ప్రియుడిచే ప్రియురాలి మృతదేహం వెలికితీత
►అనుమానంతోనే హత్య చేశానన్న ప్రియుడు
► నిందితుడితోనే మృతదేహాన్ని
వెలికి తీయించిన పోలీసులు
తిరుపతి: ప్రియుడి చేతిలో హత్యకు గురైన ప్రియురాలి మృతదేహాన్ని ప్రేమికుల రోజైన ఆదివారం వెలికి తీశారు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె సొంత ఊరైన వాల్మీకిపురం మండలం పునుగుపల్లెలో విషాదం అలుముకుంది.
తిరుపతి వెస్ట్ సీఐ అంజుయాదవ్ కథనం మేరకు గుర్రంకొండ వుండలం టి.రాచపల్లె పంచాయతీ గంగిరెడ్డిగారిపల్లెకు చెందిన వేమ నారాయణరెడ్డి(30) ఎంసీఏ చదివాడు. వీరికి తరిగొండలో మరో ఇల్లు ఉంది. అతని తండ్రి గంగిరెడ్డిగారిపల్లెలో తండ్రి ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి సుశీలమ్మ కుమారుడితో తరిగొండలో ఉంటోంది. ఇతను వాల్మీకిపురంలో నెట్ సెంటర్ నిర్వహిస్తూ స్థానిక డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. 2009లో వాల్మీకిపురం వుండలం పునుగుపల్లెకు చెందిన షేక్ సబీహా(23)తో ఏర్పడిన పరిచయుం ప్రేమగా మారింది.
అన్నీ తానై..
సబీహాకు సంబంధించిన అన్ని విషయాలూ వేమనారాయణరెడ్డే చూసుకునేవాడు. చదువుకు ఫీజులు కట్టడం నుంచి అన్నీ తానే చేశాడు. గత ఏడాది నెట్ పరీక్షకు కూడా దరఖాస్తు చేయించాడు. ఆమెకు తిరుపతిలోని ఒక వాహనాల షోరూంలో ఉద్యోగం ఇప్పించా డు. అక్కడే ఓ ఇంట్లో ఉంచి తరచూ వెళ్లి వచ్చేవాడు.
అనుమానంతో గొడవలు.. ఆపై హత్య
ఈ క్రమంలో సబీహాకు అక్కడే పనిచేసే మనోజ్కువూర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అంతేగాక నెల క్రితం ఇద్దరూ షిరిడీ వెళ్లారు. ఈ విషయమై వేమనారాయణరెడ్డి, సబీహా గొడవ పడ్డారు. అతనితో మాట్లాడడం తనకు నచ్చడం లేదని, తిరుపతి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని వేమనారాయణరెడ్డి పేర్కొన్నాడు. ఆమె అంగీకరించకపోవడంతో గత నెల 29 తేదీ రాత్రి తిరుపతిలో వారు ఉంటున్న ఇంట్లోనే టవల్‌తో సబీహా గొంతు బిగించి చంపేశాడు. మృతదేహాన్ని లగేజి బ్యాగులో భద్రపరిచాడు. సబీహా వెళ్లిపోయిందని చుట్టుపక్కల వారిని నమ్మించి ఇంట్లోని వస్తువులను ఆటోలో వేసుకుని తరిగొండలోని సొంత ఇంటికి చేరుకొన్నాడు. మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి పెరట్లో మరుగుదొడ్డికి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు.
తల్లి ఫిర్యాదుతో హత్యోదంతం వెలుగులోకి..
సబీహా కనిపించకపోవడంతో ఆమె తల్లి జిలాని ఈ నెల 9న తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సీఐ అంజూయాదవ్ విచారణ చేపట్టి శనివారం వేమనారాయణరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను జరిగిన విషయుం చెప్పడంతో ఆదివారం పోలీసులు తరిగొండలోని తన ఇంటిలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీయించారు. సున్నితమైన అంశం కావడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్టీఎఫ్ బలగాలతో బందోబస్తు నిర్వహించారు. తహశీల్దార్ ధర్మయ్య సమక్షంలో సబీహా మృతదేహానికి వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
నమ్మించి నా బిడ్డను కడతేర్చాడు
‘ప్రేమించానని మాయ మాటలు చెప్పి చివరకు నా బిడ్డను వేమనారాయణరెడ్డి హతమార్చాడు’ అని సబీహా తల్లి జిలాని వాపోయింది. భర్త చనిపోయినప్పటి నుంచి కూలి పనులు చేసి బిడ్డను చదివించానని, కుటుంబానికి ఆసరాగా ఉం టుందనుకుంటే కడతేరిందని కన్నీరుమున్నీరైంది. తన బిడ్డకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకుం డా నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరింది. వాల్మీకిపురం మండలం పునుగుపల్లెలో ఆదివారం సాయంత్రం సబీహా అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.