ఆర్టీఏలో అవినీతి బాగోతం?
నిబంధనలు ఇలా...
కొనుగోలు చేసిన ప్రతీ వాహనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలకు పూర్తి వివరాలను రిజిస్ట్రేషన్ కార్డుపై ముద్రించి ఆర్టీఏ కార్యాలయం నుంచి యజమానికి అందజేస్తారు. ఒరిజినల్ కార్డును ఒకసారి మాత్రమే జారీచేస్తారు. అది పోతే పోలీస్‌స్టేషన్ నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తే నిబంధనల మేరకు మరోకార్డుపై డూప్లికేట్ అని ముద్రించి జారీచేస్తారు.
జరుగుతోంది ఇలా...
వివిధ ఫైనాన్స్‌ల నుంచి రుణం తీసుకుంటూ వాహనాలు కొనుగోలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఫైనాన్స్ సాయంతో కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డులు యజమాని వద్దనే ఉంటాయి. డబ్బులు చెల్లించకుంటే ఆ వాహనాలను ఫైనాన్స్ నిర్వాహకులు సీజ్‌చేసి విక్రయిస్తుంటారు. ఇలాంటి వాహనాలను కన్సల్టెన్సీ వారు తక్కువ ధరకు టెండర్లో తీసుకుంటారు. వాటికి సంబంధిం చిన ఒరిజి నల్ ఆర్సీ కార్డు యజమాని వద్ద ఉండడంతో డూప్లికేట్‌ను తీసుకుని వాహనాలు విక్రయించాల్సి ఉంటుంది. కార్డు పోయిందని గతంలో పోలీస్‌స్టేషన్ నుంచి గంటల వ్యవధిలో సర్టిఫికెట్‌ను కన్సల్టెంట్లు తీసుకునేవారు. ప్రస్తుతం సర్టిఫికెట్ కావాలంటే మొదట మీ సేవలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఎస్సై లేదంటే సీఐ పరిశీలించి అప్రూవల్ చేస్తే మీ సేవ నుంచి సర్టిఫికెట్ జారీ అవుతుంది. దీనికి కనీసం వారం సమయం పడుతుంది.
అది కాకుండా ప్రస్తుత రవాణాశాఖ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాహన యజమాని వచ్చి అమ్మినట్లు సంతకం చేస్తేనే అది చెల్లుతుం దని నిబంధన పెట్టారు. ఈ రెండు కష్టతరమని నిర్ధారించుకున్న కొందరు... రిజిస్ట్రేషన్ కార్డులు సులువుగా పొందేందుకు వక్రమార్గాలు వెతికినట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్‌తో సంబంధం లేకుండా గతంలో మాదిరిగానే అన్ని డాక్యుమెంట్ల ను కార్యాలయంలో సమర్పించి ఎలాంటి లావాదేవీలు జర పకుండా నేరుగా రిజిస్ట్రేషన్ కార్డులు కొనుగోలుదారుల పేరనే కొందరు బయటకు తీసుకొస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఆర్టీఏ కార్యాలయంలో ఉద్యోగుల సహకారంతో కొందరు ఏజెంట్లు ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం.
గత పదిహేను రోజుల్లో సుమారు 40 కార్డులు బయటకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. కార్యాలయంలో ఆన్లైన్లో లావాదేవీలు చేయకుండా, కార్డుల్లో డూప్లికేట్ అని లేకుండా ఎలా ముద్రించి బయటకు వచ్చాయనేది ప్రధాన ప్రశ్న. ఎవరికీ కాని పనులు కొందరికే ఎలా అవుతున్నాయని మరి కొందరి వాదన. ఇటీవల ఓ కన్సల్టెంట్ జిల్లా కలెక్టర్‌తోపాటు ఆర్టీవో నుంచి ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో వాహనాలకు సంబంధించి పది రిజిస్ట్రేషన్ నంబర్లు, కొన్ని ఆర్సీ కార్డులను సైతం అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. వీటిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు బయటపడే అవకాశముంది.
మా దృష్టికి వచ్చింది
రిజిస్ట్రేషన్ కార్డుల వ్యవహారం మా దృష్టికి వచ్చింది. అయితే ఒకే వాహనానికి రెండు కార్డులుంటే వెంటనే తప్పని చెప్పవచ్చు. మూడు వాహనాలకు సంబంధించి మా వద్దకు ఒక్కొక్క కార్డులే వచ్చాయి. ఈ విషయాన్ని ఐటీ విభాగం జాయింట్ కమిషనర్ దృష్టిలో పెట్టాం. ఆర్టీఏ కార్యాలయంలో టూ టైర్ సర్వర్‌ను సీజ్ చేశాం. వీటిపై విచారణ జరుపుతున్నాం. తర్వాతే అసలు విషయం తెలుస్తుంది.
- మీరా ప్రసాద్, డీటీసీ