సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఇంగ్లిషు మీడియం వద్దన్న వారంతా బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకులేనని ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం రాష్ట్ర బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా లద్దిక మల్లేష్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన పలు విషయాలపై ‘సాక్షి’తో ముచ్చటించారు..
సాక్షి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై మీ స్పందన..?
నారాయణమూర్తి: రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన జగనన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
సాక్షి: ఎందుకో వివరంగా చెప్పగలరా..?
నారాయణ మూర్తి: ఇప్పటి వరకు డబ్బున్న వారు మాత్రమే వేలు, లక్షలు వెచ్చించి కాన్వెంట్లలో, స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్నారు. వారంతా ఇంగ్లిష్ మీడియంలో చదవడం వల్ల విదేశాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో, ఉన్నత పదవుల్లో ఉంటున్నారు. కేవలం బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఇంటర్వ్యూలలో, పెద్ద, పెద్ద కంపెనీలకు ఎంపిక కాలేక పోతున్నారు. అదే వీరందరూ కూడా ఇంగ్లిష్ మీడియంలో చదవగలిగితే రేపు పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు.
సాక్షి: భవిష్యత్తులో రోబోటిక్స్, ఎరోనాటిక్స్ మయం కాబోతుంది.
వాటిలో జాబ్‌లు అందిపుచ్చుకోవాలంటే ఇంగ్లిష్ పరిజ్ఞానం కావాలి కదా..?
నా.మూ: నిజం చెప్పావు బ్రదర్.. భవిష్యత్తు అంతా సాంకేతిక కోర్సులు, రోబోటిక్స్‌తో నిండిపోనున్నాయి. వాటిలో జాబ్‌లు సంపాదించాలంటే తప్పకుండా ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి.
సాక్షి: తెలుగు భాషకు ఏదో ముప్పు వచ్చిందని బాధపడుతున్నారా?
నా.మూ: తెలుగు భాషకు ఏదో ముప్పు వచ్చిందని బాధపడుతున్న వారి పిల్లలు, మనవళ్లు తెలుగు మీడియంలో చదువుతున్నారా..? ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారా..? మన ఇంటిలో మాట్లాడుకునేది మాతృ భాష తెలుగు, కాని మన ఇంటిలో వారిని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? నాన్నా, అమ్మ, అన్నయ్య, బాబాయ్, అత్త అనే పదాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయ్. మమ్మి, డాడీ, బ్రో, అంటీ, అంకుల్ ఈ పిలుపులతో పిలిచినప్పుడు తెలుగు భాష గుర్తుకురాలేదా..? ఇంటిలో పిల్లలకు పాత తరం వారు వారి తల్లిదండ్రులు, తాత, ముత్తాతలు పేర్లు పెట్టేవారు. కాని నేడు మున్ని, ట్వింకిల్ అనే మోడ్రన్ పేర్లతో పిలుస్తున్నారు. అప్పుడు తెలుగు గుర్తుకు రాలేదా?
సాక్షి: తెలుగు మీడియం వల్ల మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
నా.మూ: మాది పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం. నేను బీఏ వరకు చదువుకున్నాను. అదికూడా తెలుగు మీడియంలోనే చదువుంతా సాగింది. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి స్కూల్‌లో తెలుగు మీడియం అమలు చేయడంతో మా ఆనందానికి అంతు లేదు. కాని మాకు అప్పుడు ఇంగ్లిష్ భాష గురించి తెలియలేదు. బీఏ, ఎంఏలు, బీకాం, బీస్సీలు తెలుగు మీడియంలో చదివిన మాకంటే ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారు మాత్రమే ఉద్యోగాలు సాధించగలిగారు. అది అప్పుడే కాదు. ఇప్పుడూ ఉంది. తెలుగు మీడియం విద్యార్థి, ఇంగ్లిష్ మీడియం చదివిన విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎన్నికైన వారి నిష్పత్తి తీసుకుంటే ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారు ఎక్కువగా ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు.
సాక్షి: ఇంగ్లిష్ మీడియంలో చదివితే తప్పేంటి?
నా.మూ: బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. మిగిలిన వారంతా ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. తెలుగును కాపాడేది ఈ బడుగు, బలహీన వర్గాల పిల్లలేనా? ప్రశ్నించే వారి పిల్లలకు తెలుగును కాపాడే అవసరం లేదా. జగన్ గారు ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు సబ్జెక్ట్ ఎలా తప్పనిసరి చేశారో.. అదే విధంగా కార్పొరేట్ స్కూళ్లలో కూడా తెలుగు సబ్జెక్ట్ తప్పని సరి చేయాలి. బ్రదర్ ఈ విషయాన్ని ప్రముఖంగా రాయండి. ఇంగ్లిష్ మీడియం వద్దన్న వాళ్ళందరూ బడుగు, బలహీన వర్గాల వారికి వ్యతిరేకమే. జగన్ గారికి మరోసారి ధన్యవాధాలు. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment