ఆ సంస్థ.. 39 దేశాలకు విస్తరించింది!
ఖాకీ నిక్కర్, తెల్లటి షర్టు, తలపై టోపీ, చేతిలో లాఠీ.. చిన్న పిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకు అందరికీ ఒకటే యూనిఫాం. ఇవన్నీ వింటే.. వెంటనే అది ఆర్ఎస్ఎస్ అని అర్థమవుతుంది. ఒకప్పుడు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఈ సంస్థ.. తర్వాత క్రమంగా పలు దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా సహా 39 దేశాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలున్నాయి. తాను చిన్నతనంలో ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్లలేదని, కానీ ఇప్పుడు మాత్రం తన పిల్లలలను పంపుతున్నానని ఎన్నారై గిరీష్ బగ్మర్ తెలిపారు. భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోడానికి తనతో పాటు చాలామంది ఎన్నారైలు తమ పిల్లలను ఆర్ఎస్ఎస్కు పంపుతున్నారని ఆయన చెప్పారు. తాను చిన్నతనంలో భారతదేశంలోనే పెరగడంతో తాతల నుంచి సంస్కృతి తెలుసుకున్నామని, కానీ తమ పిల్లలకు మాత్రం అలాంటి అవకాశం లేకపోవడంతో ఆర్ఎస్ఎస్కు పంపిస్తున్నామని వివరించారు.
అయితే, ఇతర దేశాల్లో ఇది ఆర్ఎస్ఎస్ అనే పేరుతో కాకుండా హిందూ స్వయంసేవక్ సంఘ్ (హెచ్ఎస్ఎస్) అనే పేరుతో నడుస్తోంది. చిన్మయ మిషన్, రామకృష్ణ మిషన్ లాంటి సంస్థలతో పాటు హెచ్ఎస్ఎస్ కూడా పలు దేశాల్లో క్రమంగా పాతుకుంటోంది. మధ్యప్రాచ్యంలోని ఐదు దేశాలలో కూడా ప్రస్తుతం హెచ్ఎస్ఎస్ శాఖలున్నాయి. ఫిన్లాండ్లో మాత్రం ఈ-శాఖ పనిచేస్తోంది. అక్కడి కార్యకలాపాలను స్కైప్ లాంటి వీడియో చాటింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర లాంటి వాటిని తెలుసుకోడానికి విదేశాల్లో స్థిరపడిన భారతీయులు బాగా ఆసక్తి చూపిస్తున్నారని, ఇక్కడ తాము మైనారిటీలం కావడంతో తమకు ఇది సామాజికంగా కూడా ఒక వేదిక అవుతోందని లండన్‌కు చెందిన సుబీర్ సిన్హా చెప్పారు. ఇలా పలు దేశాల్లో ఎప్పటి నుంచో స్థిరపడిన భారతీయ కుటుంబాల వాళ్లు ఇలాంటి సంస్థల ద్వారా తమ మూలాలను పిల్లలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.