మాజీ ఎంపీ సదాశివరామ్ అస్తమయం
సాక్షి, ముంబై: మాజీ పార్లమెంట్ సభ్యుడు సదాశివరావ్ మండలిక్ (80) సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాదపడుతున్న శివరావ్ బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోల్హపూర్ జిల్లా రాజకీయాలో బలమైన నాయకునిగా గుర్తింపు పొందిన ఆయన 1934లో కోల్హపూర్ జిల్లా కాగల్ తాలూకా మురగడ్ గ్రామంలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన తక్కువ సమయంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. మూడు సార్లు కోల్హపూర్ లోక్సభ సభ్యునిగా, కాగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2009లో విభేదాల కారణంగా ఎన్సీపీలో తిరుగుబాటు చే సి స్వతంత్రంగా పోటీచేసి విజయ దుందుభి మోగించారు. ప్రజల సమస్యల కోసం నిత్యం ముందుండే ఆయనకు జిల్లా రాజకీయాల్లో గొప్ప నాయకుడిగా గుర్తింపు లభించింది. జిల్లాలో ఆయన చేసిన అభివృద్ధి పనులకు గానూ ఆయనకు మంచి పేరుంది. ప్రస్తుతం ఆయన కుమారుడు సంజయ్ మండలిక్ శివసేన పార్టీలో కొనసాగుతున్నారు. సదాశివరావ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన కోల్హపూర్ జిల్లాలోని మురగడ్ గ్రామంలో నిర్వహించారు.
పశ్చిమ మహారాష్ట్ర కీలక యకున్ని కోల్పోయింది: ముఖ్యమంత్రి
సదాశివరావ్ మరణంతో రాజకీయాల్లో పూడ్చలేని లోటు ఏర్పడిందని, పశ్చిమ మహారాష్ట్ర కీలక నాయకున్ని కోల్పోయిందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. చెరకు రైతుల సమస్యలపై తనదైన శైలిలో పోరాడి అందరికి న్యాయం చేసేందుకు ప్రయత్నించారన్నారు. రాజకీయాలతో పాటు వివిధ రంగాల్లో ఆయన చేసిన కృషి మర్చిపోలేనిదన్నారు.