రూ. 5 కోట్ల లాటరీ వచ్చిందని..
ఆశపడి మోసపోయిన యువకుడు
రూ.4.27 లక్షలు పోగొట్టుకున్న వైనం
పోలీసులకు ఫిర్యాదు
దుత్తలూరు : ఓ వైపు సాంకేతిక పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా మోసపోతూనే ఉన్నారు. దుత్తలూరు బీసీ కాలనీకి చెందిన షేక్ ఖాదర్‌బాషా అనే యువకుడు తన జీమెయిల్‌కు రూ.5 కోట్ల లాటరీ తగిలిందనే మెసేజ్ రావడంతో సదరు వ్యక్తులను సంప్రదించి రూ.4,27,200 పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. పోలీసుల కథనం మేరకు.. దుత్తలూరు బీసీ కాలనీకి చెందిన షేక్ ఖాదర్‌బాషా జీ మెయిల్‌కు ఆగస్టు 21న కోకోకోలా మొబైల్ డ్రా సెంటర్, లండన్ పేరుతో రూ.5 కోట్ల లాటరీ తగిలిందని మెసేజ్ వచ్చింది. ఆగస్టు 22న ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి 09643055483 నంబరుతో బాధితుడికి ఫోన్ చేసి మీకు లాటరీలో రూ.5 కోట్లు వచ్చాయి, అవి పొందాలంటే ఎయిర్‌పోర్టు, కస్టమ్ ట్యాక్స్‌కు రూ.22,600 చెల్లించాలని తెలిపారు. దీన్ని నమ్మిన ఆ యువకుడు అదే రోజు ఉదయగిరి ఎస్బీఐ శాఖ నుంచి ఖాతా నంబరు 35273660896 జమ చేశాడు. మంగళవారం మళ్లీ అదే నంబరు నుంచి ఖాదర్బాషాకు ఫోన్ చేసి రిజర్వ్ బ్యాంకుకు వెళుతున్నానని చెప్పి ఇతని పూర్తి వివరాలు సేకరించారు. లాటరీ నగదును పంపుతున్నట్లు వీడియో తీసి పంపారు. దీంతో ఖాదర్బాషాకు నమ్మకం పెరిగింది. అయితే మరో రూ.46,600 చెల్లించాలని సదరు లాటరీ సంస్థ నుంచి ఫోన్ రావడంతో అవి కూడా చెల్లించాడు. ఆగస్టు 24న మళ్లీ ఫోన్ చేసి లాటరీ నగదు పంపేందుకు మరూ రూ.1,32,500 కట్టమని చెప్పగా అవికూడా అప్పు చేసి మరీ కట్టాడు. మళ్లీ మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటూ వీడియో పంపారు. అయితే ఇన్‌కంట్యాక్స్ కింద మరో రూ.2,25,500 చెల్లించాలని, ఇదే లాస్ట్ ఇక చెల్లించాల్సిన అవసరం లేదని నమ్మబలికారు. నమ్మిన ఆ యువకుడు బంగారు నగలు కుదువ పెట్టి మరీ ఆ నగదును వారి ఖాతాకు జమ చేశాడు. దీంతో బాధితుడు మొత్తం రూ.4,27,200 చెల్లించాడు. అయితే మరో రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి మీ మెయిల్ చూసుకోండి అని చెప్పగా అందులో రిఫ్లెక్షన్ కోడ్ ఫీజ్ కింద మరో రూ. 4,47,400 కడితే మీకు రూ.4,41,86,000 మీ పర్సనల్ అకౌంట్‌కు జమ చేస్తామని ఉంది. దీంతో బాధితుడు మోసపోయానని గ్రహించి సన్నిహితుల వద్ద వాపోయాడు. స్థానికుల సలహాతో ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందజేశాడు. ఫిర్యాదు అందడంతో ఉదయగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సైదులు బాధితుడి నుంచి పూర్తి వివరాలు సేకరించి విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.