RTC income
-
APSRTC: చౌకగా ఆర్టీసీ కార్గో సేవలు.. పెరుగుతున్న ఆదరణ
ఆర్టీసీ అంటే ప్రజల్లో ఓ నమ్మకం. ప్రయాణం సురక్షితంగా.. సుఖవంతంగా సాగుతుందన్న భరోసా. ఇప్పుడు కార్గో సేవల్లోనూ ఆ సంస్థ అధికారులు అదే మంత్రాన్ని పఠిస్తున్నారు. సరుకులను సురక్షితంగా, సమయానికి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. చౌకగా రవాణా సేవలు అందిస్తున్నారు. అందుకే... ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. సుస్థిర ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. దీనికి పార్వతీపురం మన్యం జిల్లాలో కార్గో సేవలతో ఆర్టీసీకి పెరుగుతున్న ఆదాయమే నిదర్శనం. పార్వతీపురం టౌన్: ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. సరకు రవాణా పెరుగుతుండడంతో సంస్థకు అదనపు ఆదాయం చేకూరుతోంది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల పరిధిలో కార్గో ఆదాయం గతేడాది కంటే పెరిగింది. ప్రైవేటు సంస్థలతో పోల్చితే ఆర్టీసీలో సురక్షితంగా సేవలందుతుండడంతో వినియోగదారులు కార్గోపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్టీసీకి అండగా నిలుస్తున్నారు. చౌకగా రవాణా.. వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పుస్తకాలు, మందులు తదితరవి తక్కువ చార్జీలతో రవాణా చేస్తుండడంతో ఆర్టీసీ కార్గోసేవలు వినియోగదారుల ఆదరణ చూరగొంటున్నాయి. జిల్లాలో కార్గో సేవల ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.90లక్షల ఆదాయం సమకూరింది. పార్సిల్స్, కొరియర్ కవర్లు రవాణా చేయడంతో ఈ ఆదాయాన్ని సముపార్జించింది. రోజూ సుమారు మూడు డిపోల ద్వారా 90 పార్సిళ్లు ఉంటున్నాయి. పార్సిళ్లను జిల్లాలో అయితే సుమారు 8 గంటల్లోపు, రాష్ట్రంలో అయితే 24 గంటల్లోపు గమ్య స్థానాలకు చేర్చుతోంది. 2021–22లో సరుకు రవాణాతో రూ.1.16 కోట్ల ఆదాయం ఆర్జించింది. యువతకు ఉపాధి.. కార్గో సేవలతో ఓ వైపు ఆర్టీసీకి ఆదాయంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తోంది. జిల్లాలో ని 3 డిపోల నుంచి సరకు రవాణా చేయడమే కాకుండా పార్వతీపురం డిపోకు అనుసంధానంగా బొబ్బిలి బస్టాండ్‌లో కార్గో పాయింట్లలో ఆరుగురు, సాలూరు డిపోలో ఆరుగురు, పాలకొండలో ఆరుగురు మొత్తం 18 మంది ఏజెంట్లను నియమించింది. వారికి కార్గో వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించింది. 180 మంది కళాసీలకు పని కల్పిస్తోంది. ఆసక్తి కలిగిన మరింతమంది నిరుద్యోగులకు ఫ్రాంచైజీ ఏజెన్సీలు ఇవ్వడానికి కూడా ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏజెన్సీ ద్వారా కేవలం సరకు బుకింగ్, డెలివరీ సదుపాయాలే కాకుండా ఆర్టీసీ బస్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అయితే రూ.10వేలు డిపాజిట్‌గా, మిగిలిన ప్రాంతాల్లో రూ.1000 డిపాజిట్ చెల్లించి ఏజెన్సీ పొందవచ్చని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. నమ్మకంతో రవాణా ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంతో పోల్చుకుంటే వ్యాపారం పెరిగింది. అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి వల్ల ఆదాయం గణనీయంగా వృద్ధిచెందింది. వ్యాపారులకు, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. వ్యాపారులు వారి సరుకులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చాం. – టీవీఎస్ సుధాకర్, జిల్లా ప్రజారవాణా అధికారి, పార్వతీపురం మన్యం -
ఆర్టీసీ ఆదాయం రూ. 9 కోట్లు
మేడారం: మేడారం మహాజాతరకు భక్తులను చేర్చడంతో ఆర్టీసీ కీలకపాత్ర పోషించిందని ఆర్టీసీ ఎండీ జీవీ రమణరావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నంనాటికి ఆర్టీసీ బస్సులు వివిధ ప్రాంతాల నుంచి జాతరకు సు మారు 5 లక్షల మంది ప్రయాణికులను, జాతర నుంచి గమ్యస్థానాలకు సుమారు 2 లక్షల మందిని చేర్చినట్లు తెలిపారు. ఇలా ఆర్టీసీకి సుమారు రూ.9 కోట్ల ఆదా యం వచ్చిందని ఆయన వెల్లడించారు. పాత జిల్లాలైన వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్ జిల్లాల నుంచి సుమారు 2,200 బస్సులు నడుపగా ఇతర జిల్లాల నుంచి సుమారు 2000 బస్సులను అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. తొలిసారి ఉచితంగా.... నార్లాపూర్ నుంచి జంపన్న వాగుకు భక్తులను చేర్చేందుకు ఆర్టీసీ తొలిసారిగా ఉచితంగా బస్సులను ఏర్పాటు చేసింది. జంపన్నవాగుకు ఉచిత బస్సుల ద్వారా సుమారు 40 వేల మందిని చేర్చారు. మహారాష్ట్ర సిరొంచ ప్రాంతం నుంచి జాతరకు తొలిసారిగా బస్సు సౌకర్యం కల్పించారు. సుమారు 40 