ఇరు రాష్ట్రాల సీఎంలతో జనవరిలో ప్రధాని భేటీ ?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలతో ఆయన సమావేశం కానున్నట్టు తెలిసింది. జనవరి 5న లేదా తరువాత ఒకటి రెండు రోజుల్లో ఈ సమావేశం ఉండొచ్చు. దీనిపై సీఎంలకు సమాచారం అందిందని తెలిసింది.
విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల రద్దు, శ్రీశైలం జలాలు తెలంగాణ వాడుకోవడంపై వివాదం, నిధుల వినియోగంతో పాటు ఇతరత్రా పలు వివాదాల పరిష్కారానికి ఈ సమావేశం దోహదపడే అవకాశం ఉంది. కాగా, సమస్యల పరిష్కారానికి ఇప్పటికే గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇద్దరు సీఎంలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని భేటీ విషయంపై శనివారం తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారిని విలేకరుల సమావేశంలో ప్రశ్నించగా.. అలాంటి సమాచారమేదీ తమకు అందలేదని, కేసీఆర్ వచ్చే నెల ఢిల్లీ వస్తున్నారని చెప్పారు.