Sacrifice Girl
-
జోథ్‌పూర్‌లో ఘోరాతిఘోరం
సాక్షి, రాజస్తాన్: మూఢ నమ్మకాలతో మనుషుల్లో ఉన్నమతిపోతుంది. రంజాన్ మాసంలో కూతురిని బలిస్తే, తనకు కుమారుడు పుట్టేందుకు అల్లా తనను కరుణిస్తాడని భావించి ఓ వ్యక్తి తన కూతురిని ఘోరాతిఘోరంగా చంపాడు. కసాయివాడు జంతువు గొంతు కోసినట్లు కూతురి గొంతు కోసి చంపాడు. ఈ దారుణమైన సంఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో శుక్రవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జోథ్‌పూర్ నగరంలో నవాబ్ అలీ ఖురేషీ, ఆయన భార్య, కూతురు రిజ్వానాలు, అలీ భార్య తరపు బంధువుల ఇంట్లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. నవాబ్ అలీ పై అంతస్తులో ఉంటుండగా..భార్య తరపు బంధువులు కింద పోర్షన్లో ఉంటున్నారు. నవాబ్ అలీ ఖురేషీకి నాలుగేళ్ల రిజ్వాన్ అనే కూతురు ఉంది. శుక్రవారం వేకువజామున రెండున్నర గంటల సమయంలో అలీ తన స్వహస్తాలతో కూతురిని గొంతు కోసి బలి ఇచ్చి, అల్లాకు కానుకగా సమర్పించాడు. అనంతరం తాను ఏమీ ఎరగనట్లు వచ్చి భార్య పక్కన పడుకున్నాడు. కూతురు రిజ్వానా కనపడకపోవడంతో తల్లి కిందకు వెళ్లి చూసింది. రక్తపుమడుగులో పడి ఉండటం చూసి హతాశురాలైంది. అలీ భార్య కేకలు విని బంధువులు బయటకు వచ్చారు. జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 3 గంటలకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆధారాలు సేకరించేందుకు డాగ్ స్క్వాడ్‌ను హుటాహుటిన రప్పించిన పోలీసులు ఇళ్లంతా పరిశీలించారు. కుటుంబసభ్యులందరినీ శుక్రవారం, శనివారం అంతా పోలీసులు విచారించారు. విచారణలో కన్న తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. అల్లా కోసమే కూతురిని బలిచ్చానని విచారణలో నవాబ్ అలీ ఒప్పుకున్నాడు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిపడ్ నగర ఆసుపత్రికి తరలించారు. మూర్ఖపు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. -
క్షుద్రశక్తుల కోసం మేనత్త దారుణం
యమునానగర్ (హరియాణా): తనకు వచ్చిన కలను సాకారం చేసుకునేందుకు ఓ మహిళ దారుణానికి పాల్పడింది. క్షుద్రశక్తులు లభిస్తాయన్న దురాశతో మూడేళ్ల చిన్నారిని బలిచ్చింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషాదం హరియాణాలోని యయునానగర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిందుతురాలికి వివాహమై ఇద్దరు సంతానం ఉన్నారు. భర్తతో కలిసి ఆమె అంబాలాలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల భర్త, పిల్లలతో కలిసి తన పుట్టింటికి వచ్చింది. అయితే ఓ చిన్నారిని బలిదానమిస్తే క్షుద్రశక్తులు వస్తాయని ఎవరో చెబుతున్నట్లుగా ఆమెకు తరచుగా కలలు వస్తుండేవి. నిజంగానే చిన్నారిని బలిస్తే తన కల సాకారం అవుతుందని భావించిన నిందితురాలు తన సోదరుడి మూడేళ్ల కూతుర్ని బలివ్వాలనుకుంది. ఆదివారం చిన్నారి తన అత్తవద్దకు రాగా, గదిలోకి తీసుకెళ్లి పూజలు చేసింది. అనంతరం ఓ కత్తితో గొంతుకోసి చిన్నారిని ఆ మహిళ బలిచ్చింది. బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు పాపను రక్షించేందుకు రాగా, వారి నుంచి తప్పించుకుని వెళ్లేందుకు నిందితురాలు యత్నించింది. ఆమెను పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. రక్తస్రావం కావడంతో అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు జగధ్రి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ నవీన్ వివరించారు. -
