బోస్‌కు నో చాన్స్ !
* బోసన్నకు బ్రదర్ ఎఫెక్ట్! పలమనేరులో సైకిల్ కూలడం ఖాయం
* సుభాష్ సోదరునిపై గతంలో నమోదైన కేసు ఎఫెక్ట్
* సూపర్‌బజార్ విషయంలోనూ విమర్శలే
* సమైక్య ముసుగులో బాగా దోచేశారు
* దేశం, బీజేపీ పొత్తుతో మైనారిటీలు మరింత దూరం
* ఆయన గెలిస్తే ఆర్టీసీ బస్టాండు హుళక్కేనని ప్రచారం
తిరుపతి, సాక్షి: పలమనేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్వీ సుబాష్చంద్రబోస్కు ఎదురుగాలి వీస్తోంది. ఈ శాసనసభ ఎన్నికల్లో సైకిల్ కూలడం ఖాయమని తెలుస్తోంది. రాష్ట్రం ముక్కలవడానికి ప్రధాన కారణమైన తెలుగుదేశం పార్టీని స్థానికులు విశ్వసించడం లేదు. దానికి తోడు ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆర్వీ సుభాష్ చంద్రబోస్ కుటుంబంపై మైనారిటీలు గుర్రుగా ఉండడం, ఇదే క్రమంలో టీడీపీ మతతత్వ బీజేపీతో చేతులు కలపడం ఆ పార్టీ ఓటమిని ఖాయం చేస్తోంది. మరీ ముఖ్యంగా బోస్ సోదరుడు బాలాజీ ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఫ్యాను గాలి జోరుగా వీస్తుండడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి అమరనాథ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శిరోభారంగా సోదరుని కేసు...
పలమనేరు టీడీపీ అభ్యర్థి సుభాష్ చంద్రబోస్ సోదరుడు ఆర్వీ బాలాజీపై పలమనేరు పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన ఓ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మత విశ్వాసాలను దెబ్బతీసేలా రెచ్చగొట్టేందుకు దోహదం చేసిన ఘటనకు సంబంధించి మైనారిటీలు వీరిపై గుర్రుగా ఉన్నారు. అప్పట్లో దుమారం రేపిన ఈ కేసు కారణంగానే బాలాజీకి రావాల్సిన టీడీపీ టికెట్ బోస్‌కు దక్కిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సూపర్‌బజార్ విషయంలోనూ విమర్శలే...
బోస్ అధ్యక్షుడుగా కొనసాగుతున్న బాలాజీ కో ఆపరేటివ్ సూపర్బజార్లోనూ పలు అవకవతకలున్నాయనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక్కడ పనిచేసే ఉద్యోగులను పర్మినెంట్ చేయకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేవలం ఒక రూపాయి మాత్రమే గౌరవవేతనంగా పొందుతున్న సొసైటీ అధ్యక్షుడు తొలి నుంచి ఆయనే ఆ పదవిలో కొనసాగుతుండటం విమర్శలకు దారితీస్తోంది. ఈ సొసైటీలో ఎటువంటి అక్రమాలు జరిగినా బయటకు పొక్కడం లేదు. దాంతోపాటు ప్రతి ఎన్నికల్లోనూ వీరి ప్యానెల్ గెలవడానికి సొసైటీలోని షేర్ హోల్డర్లకు గతంలో వీరే డిపాజిట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం కూడా ఈ ఎన్నికలపై కనిపిస్తోంది.
సమైక్య ముసుగులో బాగా సంపాయించుకున్నారు
రాష్ర్టం ముక్కలు కావడాన్ని నిరసిస్తూ పట్టణంలో 207 రోజుల పాటు సమైక్య ఉద్యమం జోరుగా సాగింది. చాలా సార్లు బంద్‌లు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నేతలుగా ఈ అన్నదమ్ములు పాల్గొన్నారు. కానీ ఒక్కరోజు కూడా వీరి నిర్వహణలోని ప్రైవేటు ట్రావెల్ బస్సులు మాత్రం ఆగనేలేదు. పది రూపాయల చార్జీకి ఇరవై రూపాయలు వసూలు చేశారనే విమర్శలున్నాయి. ఉద్యమం ముసుగులో ఇలా సంపాదించుకోవచ్చా ? అంటూ అప్పట్లో తీవ్రమైన విమర్శలొచ్చాయి.
అన్నను సామాన్యులు కలవడం కష్టమే...
ఏదేనీ సమస్యను చెప్పుకోవాలంటే దేశం అభ్యర్థి బోస్‌ను కలవడం అంత సులభం కాదనే విషయం పట్టణవాసులకు తెలిసిందే. ఆయన కార్యాలయం వద్ద ఇద్దరు, ముగ్గురు అనుమతులు తీసుకుంటే గానీ లోనికెళ్లలేని పరిస్థితి. అక్కడికెళ్లినా ఆయన మూడ్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో సామాన్యులు వారి కష్టాలను చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందనే విషయూన్ని పట్టణవాసులు చర్చించుకుంటున్నారు.
బీజేపీ పొత్తుతో మైనారిటీలు మరింత దూరం...
బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం స్థానికంగా ఆ పార్టీకి మైనారిటీలను మరింత దూరం చేసింది. పలమనేరు నియోజకవర్గంలో సుమారు 27 వేల మంది మైనారిటీలున్నారు. వీరిలో పలమనేరులోనే 15వేల మంది దాకా ఉన్నారు. వీరంతా ఆ పార్టీకి దూరమై వైఎస్ఆర్ సీపీని ఆదరిస్తున్నారు. దీంతో ఆ పార్టీ గెలుపు ఏ మాత్రం సాధ్యంకాని పరిస్థితి నెలకొంది.
దేశంలోని రెడ్లలో అసంతృప్తి...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీలోని సీనియర్ నాయకులు బెరైడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లోలోపల బోస్పై అంసతృప్తితో ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలో 28వేల మంది రెడ్డి సామాజిక వర్గం ఓటర్లున్నారు. ఇక్కడ వీరికి టికెట్ ఇవ్వకుండా కేవలం 4వేలు ఓట్లున్న వైశ్య సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంపై దేశంలోని రెడ్లు లోలోన ఆగ్రహంతో ఉన్నారు.
దేశం నుంచి భారీగా వలసలు...
నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మూడు సార్లు మంత్రి పదవిని అలంకరించిన డాక్టర్ పట్నం సుబ్బయ్య ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఈయన బాటలోనే మాజీ ఎంపీపీలు రాజేంద్రన్, లక్ష్మణ మూర్తి పార్టీని వీడారు. వి.కోట, గంగవరం మండలాల్లోనూ ఆ పార్టీకి చెందిన పలువురు వైఎస్ఆర్ సీపీలో చేరారు.