సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్ ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. తన ముగ్గురు కుమారులతో కలసి సబితారెడ్డి బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ భవిష్యత్తుపై కేసీఆర్ వీరితో చర్చించారు. చేవెళ్లలో త్వరలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌లో చేరుతామని సబితారెడ్డి సీఎంతో చెప్పారు.
చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో విజయం దిశగా పని చేయాలని సూచించారు. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా సామాజిక, ఇతర సమీకరణలను బట్టి కార్తీక్‌రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్‌తో ప్రత్యేక అనుబంధం ఉన్న సబితారెడ్డి ఆ పార్టీలో కొనసాగేలా చేయడంలో ఆ పార్టీ కీలక నేతల ప్రయత్నాలు సఫలం కాలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డప్పటి నుంచి సబితారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌లతో సబితారెడ్డి, కార్తీక్‌రెడ్డి నాలుగు రోజుల కింద భేటీ అయ్యారు.
అడగాల్సినవి అడిగాం: పి.కార్తీక్‌రెడ్డి
సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాం. మేం అడగాల్సినవి అడిగాం. ఆయన చెప్పాల్సినవి చెప్పారు. చేవెళ్లలో జరగనున్న భారీ బహిరంగసభలో టీఆర్‌ఎస్‌లో చేరుతాం.
పరస్పర మార్పు..
2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానంలో కార్తీక్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా కార్తీక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. దీంతో చేవెళ్లలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రత్యర్థులు పరస్పరం పార్టీలు మారినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment