రూపాయి మరింత డౌన్
ముంబై: రెండు రోజుల లాభాల అనంతరం రూపాయి బుధవారం మరో కొత్త కనిష్ట స్థాయిలో ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 53 పైసలు క్షీణించి 61.30 వద్ద క్లోజయ్యింది. గత శుక్రవారం నాటి 61.10 తర్వాత ఇది కొత్త కనిష్ట స్థాయి ముగింపు. డాలర్లకు దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణం. అమెరికా ఫెడరల్ రిజర్వ్.. బాండ్ల కొనుగోలు ప్రక్రియను ఉపసంహరించే అవకాశాలున్నాయన్న సంకేతాలు, మరిన్ని విదేశీ నిధులు తరలిపోతుండటం సైతం రూపాయి బలహీనతకు దారితీశాయని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. రూపాయి ట్రేడింగ్ 60.90-61.90 శ్రేణిలో ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.