మోదీ మరో సంచలనం ఇదేనట..!
న్యూఢిల్లీ : డీమానిటైజేషన్తో పెను సంచలనానికి తెరలేపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకోనున్న తదుపరి నిర్ణయంపై షాకింగ్ న్యూస్ ఒకటి వార్తల్లో నిలిచింది. గత ఏడాది జులైలో సిట్ చేసిన కీలక సూచనను అమలు చేసేందుకు మోదీ కసరత్తు చేస్తున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. దీని ప్రకారం రూ.15లక్షలకుమించిన నగదు నిల్వలపై కొరడా ఝుళిపించనున్నట్టు తెలుస్తోంది.
రూ.3 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీలను నిషేధించిన కేంద్రం తాజాగా ఒక వ్యక్తి లేదా సంస్థల క్యాష్ హోల్డింగ్స్ పై కూడా పరిమితులు విధించనుందట. నల్లధనంపై యుద్దంలో భాగంగా జీఎస్టీ అమలుతోపాటు, మరో సంచలనానికి కేంద్రం తెరతీసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
దేశంలో నల్ల ధనం చలామణికి చెక్ పెట్టేందుకు సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక సిఫారసులు చేసింది. రూ.3 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీల రద్దుతో పాటు రూ.15 లక్షలకు మించి నగదు ఉంచుకోకుండా పరిమితి విధించాలని సూచించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబి షా నాయకత్వంలోని సిట్.. ఈ సిఫారసులు చేసింది. అలాగే నగదు నిల్వలపై పరిమితులు లేకుండా ఈ నిషేధం అమలు చేయడం కష్టమని కూడా స్పష్టం చేసింది. ఇందుకోసం ఏ వ్యక్తి, సంస్థా రూ.15 లక్షలకు మించి నగదు ఉంచుకోకుండా పరిమితి విధించాలని కోరింది. అయితే మరింత నగదు అవసరమైనపుడు సంస్థలు, వ్యక్తులు తమ ప్రాంతంలోని ఐటి శాఖ అధికారుల అనుమతితో అధిక నగదు ఉంచుకునే వెసులుబాటు కల్పించాలని నివేదించిన సంగతి తెలిసిందే.
అయితే బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్లీ నగదు నిల్వ పరిమితిపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, దీనికోసం ఒక ఆర్థికబిల్లును తీసుకురావాల్సి ఉందని పేర్కొనడం గమనార్హం.
కాగా ఇప్పటికే ప్రైవేటు బ్యాంకులు నెలకు నాలుగు ఉచిత లావాదేవీలు తరువాత నగదు ఉపసంహరణలపై రూ.150 బాదుడు నిర్ణయాన్ని ప్రకటించాయి. అలాగే హెచ్డీఎఫ్సీ, ఐసిఐసిఐ ,యాక్సిస్ బాటలో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులుకూడా పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.