'రజనీ.. మోదీ సేమ్ టు సేమ్'
రాజకీయాల్లో చేరే విషయమై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్.గురుమూర్తి స్వాగతించారు. బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే సూపర్‌స్టార్ ఆచితూచి మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. ప్రధానమంత్రిగా ఎన్నికైన తొలినాళ్లలో ప్రధాని మోదీ 'నేను తినను, ఎవరినీ తిననివ్వను' అని అవినీతి విషయంలో చెప్పారని, అచ్చం అలాగే ఇప్పుడు రజనీకాంత్ కూడా మాట్లాడుతున్నారని, వాళ్లిద్దరి మాటతీరు ఒకేలా ఉందని గురుమూర్తి అన్నారు. ''దేవును నన్ను ఇప్పుడు ఒక నటుడిగా ఉపయోగించుకుంటున్నాడు. కానీ, భవిష్యత్తు గురించినేను ఏమీ చెప్పలేను. నేను రాజకీయాల్లోకి చేరాలని దేవుడు నిర్ణయించుకుంటే, అప్పుడు నేను అలాగే చేస్తాను'' అని అభిమానులతో సమావేశం సందర్భంగా రజనీకాంత్ వ్యాఖ్యానించారు.''ఒకవేళ నేను రాజకీయాల్లో చేరాలని నిర్ణయించుకున్నా, తప్పుడు మనుషులు నాతో చేరడానికి ఒప్పుకోను. వాళ్లను దూరంగానే పెడతా'' అంటూ విలువలతో కూడిన రాజకీయాలే చేస్తానన్నారు.
21 ఏళ్ల క్రితమే తనకు రాజకీయాల్లో చేదు అనుభవం ఎదురైందంటూ అప్పట్లో డీఎంకే-టీఎంసీ కూటమికి మద్దతు ఇచ్చిన విషయాన్ని రజనీకాంత్ ప్రస్తావించారు. దాన్ని ఒక రాజకీయ ప్రమాదంగా రజనీ అభివర్ణించారు. ఈ విషయాన్ని కూడా గురుమూర్తి ప్రస్తావించారు. 1990ల తొలినాళ్లలో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రజనీకాంత్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. అయితే, ఆ పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించడంతో దాన్నుంచి వైదొలగి డీఎంకే - తమిళ మానిల కాంగ్రెస్ కూటమికి అండగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై వెళ్లినప్పుడు రజనీకాంత్‌ను కలిశారు. అయితే అది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని ఇద్దరూ స్పష్టం చేశారు.