Rural agriculture
-
మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం!
పురాతన కాలం నుంచే భారతీయ సంస్కృతికి, వ్యవసాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సింధు నాగరికత కాలంలో వ్యవసాయం గురించి మనం చదువుకునే ఉంటాము. అప్పటి వినూత్న వ్యవసాయ పద్దతులతో ప్రజలు.. పంటలను సమృద్ధిగా పండించారు. కాగా, ఓ రైతు తాజాగా వినూత్న తరహాలో వ్యవసాయం చేస్తున్నాడు. కాగా, సృజనాత్మకత విషయానికి వస్తే భారతీయులు ప్రతీ ఒక్కరినీ ఓడించగలరని మరోసారి రుజువైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ రైతు ట్రేడ్మిల్ వంటి యంత్రంపై ఎద్దును నడిపిస్తూ సాగుకు కావాల్సిన నీటిని, మోటర్ల సాయంతో కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాడు. కాగా, ఎద్దు ట్రేడ్మిల్ వంటి యంత్రంపై నడుస్తుండగా పైపుల ద్వారా నీరు పంట పొలాలకు చేరుతోంది. అలాగే, మోటర్ల సాయంతో కరెంట్‌ను సైతం ఉత్పత్తి చేసి పంటల సాగుకు వాడుకుంటున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదరు వీడియోకు ‘రూరల్ ఇండియా ఇన్నోవేషన్. ఇట్స్ అమేజింగ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సదరు క్రియేటివ్ రైతులను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. స్వదేశీ ఆవిష్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతాయని అన్నాడు. మరో యూజర్ మాత్రం.. జంతువులను శారీరకంగా హింసిస్తున్నాడంటూ కామెంట్స్ చేశాడు. RURAL INDIA Innovation. It’s Amazing!! pic.twitter.com/rJAaGNpQh5 — Awanish Sharan (@AwanishSharan) September 23, 2022 -
ఆర్బీఐ సమీక్ష, క్యూ3 ఫలితాలే కీలకం..!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రభావం ఈ వారంలో కూడా స్టాక్ మార్కెట్‌పై ఉండనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం కొనసాగనున్నప్పటికీ.. ఫిబ్రవరి 7న వెల్లడికానున్న ఆర్బీఐ ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్ణయం దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనుందని భావిస్తున్నారు. ఈ ప్రధాన అంశానికి తోడు అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి, క్యూ3 గణాంకాలపై ఈవారం ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ విరల్ బెరవాలా విశ్లేషించారు. విదేశీ నిధుల ప్రవాహం కూడా ఈవారంలో కీలక పాత్ర పోషించనుందని చెప్పారాయన. ‘కేంద్ర ప్రభుత్వ పరిమిత ద్రవ్యోల్బణ వైఖరిని బడ్జెట్ వెల్లడించిన నేపథ్యంలో ప్రత్యేకించి గ్రామీణ వ్యవసాయ రంగం.. రిటైల్, గృహా రుణాల కార్పొరేట్ ఆదాయాలు పెరిగేందుకు అవకాశం ఉంది.’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థికవేత్త ధనన్జయ్ సిన్హా పేర్కొన్నారు. ఫార్మా ఫలితాలు.. పలు దిగ్గజ ఫార్మా కంపెనీలు ఈవారంలో వెల్లడికానున్నాయి. బుధవారం లుపిన్, సిఫ్లా.. గురువారం అరబిందో ఫార్మా, కాడిలా హెల్త్‌కేర్ క్యూ3 గణాంకాలను ప్రకటించనున్నాయి. ఇతర దిగ్గర కంపెనీల్లో సోమవారం (4న) కోల్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, ఐఆర్బీ ఇన్ఫ్రా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎక్సైడ్ ఫలితాలను ప్రకటించనుండగా.. మంగళవారం (5న) టెక్ మహీంద్రా, గెయిల్, హెచ్‌పీసీఎల్, ఏసీసీ, బీహెచ్ఈఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, డీఎల్ఎఫ్, అపోలో టైర్స్, టాటా గ్లోబల్, డిష్ టీవీ గణాంకాలు వెల్లడికానున్నాయి. బుధవారం (6న) అదానీ పోర్ట్స్, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అలహాబాద్ బ్యాంక్.. గురువారం (7న) టాటా మోటార్స్, బ్రిటానియా, అదానీ ఎంటర్ప్రైజెస్, కాఫీ డే, గ్రాసిమ్ ఫలితాలు వెల్లడికానున్నాయి. శుక్రవారం (8న) మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్‌హెచ్‌పీసీ, బీపీసీఎల్, ఇంజనీర్స్ ఇండియా ఫలితాలను ప్రకటించనున్నాయి. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ జనవరి డేటా మంగళవారం వెల్లడికానుంది. అంతర్జాతీయ అంశాల పరంగా.. అమెరికా ఉద్యోగ గణాంకాలు, జీడీపీ గణాంకాలు, పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ ఈవారంలోనే వెల్లడికానున్నాయి. వీటితోపాటు అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ అంశం, వెనిజులాలో సంక్షోభం వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలతో ముడిపడి.. ముడిచమురు, రూపాయి కదలికలు ఆధారపడి ఉండగా.. ఈ ప్రభావం మార్కెట్‌పై ఉండనుందని తెలిపారు. గత నెల్లో 30 శాతం పతనాన్ని నమోదుచేసిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. మళ్లీ ఎగువస్థాయిల వైపు ప్రయాణం కొనసాగిస్తున్నాయి. 62 డాలర్ల సమీపానికి చేరుకున్నాయి. ధరలు మరింత పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ‘మళ్లీ క్రూడ్ ధరల జోరు కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ 71కి చేరుకుంది. 70.80 వద్దనున్న కీలక నిరోధాన్ని అధిగమించిన నేపథ్యంలో ఆ తరువాత రెసిస్టెన్స్ 72.60 వద్ద ఉంది. సమీపకాలంలో రూపాయి విలువపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కీలక మద్దతు స్థాయి 70.40– 69.90 వద్ద కొనసాగుతోంది.’ అని అబియన్స్ గ్రూప్ చైర్మన్ అభిషేక్ బన్సల్ విశ్లేషించారు. ఎఫ్ఐఐల నికర విక్రయాలు.. గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5,264 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.97 కోట్లను జనవరిలో వెనక్కి తీసుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా.. ఎఫ్‌పీఐలు వేచిచూసే వైఖరిని ప్రదర్శిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. -
చెమట చుక్కలే చెలికత్తెలు!
ప్రపంచ జనాభాలో సగమైన మహిళ సమాజ గమనంలో అంతటా తానై నిలిచింది. ఆహార ఉత్పాదన కార్యక్షేత్రాలైన గ్రామసీమల్లోని మహిళలే ప్రపంచం ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ తల్లులు. దారాలు కట్టిన చెమటే జలతారు మేలి ముసుగుగా నిరంతరం ఎండవానలకోర్చి హరిత క్షేత్రాల్లో బంగారు పంటల రాసులెత్తుతున్న మహిళలకు ‘సాక్షి’ వినమ్రంగా నమస్కరిస్తోంది. అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతోంది. గ్రామీణ స్త్రీకి పెద్దపీట వేస్తేనే ప్రభుత్వ విధానాలు