నరబలి కేసులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చిలుకానగర్ నరబలి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నరబలికి ముందు రోజు క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్, ఆయన భార్య శ్రీలత, రాజశేఖర్ అత్త చేర్యాల నరసింహస్వామి గుడిలో నిద్ర చేసినట్లు తెలుస్తోంది. అలాగే నరబలికి సలహా ఇచ్చిన పూజారితో రాజశేఖర్ గత ఆరు నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. నరబలి సమయంలో భార్య భర్తలు ఇద్దరు ఉన్నారని...బలి ఇచ్చిన అనంతరం చిన్నారి మొండాన్నినాచారం లక్ష్మి ఇండస్ట్రీ లోపల పడేసినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ 30 మంది విచారణ చేశారు. వారిలో ఇరవై మంది రాజశేఖర్ కుటుంబసభ్యులు కాగా, మరో పదిమంది పూజారులు ఉన్నారు. ఇక బలి ఇచ్చిన చిన్నారిని వరంగల్ జిల్లా భీమ్ దేవేరుపల్లి మండల్ హామ్లెట్ తండా నుంచి రాజశేఖర్ కొనుకొచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. అయితే పోలీసులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. రాజశేఖర్ నోరు విప్పితేనే... మరోవైపు నరబలి కేసులో రాజశేఖర్ నోరు విప్పితేనేగానీ మిస్టరీ వీడేలా లేదు. కేసు అతని చుట్టూనే తిరుగుతోంది. భార్య శ్రీలత ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే చంద్ర గ్రహణం రోజు పసికందును బలి ఇచ్చి ఉంటాడని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా అసలు విషయం చెబితే మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుందనే అతడు నోరు విప్పడం లేదని తెలుస్తోంది. -
దారుణం: భార్య ఆరోగ్యం కోసమే నరబలి!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ చిలుకానగర్‌లో కలకలం రేపిన చిన్నారి నరబలి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇంటి యజమాని క్యాబ్ డ్రైవర్ రాజశేఖరే ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. భార్య శ్రీలత ఆరోగ్యం మెరుగ పడటం కోసమే ఓ పాపను తీసుకొచ్చి బలిచ్చినట్లు సమాచారం. కరీంనగర్‌లోని ఓ తండా నుండి పాపను తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు రాజశేఖర్ వెల్లడించాడు. పూర్తి విచారణ అనంతరం అరెస్టయిన అయిదుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ డివిజన్ లో నివసించే రాజశేఖర్ (35) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గత గురువారం ఉదయం ఆయన అత్త బాలలక్ష్మి ఉతికిన బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లగా ఓ చిన్నారి తల కనబడటంతో వచ్చి కుటుంబీకులకు చెప్పారు. డాబాపైకి వెళ్లి చూసిన రాజశేఖర్ ఉప్పల్ పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజశేఖర్ చెబుతున్న విషయాలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా నరబలి విషయం బయటపడింది. స్థానికంగా ఉంటున్న మెకానిక్ నరహరి ఇంటిలో క్షద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో రాజశేఖర్‌తో పాటు నరహరి, అతని కుమారుడు రంజిత్, పూజారి, పాపను విక్రయించిన బ్రోకర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజశేఖర్ భార్య శ్రీలత ఆరోగ్యం మెరుగు పడేందుకు గ్రహణ సమయంలో పూజలు చేసి చిన్నారిని బలిచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి తల దొరికినా.. మృతదేహం (మొండెం) మాత్రం ఇంకా లభించలేదు. -
జార్ఖండ్‌లో చిన్నారి నరబలి
జంషెడ్పూర్: సంతానం కోసం మంత్రగాడి మాటలు విని ఏడు నెలల చిన్నారిని నరబలి ఇచ్చాడో వ్యక్తి. జార్ఖండ్‌లోని సెరైకేలా–ఖర్స్వాన్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బదోయ్ కాళింది అనే వ్యక్తి పాములు ఆడిస్తూ జీవిస్తున్నాడు. సంతానం లేకపోవడంతో తాంత్రికుడైన కర్మూను ఆశ్రయించాడు. పిల్లలు పుట్టాలంటే నరబలి ఇవ్వాలని కర్మూ చెప్పాడు. మే 26 రాత్రి కర్మూ... బదోయ్తో కలసి తన ఇంటి దగ్గర్లో నివసించే సుభాష్ గోపే ఏడు నెలల కుమార్తె నిద్రిస్తుండగా అపహరించారు. తిరుల్దీ గ్రామ సమీపంలోని నదీతీరంలో నరబలి ఇచ్చారు. తర్వాత కర్మూ కనిపించకుండా పోవడంతో బాలిక అపహరణలో అతని పాత్ర ఉందని అనుమానించిన పోలీసులు గాలింపు జరిపి కర్మూ, భదోయ్లను అరెస్ట్ చేశారు. గురువారం వారిద్దరూ నేరాన్ని అంగీకరించారు. భదోయ్ నివాసం నుంచి నరబలికి ఉపయోగించిన ఆయుధాన్ని సీజ్ చేశారు. బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.