ఆర్‌బీఐ సమీక్ష, క్యూ3 ఫలితాలే కీలకం..! | Q3 results key drivers for markets this week | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ సమీక్ష, క్యూ3 ఫలితాలే కీలకం..!

Published Mon, Feb 4 2019 5:05 AM | Last Updated on Mon, Feb 4 2019 5:05 AM

Q3 results key drivers for markets this week - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ ప్రభావం ఈ వారంలో కూడా స్టాక్‌ మార్కెట్‌పై ఉండనుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం కొనసాగనున్నప్పటికీ.. ఫిబ్రవరి 7న వెల్లడికానున్న ఆర్‌బీఐ ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్ణయం దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనుందని భావిస్తున్నారు. ఈ ప్రధాన అంశానికి తోడు అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి, క్యూ3 గణాంకాలపై ఈవారం ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు ఎస్సెల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐఓ విరల్‌ బెరవాలా విశ్లేషించారు. విదేశీ నిధుల ప్రవాహం కూడా ఈవారంలో కీలక పాత్ర పోషించనుందని చెప్పారాయన. ‘కేంద్ర ప్రభుత్వ పరిమిత ద్రవ్యోల్బణ వైఖరిని బడ్జెట్‌ వెల్లడించిన నేపథ్యంలో ప్రత్యేకించి గ్రామీణ వ్యవసాయ రంగం.. రిటైల్, గృహా రుణాల కార్పొరేట్‌ ఆదాయాలు పెరిగేందుకు అవకాశం ఉంది.’ అని ఎమ్కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆర్థికవేత్త ధనన్జయ్‌ సిన్హా పేర్కొన్నారు.

ఫార్మా ఫలితాలు..
పలు దిగ్గజ ఫార్మా కంపెనీలు ఈవారంలో వెల్లడికానున్నాయి. బుధవారం లుపిన్, సిఫ్లా.. గురువారం అరబిందో ఫార్మా, కాడిలా హెల్త్‌కేర్‌ క్యూ3 గణాంకాలను ప్రకటించనున్నాయి. ఇతర దిగ్గర కంపెనీల్లో సోమవారం (4న) కోల్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్, ఎక్సైడ్‌ ఫలితాలను ప్రకటించనుండగా.. మంగళవారం (5న) టెక్‌ మహీంద్రా, గెయిల్, హెచ్‌పీసీఎల్, ఏసీసీ, బీహెచ్‌ఈఎల్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, ఓరియంటల్‌ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, డీఎల్‌ఎఫ్, అపోలో టైర్స్, టాటా గ్లోబల్, డిష్‌ టీవీ గణాంకాలు వెల్లడికానున్నాయి. బుధవారం (6న) అదానీ పోర్ట్స్, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అలహాబాద్‌ బ్యాంక్‌.. గురువారం (7న) టాటా మోటార్స్, బ్రిటానియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కాఫీ డే, గ్రాసిమ్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. శుక్రవారం (8న) మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎన్‌హెచ్‌పీసీ, బీపీసీఎల్, ఇంజనీర్స్‌ ఇండియా ఫలితాలను ప్రకటించనున్నాయి.

స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి
నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ జనవరి డేటా మంగళవారం వెల్లడికానుంది. అంతర్జాతీయ అంశాల పరంగా.. అమెరికా  ఉద్యోగ గణాంకాలు, జీడీపీ గణాంకాలు, పర్చేజ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ ఈవారంలోనే వెల్లడికానున్నాయి. వీటితోపాటు అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ అంశం, వెనిజులాలో సంక్షోభం వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలతో ముడిపడి.. ముడిచమురు, రూపాయి కదలికలు ఆధారపడి ఉండగా.. ఈ ప్రభావం మార్కెట్‌పై ఉండనుందని తెలిపారు. గత నెల్లో 30 శాతం పతనాన్ని నమోదుచేసిన బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌.. మళ్లీ ఎగువస్థాయిల వైపు ప్రయాణం కొనసాగిస్తున్నాయి. 62 డాలర్ల సమీపానికి చేరుకున్నాయి. ధరలు మరింత పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ కదలికలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ‘మళ్లీ క్రూడ్‌ ధరల జోరు కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ 71కి చేరుకుంది. 70.80 వద్దనున్న కీలక నిరోధాన్ని అధిగమించిన నేపథ్యంలో ఆ తరువాత రెసిస్టెన్స్‌ 72.60 వద్ద ఉంది. సమీపకాలంలో రూపాయి విలువపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కీలక మద్దతు స్థాయి 70.40– 69.90 వద్ద కొనసాగుతోంది.’ అని అబియన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అభిషేక్‌ బన్సల్‌ విశ్లేషించారు.

ఎఫ్‌ఐఐల నికర విక్రయాలు..
గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.5,264 కోట్లు, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.97 కోట్లను జనవరిలో వెనక్కి తీసుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా.. ఎఫ్‌పీఐలు వేచిచూసే వైఖరిని ప్రదర్శిస్తున్నారని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement