ‘రాజ్యధికారం’ సినిమా నిర్మించాడని చెప్పారు.

ఆ సినిమాను చూడటమే మనం అయనకు ఇచ్చే గౌరవమన్నారు. ప్రజాకవి జయరాజు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటగా కుల వ్యవస్థపై పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావుపూలే అన్నారు. మహిళలకు  విద్యను అందించేందుకు భార్య సావిత్రిబాయిపూలేకు విద్యను నేర్పించి, ఆమెతో మహిళలకు విద్యనందించిన మహనీయుడన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని గేయాలు పాడి అందరినీ అలరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, డీసీసీ మాజీ అధ్యక్షులు పి.వెంకటస్వామి, పీఏసీఎస్ చైర్మన్ డి.వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పద్మ, స్వరూప, నాయకులు రమణారెడ్డి, వసంతం, వెంకటేశంగుప్త, శ్రీనివాస్, సత్యనారాయణ, భాగ్యలక్ష్మి, మధుసూదన్‌గుప్త, రాజేందర్, రాములు, నారాయణ, అనంతం, నారాయణరావు, కృష్ణ, చేవెళ్ల అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement