కాషాయ కూటమికి ఢోకా లేదు
సామ్నాలో ఉద్ధవ్ ఠాక్రే
సాక్షి , ముంబై: హిందూత్వ నేపథ్యంలో శివసేన-బీజేపీ కూటమికి చీలిక భయంలేదని, అది కొనసాగుతుందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లో సోమవారం ప్రచురితమైన సంపాదకీయంలో తనదైన శైలిలో ప్రత్యర్థులపై మండిపడుతూనే మరోవైపు బీజేపీతో పొత్తుపై ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టంచేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత శివసేన, బీజేపీల మధ్య ఆధిపత్యంపై మాటల పోరు కొనసాగుతోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వికటి స్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శివసేన సామ్నా పత్రిక సంపాదకీయం ద్వారా శివసేన బీజేపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేయడంతో అనేక మందిలో నెలకొన్న అయోమయానికి తెరపడింది.
బీహార్లో హిందూవాదం సిద్ధాంతాల ముడి లేకపోవడంతో అక్కడ పొత్తు వికటించింది కాని మహారాష్ట్రలో ఇద్దరి మధ్య హిందూత్వవాదంపై ఉన్న ముడి చాలా గట్టిదని ఇది విడిపోయే ప్రసక్తేలేదని ఉద్ధవ్ పేర్కొన్నారు. శివసేనతోపాటు బీజేపీకి కూడా ఈ విషయం తెలుసన్నారు. అయితే హిందూవాదులకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసేవారికి ప్రజలు బుద్ధి చెబుతారని ఉద్ధవ్ ఠాక్రే ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరించారు.