R.Narayana Murty
-
ఆంగ్లం వద్దన్నవారు బడుగు వర్గాల వ్యతిరేకులే!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఇంగ్లిషు మీడియం వద్దన్న వారంతా బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకులేనని ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం రాష్ట్ర బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా లద్దిక మల్లేష్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన పలు విషయాలపై ‘సాక్షి’తో ముచ్చటించారు.. సాక్షి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై మీ స్పందన..? నారాయణమూర్తి: రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన జగనన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాక్షి: ఎందుకో వివరంగా చెప్పగలరా..? నారాయణ మూర్తి: ఇప్పటి వరకు డబ్బున్న వారు మాత్రమే వేలు, లక్షలు వెచ్చించి కాన్వెంట్లలో, స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్నారు. వారంతా ఇంగ్లిష్ మీడియంలో చదవడం వల్ల విదేశాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో, ఉన్నత పదవుల్లో ఉంటున్నారు. కేవలం బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఇంటర్వ్యూలలో, పెద్ద, పెద్ద కంపెనీలకు ఎంపిక కాలేక పోతున్నారు. అదే వీరందరూ కూడా ఇంగ్లిష్ మీడియంలో చదవగలిగితే రేపు పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. సాక్షి: భవిష్యత్తులో రోబోటిక్స్, ఎరోనాటిక్స్ మయం కాబోతుంది. వాటిలో జాబ్‌లు అందిపుచ్చుకోవాలంటే ఇంగ్లిష్ పరిజ్ఞానం కావాలి కదా..? నా.మూ: నిజం చెప్పావు బ్రదర్.. భవిష్యత్తు అంతా సాంకేతిక కోర్సులు, రోబోటిక్స్‌తో నిండిపోనున్నాయి. వాటిలో జాబ్‌లు సంపాదించాలంటే తప్పకుండా ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. సాక్షి: తెలుగు భాషకు ఏదో ముప్పు వచ్చిందని బాధపడుతున్నారా? నా.మూ: తెలుగు భాషకు ఏదో ముప్పు వచ్చిందని బాధపడుతున్న వారి పిల్లలు, మనవళ్లు తెలుగు మీడియంలో చదువుతున్నారా..? ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారా..? మన ఇంటిలో మాట్లాడుకునేది మాతృ భాష తెలుగు, కాని మన ఇంటిలో వారిని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? నాన్నా, అమ్మ, అన్నయ్య, బాబాయ్, అత్త అనే పదాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయ్. మమ్మి, డాడీ, బ్రో, అంటీ, అంకుల్ ఈ పిలుపులతో పిలిచినప్పుడు తెలుగు భాష గుర్తుకురాలేదా..? ఇంటిలో పిల్లలకు పాత తరం వారు వారి తల్లిదండ్రులు, తాత, ముత్తాతలు పేర్లు పెట్టేవారు. కాని నేడు మున్ని, ట్వింకిల్ అనే మోడ్రన్ పేర్లతో పిలుస్తున్నారు. అప్పుడు తెలుగు గుర్తుకు రాలేదా? సాక్షి: తెలుగు మీడియం వల్ల మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? నా.మూ: మాది పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం. నేను బీఏ వరకు చదువుకున్నాను. అదికూడా తెలుగు మీడియంలోనే చదువుంతా సాగింది. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి స్కూల్లో తెలుగు మీడియం అమలు చేయడంతో మా ఆనందానికి అంతు లేదు. కాని మాకు అప్పుడు ఇంగ్లిష్ భాష గురించి తెలియలేదు. బీఏ, ఎంఏలు, బీకాం, బీస్సీలు తెలుగు మీడియంలో చదివిన మాకంటే ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారు మాత్రమే ఉద్యోగాలు సాధించగలిగారు. అది అప్పుడే కాదు. ఇప్పుడూ ఉంది. తెలుగు మీడియం విద్యార్థి, ఇంగ్లిష్ మీడియం చదివిన విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎన్నికైన వారి నిష్పత్తి తీసుకుంటే ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారు ఎక్కువగా ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. సాక్షి: ఇంగ్లిష్ మీడియంలో చదివితే తప్పేంటి? నా.మూ: బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. మిగిలిన వారంతా ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. తెలుగును కాపాడేది ఈ బడుగు, బలహీన వర్గాల పిల్లలేనా? ప్రశ్నించే వారి పిల్లలకు తెలుగును కాపాడే అవసరం లేదా. జగన్ గారు ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు సబ్జెక్ట్ ఎలా తప్పనిసరి చేశారో.. అదే విధంగా కార్పొరేట్ స్కూళ్లలో కూడా తెలుగు సబ్జెక్ట్ తప్పని సరి చేయాలి. బ్రదర్ ఈ విషయాన్ని ప్రముఖంగా రాయండి. ఇంగ్లిష్ మీడియం వద్దన్న వాళ్ళందరూ బడుగు, బలహీన వర్గాల వారికి వ్యతిరేకమే. జగన్ గారికి మరోసారి ధన్యవాధాలు. అంటూ ఇంటర్వ్యూ ముగించారు. -