బస్సు సర్వీసులు నడిపారు. జాతరకు వచ్చి తిరుగు ప్రయాణంలో ములుగు రోడ్డులో దిగి వరంగల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులను లింక్ బస్సుల ద్వారా ఉచితంగా చేర్చినట్లు ఎండీ రమణరావు తెలిపారు. దీంతోపాటు జాతరకు 6 వజ్ర 85 సూపర్ లగ్జరీ, 27 ఏసీ బస్సులు నడిపినట్లు ఆయన పేర్కొన్నారు. సేవలు అమోఘం : రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి భూపాలపల్లి: మేడారం జాతరకు ఆర్టీసీ ప్రశంసనీయమైన సేవలు అందిస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 8 లక్షలమందికిపైగా భక్తులను తరలించినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న అనంతరం ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్‌లోని కంట్రోల్ కమాండ్ రూంలో ప్రయాణికుల క్యూరేలింగ్లను ఎండీ రమణారావు, ఈడీలు రవీందర్, పురషోత్తంనాయక్, సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎంలు సూర్యకిరణ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆర్టీసీ సేవలు భేష్.. మేడారం: మేడారం మహాజాతరకు అశేష భక్తజనాన్ని తరలిస్తున్న ఆర్టీసీ సిబ్బంది సేవలు అద్భుతంగా ఉన్నాయని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనం కోసం వచ్చిన ఆయన ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని భక్తులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులను క్షేమంగా ఇంటికి చేర్చాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా అంతకు ముందు ఆయన వాహనం భక్తుల మధ్య ఇరుక్కుపోవడంతో ద్విచక్ర వాహనంపై ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్నారు. చైర్మన్‌ను కలిసిన వారిలో అధికారులు ఆర్టీసీ ఎండీ జీవీ రమణరావు, పురుషోత్తం, సత్యనారాయణ, వెంకట్రావు, సూర్యకిరణ్, మునిశేఖర్, రాములు తదితరులు ఉన్నారు. -ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ -
ఆర్టీసీ ఆదాయం అదుర్స్
- రోజుకు అదనంగా రూ. కోటి ఆదాయం - ‘అరుణాచల్’ఉదంతంతో పెరిగిన ప్రయాణికుల తాకిడి - ప్రైవేట్ ‘స్టేజీ క్యారియర్ల’నూ నియంత్రిస్తే నష్టాలు మాయం సాక్షి, హైదరాబాద్: ఉన్నట్టుండి ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. పాఠశాలలు మొదలైనా, వానలు కురుస్తున్నా ఆదాయంపై ఏమాత్రం ప్రభావం పడలేదు. ఏటా జూన్ చివరి నాటికి ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయి ఆదాయం తగ్గుతుంటుంది. కానీ ఈసారి మాత్రం ఆర్టీసీకి నిత్యం అదనంగా దాదాపు రూ.కోటి మేర ఆదాయం సమకూరుతున్నట్టు సమాచారం. ప్రైవేటు బస్సు మాఫియాపై అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఏర్పడ్డ కుదుపు ప్రభావమిది. అరుణాచల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా తిరుగుతున్న బస్సులపై ఆ రాష్ట్ర రవాణా శాఖ విరుచుకుపడి రిజిస్ట్రేషన్లు రద్దు చేయటం, ఇక్కడి రవాణా శాఖ వాటిని సీజ్ చేస్తుండటంతో అనేక బస్సులు రోడ్డెక్కటం లేదు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీవైపు మళ్లడంతో ఆదాయం పెరిగింది. ప్రత్యేక ప్రణాళిక కరువు.. బస్సులను తిప్పేందుకు ప్రైవేటు బస్సు మాఫియా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే.. ఆర్టీసీ మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. గతంలో 70 శాతం లోపే ఉన్న ఆక్యుపెన్సీ తాజాగా పెరుగుతోంది. ప్రయాణికుల తాకి డికి అనుగుణంగా కొత్త బస్సులు సమకూ ర్చుకుని ‘ప్రైవేటు’కు అడ్డుకట్ట వేయాల్సి ఉండగా.. జప్తు మొదలైన తర్వాత ఒక్క బస్సు నూ ఆర్టీసీ సమకూర్చుకోలేదు. ఇక.. స్థానికంగా టూరిస్టు పర్మిట్ తీసుకుని స్టేజ్ క్యారియర్లుగా తిరుగుతున్న బస్సులపైనా రవాణా శాఖ ఇప్పటి వరకు దృష్టి సారించ లేదు. మరోవైపు వాటిని నియంత్రిస్తే ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన భారం పైన పడుతుందని ప్రభుత్వమూ ఆ దిశగా చర్యలపై రవాణా శాఖను పురమాయించటం లేదు. వెరసి ఆర్టీసీ బలోపేతమయ్యే మంచి అవకాశం చేజారిపోతోంది. బస్సులు కిటకిట.. మే నెలలో వేసవి సెలవులుండటం వల్ల ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ.12 కోట్లు మించుతుంది. అలాగే శుభకార్యాలూ ఉండటంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే పాఠశాలలు ప్రారంభమవడం, వానలు మొదలవడంతో జూన్ మూడోవారం నాటికి ఆదాయం తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు జూలై వచ్చినా ఆదాయం నిత్యం సగటున రూ.12.5 కోట్ల నుంచి రూ.13 కోట్ల మేర నమోదవుతోంది. దీంతో ఆర్టీసీ ఉత్సాహంగా బస్సులు తిప్పుతోంది.