ప్రేమ రంగు పులుముకున్న రెండు జీవితాలు
సచిన్ కుందల్కర్ రాసిన ‘కోబాల్ట్ బ్లూ’ నవలలో– పూణేలో ఉండే జోషీల మధ్య తరగతి కుటుంబం– పేరుండని ఆర్టిస్ట్ అయిన ‘అతడి’కి పేయింగ్ గెస్టుగా తమింట్లో చోటిస్తుంది. అతనికి భవిష్యత్తంటే పట్టింపుండదు. స్నేహితులుండరు. తన కుటుంబం/గతం గురించి మాట్లాడడు. కోబాల్ట్ నీలం రంగంటే ఇష్టం. శ్రీమతి జోషీ మాటలు వింటూ, ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. ఆమె పిల్లల్లో, కాలేజీలో చదువుకునే తనయ్కి స్వలింగ సంపర్క ధోరణి ఉంటుంది. అనూజా సాంప్రదాయాలని నమ్మని స్కూలు పిల్ల. తనయ్ అతని గదికి తరచూ వెళ్ళడం పట్ల కుటుంబానికి ఏ అభ్యంతరం ఉండదు కానీ కూతురు మాత్రం మగ పేయింగ్ గెస్టుకు దూరంగా ఉండాలనుకుంటారు తల్లిదండ్రులు. ‘అతను’ అన్నాచెల్లెళ్ళనిద్దరినీ ఆకర్షించి, ఇద్దరితోనూ లైంగిక సంబంధం పెట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు అతనితో ప్రేమలో పడతారు.
‘నేను గడిపే సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం ఎంత సామాన్యమైనదో తెలుసుకున్నాను’ అంటాడు తనయ్ అతణ్ని కలుసుకున్న తరువాత.అనూజా పేయింగ్ గెస్టుతో ఆర్నెల్లపాటు పారిపోతుంది. వెనక్కొచ్చాక, ఒకరోజు అతను చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతాడు. పుస్తకపు మొదటి భాగానికి కథకుడు తనయ్. పేయింగ్ గెస్టుని సంబోధిస్తూ తన భావాలని వ్యక్తపరుస్తూ, చెల్లెలితో అతను పెట్టుకున్న సంబంధం పట్ల ఆశ్చర్యం, వేదనా వ్యక్తపరుస్తాడు. రెండవ భాగం అనూజా తన దృష్టికోణంతో అతని గురించి డైరీలో రాసుకున్నది. ఈ జ్ఞాపకాలతో కుటుంబ సభ్యులందరూ ఎలా రాజీపడ్డారన్నదే కథ. అనూజాని తల్లీదండ్రీ సైకియాట్రిస్ట్ వద్దకి తీసుకెళ్ళిన తరువాత, తన పరిస్థితితో రాజీ పడ్డం నేర్చుకుని, చెప్తుంది:
‘అతని గురించి నాకున్న మంచి జ్ఞాపకాలన్నీ అతనితోపాటు పారిపోక ముందటివే. మేము కలిసి గడిపిన సమయం ఎక్కడికి పోయిందో!... ఇంక అతని గురించి ఏడవాలని లేదు గానీ, ‘‘ఎందుకిలా చేశావు!’’ అని మాత్రం ఒకసారి అడగాలనుంది.’ తన ప్రేమికుడితో పారిపోయిన చెల్లెల్ని రోజూ ఎదుర్కోవాల్సిన ఇబ్బంది ఏర్పడినప్పుడు, తనయ్ ముడుచుకు పోయి తన బాధలో ఒంటరివాడవుతాడు. తల్లికీ తండ్రికీ కొడుకు పెట్టుకున్న సంబంధం తెలుసో లేక తెలియనట్టు నటిస్తారో నవల స్పష్టంగా చెప్పదు. ఒకే ఒక వాక్యంలో ఉన్న అస్పష్టమైన సూచన తప్ప. అనూజాకి– అన్నకి అతనితో ఉన్న సంబంధం గురించిన ఎరుక ఉందో లేదో అన్న వివరాలు కూడా ఉండవు.
అనూజా గతాన్ని వెనక్కి నెట్టి, ఉద్యోగం వెతుక్కుని తనదైన లోకం సృష్టించుకోగలిగి విముక్తురాలవుతుంది. తనయ్ ముంబై వెళ్ళిపోతాడు. నవలకి ఒక నిర్దిష్టమైన ముగింపేదీ లేదు. ఎన్నో విషయాలు సమాధానం లేకుండానే మిగిలిపోతాయి. 2006లో పబ్లిష్ అయిన మరాఠీ నవల ఇదే పేరుతో వచ్చింది. తర్వాత సినిమా దర్శకుడిగా మారిన కుందల్కర్ ఈ నవల రాసినప్పటికి అతని వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. కవీ, రచయితా, జర్నలిస్టూ అయిన జెరీ పింటో దీన్ని 2013లో ఇంగ్లిష్‌లోకి అనువదించారు. అయితే, అది అనువాదం అనిపించదు. ‘పుస్తకంలో ఉన్న కొన్ని భాగాలకి ఇంగ్లిష్ ప్రత్యామ్నాయాలని వెతికే ప్రయత్నాన్ని విడిచిపెట్టవలిసి వచ్చింది. కొన్ని సంగతులని విడమరిచి చెప్పలేమంతే’ అని అనువాదకుని నోట్లో రాసిన మాటలు వెంటాడతాయి. పేయింగ్ గెస్ట్, అన్నాచెల్లెళ్ళిద్దరికీ ప్రేమికుడవడం అన్నది ఇండియన్ సాహిత్యంలో అరుదైన టాపిక్కే. అంతకన్నా ముఖ్యమైనది ఒకే కథని రెండు కంఠాలతో, రెండు దృష్టికోణాలతో నడిపిన అరుదైన ప్రయోగం.
u కృష్ణ వేణి