మాజీ సర్పంచ్ మృతికి ఆర్.నారాయణమూర్తి సంతాపం
విజయనగరం పూల్‌బాగ్ : విజయనగరం మండల పరిధిలోని సారిక పంచాయతీ మాజీ సర్పంచ్ మామిడి భవానీ మృతిపై సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి సంతాపం తెలిపారు. సారిక గ్రామానికి శుక్రవారం చేరుకుని భవానీ భర్త, ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడును పరామర్శించారు. పిల్లలు హాసిని, గ్రీష్మాలను ఓదార్చారు. ఆమె ఫొటోకు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
నాకు నేనే పోటీ
‘‘ఒకప్పుడు అన్నదాతను అందరూ సుఖీభవ అని దీవించేవారు. కానీ, నేడు అన్నదాతల బతుకు దుఃఖీభవగా మారింది. అలాంటి రైతు సమస్యలను ‘అన్నదాత సుఖీభవ’ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ షూటింగ్ పూర్తయింది. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘రైతు సమస్యలపై తీసిన చిత్రమిది. దేశానికి తిండి పెడుతున్న రైతు సంక్షేమాన్ని పట్టించుకునేవాడే లేడు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రైతులపై పార్లమెంటులో చర్చ జరగాలి. పంటలకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వమే కల్పించాలనే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి. రుణాలు మాఫీ చేయకపోవడంతో అప్పుల బాధ తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నదాతల సమస్యలకు పరిష్కారం మా సినిమాలో చూపిస్తున్నాం. ఖమ్మం, వరంగల్, ఉభయగోదావరి, ఢిల్లీలో చిత్రీకరించాం. ఫిబ్రవరిలో రిలీజ్ అనుకుంటున్నాం. నాకెవరూ పోటీ లేరు. నాకు నేనే పోటీ’’ అన్నారు. -
ఆర్.నారాయణమూర్తికి కొమరం భీమ్ పురస్కారం
సాక్షి, హైదరాబాద్ : సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తికి ప్రతిష్టాత్మక ‘కొమరం భీమ్ జాతీయ పురస్కారం’ లభించింది. తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరమ్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్, గోండ్వానా సాంస్కృతిక పరిరక్షణ దళం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతి ఏడాది అందించే ఈ అవార్డుకు... ఈ ఏడాది ఆర్.నారాయణమూర్తిని ఎంపికి చేసినట్లు అవార్డు కమిటీ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారీ తెలిపారు. ఈ నెల 3వ వారం జరిగే అవార్డు ప్రదానోత్సవంలో 51 వేల రూపాయల నగదుతో పాటు, జ్ఞాపిక, ప్రశంస పత్రం, శాలువాతో సత్కరిసున్నట్టు కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ పేర్కొన్నారు. గతంలో ఈ అవార్డును కొమరం భీమ్ చిత్ర నిర్మాత, దర్శకుడు అల్లాణి శ్రీధర్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అందుకున్నారు. కాగా ప్రజలను చైతన్యపరిచేలా ఆర్. నారాయణమూర్తి పలు చిత్రాలను నిర్మించారు. అర్థరాత్రి స్వతంత్రం, అడివి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగు చుక్కలు, అరణ్యం, ఎర్రోడు, సింగన్న లాంటి పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. -
సమానత్వంతోనే నవసమాజ నిర్మాణం : ఆర్.నారాయణమూర్తి
చేవెళ్ల రూరల్: సమానత్వంతోనే నవసమాజం నిర్మాణం జరుగుతుందని, జాతి, కుల, మత, వర్ణ విబేధాలు లేకుండా మనుషులంతా ఒక్కటిగా ఉన్నప్పుడే బీఆర్.అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే కలలు సాకారమవుతాయని సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. చేవెళ్లలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి, ప్రజాకవి జయరాజు, జాతీయ దళితసేన అధ్యక్షుడు జేబీ.రాజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేజీఆర్ గార్డెన్లో దళిరత్న అవార్డు గ్రహీత బి.ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చిన జ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే లాంటి వారిని దేశం ఎందుకు గుర్తించటం లేదని ప్రశ్నించారు. వారికోసం ‘ఎడ్యుకేషనల్ డే’ లాంటి వాటిని ప్రారంభిస్తే తాము స్వాగతిస్తామన్నారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం రావాలని కోరుకున్న మహాత్ముల కలలు నిజం కావాలంటే అందరూ బాగా చదువుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో పేదవాడికో న్యాయం, సంపన్నుడికో న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం అందరికీ సమానమే అని అందరూ అంటున్నా... అది ఆచరణలో విఫలమవుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే దళితుడిని, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారని, ముఖ్యమంత్రి పదవి అనేది ఏమైనా వస్తువా..? అని ఆయన ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడితేగానీ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి లేదనీ, దీనికి నిదర్శనం ఇటీవలే రాష్ట్ర హోంమంత్రి తనవద్ద డబ్బులు లేవని ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాలేదని చెప్పిన మాటలను నారాయణమూర్తి గుర్తు చేశారు. జాతీయ దళితసేన అధ్యక్షుడు, వరల్డ్ మార్వలెస్ అవార్డు గ్రహీత జేబీ.