పరిపూర్ణమవుతాయి. దేశ భవిష్యత్‌కు మూలాధారం గ్రామసీమలే అన్నారు జాతిపిత బాపూజీ. పల్లెల వ్యవసాయమే మన ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ. స్వయం సమృద్ధతే ఊపిరిగా బతికిన పల్లెలు స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్లలో నానాటికీ తీసికట్టు నాగం బొట్లన్నట్లు చతికిల పడ్డాయి. స్థూల జాతీయోత్పత్తిలో 64.8 శాతం అనుత్పాదక విభాగమైన సేవా రంగం నుంచి అందుతోంది. ఉత్పాదక రంగంలో వ్యవసాయం దాదాపు పారిశ్రామిక రంగంతో సరిసమాన వాటానందిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థకు మేలు భాగాన్ని అందిస్తున్న గ్రామీణ వ్యవసాయానికి వెన్నముక స్త్రీ. ‘సర్వోపగతుండు చక్రి..’ అన్న చందంగా ధారగా పారే చెమట చుక్కలతో పచ్చని పైరులకు ఊపిరి పోస్తోంది వీళ్లే. అంతా తానై సిరుల పంటల రాసులెత్తినా.. ఆమె సామాజిక అస్థిత్వం మాత్రం విసిరేసిన మాసిపాత సమానమయ్యింది. సాగును నమ్ముకున్న వారిలో స్త్రీలే ఎక్కువ మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళల్లో 86% మంది వ్యవసాయ పనులపై ఆధారపడి ఉండగా, పురుషులు 58 శాతమే సాగు పనుల్లో భాగస్వాములు. పాడి పరిశ్రమలో 1.5 కోట్ల మంది పురుషులు పనిచేస్తుండగా, 7.5 కోట్ల మంది స్త్రీలున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పశుపోషణలోనూ పురుషుల వాటా 1.5 కోట్లు కాగా, మహిళల సంఖ్య 2 కోట్లు. కాడి-మేడి మూలన పడిన ఈ కాలంలో ట్రాక్టర్లతో దుక్కులు చేయడమే పురుషుడి పని. తరువాత వరలు కట్టడం, నారు పోయడం, నాట్లు, కలుపు పనులను నిర్వహిస్తున్నది మహిళలే. పండిన పంట నూర్చి మార్కెట్‌కు తరలించడంలోనూ ముఖ్యపాత్ర వీరిదే. వ్యవసాయానికి ఆధారం, జవం, జీవ ం విత్తనం. నాటి సంప్రదాయ వ్యవసాయంలోనైనా నేటి ఆధునిక వ్యవసాయంలోనైనా విత్తనోత్పత్తి విడదీయరాని భాగం. వచ్చే పంటకు విత్తన ఎంపిక, భద్రపర్చడం మహిళలే చేసేవారు. ఆధునిక కాలంలో పత్తి, వరి, మొక్కజొన్న వంటి సంకర జాతి విత్తనోత్పత్తిలో ఆరేడు ఏళ్ల బాలికల నుంచి అంతా మహిళలే చేస్తారు. విత్తనోత్పత్తి క్షేత్రాల్లో సంకరపరిచే పని నిర్వహించేది వీరే. ఇక ప్రధాన వ్యాపార పంటలు పత్తి, పొగాకు, మిరప సాగులో 60 శాతం శ్రమ మహిళలదే. పత్తి విత్తడం, కలుపు తీత, ఏరటం వరకూ, పొగాకు నాటింది మొదలు బేరన్లకు చేర్చి గ్రేడింగ్ చేసే వరకూ చెమట చిందించేది వీరే. మిర్చి, కూరగాయలు, పండ్ల తోటల్లోనూ ఇదే పరిస్థితి. భారత వ్యవసాయ ఉత్పత్తి క్రమాన్ని సూక్ష్మంగా గమనిస్తే అన్నింటా మహిళలదే అగ్రతాంబూలమని అర్థమౌతుంది. పండించే పంట ఏదైనా పురుషుల పాత్ర కొద్ది గంటలకు మాత్రమే పరిమితమంటే అతి శయోక్తికాదు. పురుష ప్రధానమై న దుక్కిదున్నడం, ఎరువులు వేయడం వంటివన్నీ ఒకటి రెండు దఫాల్లో ముగిసే పనులే. మహిళలు చేసే కలుపుతీత సాలు పొడవునా కొనసాగే పని. సమాన వేతనం నీటి మీద రాతే! ఇంటి పని, పంటల సాగుతో పాటు అన్నింటా తానైన మహిళకు మాత్రం సాధికారత కరువయ్యింది. ఇక సమాన పనికి సమాన వేతనం అనేది నీటి మీద రాతై కాగితాలకు పరిమితమయిపోయింది. ప్రస్తుతం చాలాచోట్ల పురుషులకు రూ. 