sabithareddy
-
త్వరలో 900కు పైగా ఐసీయూ పడకలు
గచ్చిబౌలి: రాష్ట్రంలో 900కు పైగా ఐసీయూ పడకలు త్వరలో అందుబాటులోకి వస్తాయని, ఇందుకోసం రూ.154 కోట్లు ఖర్చు చేయనున్నామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 27 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా సమయంలో హైదరాబాద్‌లో 1,300 పడకలను వివిధ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సర్కారు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. పిల్లల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 6 వేల పడకలతో పీడియాట్రిక్ విభాగాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రహేజా మైండ్ స్పేస్ ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో 120 బెడ్లతో ఏర్పాటు చేసిన కొత్త ఫ్లోర్‌ను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కొండాపూర్ ఆస్పత్రిలో డయాలిసిస్ యూనిట్ కేసీఆర్ కిట్ల పంపిణీని ప్రారంభించాక ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీల శాతం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం 52 శాతం డెలివరీలు సర్కారు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలిసిస్ యూనిట్లు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలోనూ త్వరలో డయాలిసిస్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో బెడ్ల ఏర్పాటుకు సహకరించిన మైండ్ స్పేస్ సీఈవోను అభినందించారు. ఆస్పత్రి మెయింటెనెన్స్‌ను కూడా మైండ్ స్పేస్ తీసుకోవాలని కోరారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల డిమాండ్ ఉన్నప్పుడు రహేజా ముందుకొచ్చిందని గుర్తు చేశారు. 100% వ్యాక్సినేషన్‌కు సహకరించాలి రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలంటే అందరూ భాగస్వాములు కావాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా నగరంలో కార్పొరేటర్లు తమ పరిధిలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ అందేలా చూడాలన్నారు. రెండు, మూడు సార్లు ఇళ్లకు వెళ్లి ఆరా తీయాలని సూచించారు. రాష్ట్రంలో రోజూ సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
గులాబీ గూటికి సబిత
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్ ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. తన ముగ్గురు కుమారులతో కలసి సబితారెడ్డి బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ భవిష్యత్తుపై కేసీఆర్ వీరితో చర్చించారు. చేవెళ్లలో త్వరలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీఆర్ఎస్లో చేరుతామని సబితారెడ్డి సీఎంతో చెప్పారు. చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో విజయం దిశగా పని చేయాలని సూచించారు. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా సామాజిక, ఇతర సమీకరణలను బట్టి కార్తీక్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్‌తో ప్రత్యేక అనుబంధం ఉన్న సబితారెడ్డి ఆ పార్టీలో కొనసాగేలా చేయడంలో ఆ పార్టీ కీలక నేతల ప్రయత్నాలు సఫలం కాలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డప్పటి నుంచి సబితారెడ్డి టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్లతో సబితారెడ్డి, కార్తీక్‌రెడ్డి నాలుగు రోజుల కింద భేటీ అయ్యారు. అడగాల్సినవి అడిగాం: పి.కార్తీక్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాం. మేం అడగాల్సినవి అడిగాం. ఆయన చెప్పాల్సినవి చెప్పారు. చేవెళ్లలో జరగనున్న భారీ బహిరంగసభలో టీఆర్ఎస్లో చేరుతాం. పరస్పర మార్పు.. 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానంలో కార్తీక్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరారు. తాజాగా కార్తీక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో చేవెళ్లలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రత్యర్థులు పరస్పరం పార్టీలు మారినట్లయింది. -
నాలా వ్యవస్థ సరిగ్గా లేక ముంపు
అల్వాల్: వరద సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అల్వాల్‌లో శనివారం మాజీ మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి నందికంటి శ్రీధర్‌తో కలిసి ముంపు బాధితులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ శ్రేణులందరూ సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చామన్నారు. అల్వాల్‌లో ఉన్న చెరువులకు అనుగుణంగా నాలా వ్యవస్థ లేకపోవడం వల్లే ముంపు సమస్య నెలకొందని ఇందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ముంపునకు గురైన వారందరికీ అవసరమగు సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతం చేయాలని కోరారు. భూదేవినగర్ గుడిసెవాసులతో మాట్లాడి అన్నదానంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్‌కుమార్ యాదవ్, నాయకులు సాయిజెన్ శేఖర్, డోలి రమేష్, గీతారాణి తదితరులు పాల్గొన్నారు.