రాజు మాట్లాడుతూ అట్టడుగు బడుగు, బలహీనవర్గాల ప్రజల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిరావుపూలే అన్నారు. అగ్రవరాణల అహంకారానికి వ్యతిరేకంగా దళిత, గిరిజన, వెనకబడినవర్గాల ప్రజల్లో సామాజిక చైతన్యం తెచ్చిన సామాజిక విప్లవ పితామహుడని కొనియడారు. సామాజిక వర్గాలకు విద్యనందించిన ఘనత అయనకే దక్కుతుందన్నారు. సామాజికవర్గానికి రాజ్యాధికారం రావాలని ఎంతో కృషిచేస్తున్న సినీ దర్శకుడు మన కోసం ‘రాజ్యధికారం’ సినిమా నిర్మించాడని చెప్పారు. ఆ సినిమాను చూడటమే మనం అయనకు ఇచ్చే గౌరవమన్నారు. ప్రజాకవి జయరాజు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటగా కుల వ్యవస్థపై పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావుపూలే అన్నారు. మహిళలకు విద్యను అందించేందుకు భార్య సావిత్రిబాయిపూలేకు విద్యను నేర్పించి, ఆమెతో మహిళలకు విద్యనందించిన మహనీయుడన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని గేయాలు పాడి అందరినీ అలరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, డీసీసీ మాజీ అధ్యక్షులు పి.వెంకటస్వామి, పీఏసీఎస్ చైర్మన్ డి.వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పద్మ, స్వరూప, నాయకులు రమణారెడ్డి, వసంతం, వెంకటేశంగుప్త, శ్రీనివాస్, సత్యనారాయణ, భాగ్యలక్ష్మి, మధుసూదన్‌గుప్త, రాజేందర్, రాములు, నారాయణ, అనంతం, నారాయణరావు, కృష్ణ, చేవెళ్ల అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. -
ఒక శకం ముగిసింది
-
ఒక శకం ముగిసింది
హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు మరణంతో ఒక శకం ముగిసిందని విప్లవ దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ ఏడుపు వస్తుందని చెప్పారు. బాపు మహా దర్శకుడు, మహా చిత్రకారుడు అన్నారు. గుంటూరు గోంగూర ఎంత ప్రాముఖ్యమో, ఓరుగల్లు కాకతీయత ఎంత ప్రాముఖ్యమో, బాబు బొమ్మ అంత ప్రాముఖ్యమైనదన్నారు. తెలుగు జాతికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. బాపు మంచి మనిషి. నవ్వుతూ మాట్లాడతారు. సామాన్య మనిషిగా మాట్లాడతారు. గొప్ప మనిషి. గొప్ప సినిమాలు తీశారు. సాక్షి నుంచి శ్రీరామరాజ్యం వరకు ఆయన చిత్రాలలో తెలుగుదనం ఉట్టిపడుతుందన్నారు. బాపు మరణం యావత్ తెలుగుజాతికి తీరని లోటు. అన్నారు. బాపుకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చిందని, ఆయనకు అది సరిపోదని,. పద్మభూషణ్ గాని పద్మవిభూషణ్ గానీ ఇవ్వాలని నారాయణ మూర్తి అన్నారు. -
టీవీ9 ప్రసారాల నిలుపుదల సమంజసమే
నటుడు, దర్శకుడు నారాయణమూర్తి హైదరాబాద్: టీవీ9 చానల్ ప్రసారాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. టీవీ9 ప్రసారాలను నిలుపుదల చేయడం సమంజసమేనని అభిప్రాయపడ్డారు. తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రాజ్యాధికారం’ చిత్రంపై మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు. మీడియాలో ప్రసారమయ్యే కార్యక్రమాలు చైతన్యవంతంగా, ఆలోచింపజేసేవిగా ఉండాలి కానీ సంస్కృతిని, సంప్రదాయాలను, యాస, భాషను కించపరిచేలా ఉండకూడదని నారాయణమూర్తి స్పష్టం చేశారు. -
కెసిఆర్‌ను కలిసిన ఆర్.నారాయణమూర్తి
హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఈరోజు ఇక్కడ టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు(కెసిఆర్)ను కలుసుకున్నారు. ఎన్నికల నేపధ్యంలో వీరి కలయికకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాను కెసిఆర్‌తో రాజకీయాల గురించి మాట్లాడలేదని నారాయణ మూర్తి చెప్పారు. కెసిఆర్‌ను కలసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తాను కేవలం అభినందనలు తెలపడానికి మాత్రమే వచ్చినట్లు తెలిపారు. త్వరలో తాను రాజ్యాధికారం అనే సినిమాను నిర్మిస్తున్నట్లు నారాయణమూర్తి చెప్పారు.