భవిష్యత్తు ట్రిపుల్ ఐటీలదే: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తు ఐఐటీలది కాదని, ట్రిపుల్ ఐటీలదేనని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. నాణ్యమైన విద్యనందించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) తరహా యూనివర్శిటీలను ప్రోత్సహించాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆర్జీయూకేటీ మొదటి స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నరసింహన్ ముఖ్య అతిథిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ, నూజివీడు, బాసర ట్రిపుల్ ఐటీలలో 2008లో ఆరేళ్ల సమీకృత విద్యా విధానంలో ప్రవేశం పొంది ఈ ఏడాది విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకున్న విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకున్నారు.
బీటెక్, ఎంటెక్‌లలో విజేతలుగా నిలిచిన పలువురికి గవర్నర్, సీఎంలు మెడల్స్ అందించారు. ఫీజు ఇన్సెంటివ్‌ల కోసమే కళాశాలలను నడపడం సరికాదని గవర్నర్ అన్నారు. ఇన్సెంటివ్‌లు అందకపోతే కళాశాలలు మూసివేస్తామని యాజమాన్యాలు హెచ్చరించడాన్ని గవర్నర్ తప్పుపట్టారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలైన కేసీఆర్, చంద్రబాబులు మిషన్, విజన్, లీడర్షిప్ ఉన్న వ్యక్తులని కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ 2020 నాటికి యువత అధిక శాతం ఉండే దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, వైస్ చాన్సలర్ ఆర్వీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.