ఒక్కో ఉద్యోగికి రూ.66,30,500 బోనస్
న్యూయార్క్: ప్రముఖ శక్తి వనరుల ఉత్పత్తి సంస్థ 'హిల్ కార్ప్' తమ ఉద్యోగులకు క్రిస్మస్ సంబురాలు ముందే తెచ్చిపెట్టింది. గతంలోని సంబరాలకంటే భారీ స్థాయిలో వారు వేడుకలు జరుపునేలా గొప్ప అవకాశం వారింటి ముందుకొచ్చింది. అందులో పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగికి ఒకటికాదు రెండు కాదు ఏకంగా రూ.66,30,500 బోనస్ ప్రకటించింది. ఈ విషయం ఒక్కసారిగా తెలుసుకున్న ఆ ఉద్యోగుల అనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఓ పక్క ప్రపంచ దేశాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి సంస్థలను అనూహ్యంగా ఎదురవుతున్న నష్టాలు తీవ్ర ఒత్తిడిలోకి నెడుతుండగా.. అదే సమయంలో హిల్ కార్ప్ మాత్రం ఈ బోనస్ ప్రకటించి ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. ప్రముఖ బిలియనీర్ హిల్డేబ్రాండ్ కు చెందిన హిల్ కార్ప్ సంస్థ గత ఐదేళ్ల కిందటే తాను నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఆ సమయంలో దాదాపు రూ.20 లక్షలకు పైగా బోనస్ తోపాటు ఓ కారును కూడా తమ ఉద్యోగికి బహుమతిగా అందజేసింది.
తిరిగి ఈ ఏడాది కూడా తాము లక్ష్యంగా పెట్టుకున్నదానికంటే రెండింతలు చమురు ఉత్పత్తి సాధించడంతో గతంలో ఇచ్చిన బోనస్ ను మూడింతలు పెంచేసి ఏకంగా ఒక్కో వ్యక్తికి రూ.66 లక్షలకు పైగా బోనస్ ప్రకటించింది. ఈ సంస్థలో మొత్తం 1,400మంది ఉద్యోగులు ఉన్నారు. 56 ఏళ్ల హిల్దే బ్రాండ్ ముందునుంచే తమ ఉద్యోగులతో మంచి సంబంధాలు నెరుపుతూ చక్కటి ఔదార్యంతో వ్యవహరిస్తుంటారు. దీనికి తోడుగా ఆయనకు సంపద సృష్టికరణలో ఉద్యోగులు, కార్మికులు అండదండగా ఉంటారు. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితా ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ 5.9బిలియన్ డాలర్లు.