250 నుంచి 300 కూలి గిట్టుబాటవుతుండగా అదే పని చేస్తున్న మహిళలకు మాత్రం రూ.150 నుంచి 200 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. జీవిత కాలమంతా ఉత్పత్తి రంగంలోనే గడపడం వలన విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబడిపోయారు. దీనికి కారణం శ్రమ, ఉత్పాదకత, ఉత్పత్తి వనరైన భూమి మీద కనీస హక్కు లేకపోవడమే. మరోవైపు ఆధునిక అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై వలసలు పెరిగాయి. ఇందులోనూ ప్రథమ బాధితులు మహిళలే. పురుషులు వలసపోవడం వలన కుటుంబ, వ్యవసాయ నిర్వహణ పూర్తి భారం వారే తలకెత్తుకుంటున్నారు. మారాల్సింది ప్రభుత్వ విధానాలే.. ప్రభుత్వ విధానాల మార్పే మహిళలు ఎదు ర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం. వ్యవసాయం కేంద్ర బిందువుగా విధాన నిర్ణయాలు జరగాలి. జల వనరులను సంరక్షించి నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపర్చాలి. ఈ పని జరిగితే వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న మహి ళలకు వెసులుబాటు లభిస్తుంది. మహిళా సాధికారత చట్టాల కు పరిమితం కాకుండా భూయాజమాన్య హక్కులను కట్టబెట్ట డంతో పాటు మహిళా సాక్షరతకు ప్రాధాన్యతనిచ్చి నిధుల కేటాయింపులు జరిపితేనే పరిస్థితులు మెరుగుపడతాయి. సహజ వ్యవసాయమే మహిళకు రక్షరేఖ తీవ్రసంక్షోభంలో మునిగిపోతున్న వ్యవసాయరంగం గ్రామీణ సమాజంపైన, ముఖ్యంగా మహిళల మీద తీవ్ర దుష్ర్పభావం చూపుతోంది. వ్యవసాయ రంగంలో అన్నీ తానై నిలుస్తున్న మహిళలకు సాంద్ర వ్యవసాయ విధానం గోడదెబ్బ, చెంప దెబ్బగా మారింది. ఈ పరిస్థితిని నివారించాలంటే ప్రకృతి వనరుల మీద ఆధారపడి కొనసాగే నూతన వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయాల్సి ఉంది. సహజ లేదా సేంద్రి య వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వలన మొదట ఉపశమనం పొందేది మహిళలే. విషరసాయనాల వినియోగం తగ్గితే నేల పునరుజ్జీవం పొంది ఉత్పాదక శక్తి పెరుగుతుంది. దీనికితోడు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం ఆపివేయడం వలన ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. పౌష్టికాహారం అందడం వలన అనారోగ్య సమస్యలు సమసిపోతాయి. ఆర్థికంగా సుస్థిరతను సాధించ డం వలన విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణ సారథులవుతారు. నిర్మాణాత్మక ప్రణాళికతో మహిళాభివృద్ధికి, తద్వారా వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు చేయాల్సి ఉంది. - జిట్టా బాల్‌రెడ్డి, సాగుబడి డెస్క్ (ఈ నెల 15న అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం సందర్భంగా) గ్రామీణ మహిళా దినోత్సవం ఎందుకు? సమాజాభ్యున్నతికి గ్రామీణ మహిళలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి ఏడేళ్లుగా అక్టోబర్ 15న అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆహారోత్పత్తిలో గ్రామీణ మహిళల పాత్ర ఎంత కీలకమైనదో ఎలుగెత్తి చాటడం కోసమే ప్రపంచ ఆహార దినోత్సవానికి ముందురోజు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా మహాసభ కోరిన పన్నెండేళ్లకు ఈ కల సాకారమైంది. ఫొటో: పి.ఎల్ మోహన్‌రావు