తిరుపతి: ముగిసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
Updates
►తిరుపతిలో జరిగిన 29వ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు సమావేశంలో తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించిన సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ..
► రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలి. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి.
► విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదు.
► సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం.
► పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే
► రీసోర్స్ గ్యాప్‌నూ భర్తీచేయలేదు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు
► తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించండి
► తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వండి
► రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదు
► గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి
► రాష్ట్రాల్లో రేషన్ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదు. వెంటనే సరవణలు చేయాలి.
► ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం జగన్ లాంఛనంగా సమావేశాన్ని ప్రారంభించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన తిరుపతి ఎమ్మెల్యే భూమన
►ఈ సమావేశానికి కర్ణాటక సీఎం బొమ్మై, తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన అతిథులను సీఎం జగన్ సత్కరించారు.
► కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం) ప్రారంభమైంది.
సౌత్‌జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైనవారు..
► అమిత్ షా (సౌత్‌జోనల్ కౌన్సిల్ ఛైర్మన్, కేంద్ర హోంమంత్రి)
► వైఎస్ జగన్మోహన్రెడ్డి (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, సౌత్‌జోనల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్)
► బస్వరాజు బొమ్మై (కర్ణాటక ముఖ్యమంత్రి)
► రంగస్వామి (పుదుచ్చేరి ముఖ్యమంత్రి)
► తమిళసై సౌందర్‌రాజన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్
► డీకే జోషి (అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్)
► ప్రఫుల్ పటేల్ (లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్)
► తెలంగాణ, తమిళనాడు, కేరళల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
► తాజ్ హోటల్‌కు చేరుకున్న సీఎం జగన్.
► సీఎం జగన్ మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో సీఎం జగన్‌కు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం జగన్ తాజ్ హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ఆయన స్వాగత ఉపన్యాసం ఇవ్వనున్నారు.
► మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి తాజ్ హోటల్‌కు బయలుదేరిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.
► మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతం రేణిగుంట విమానాశ్రయం నుంచి తాజ్ హోటల్‌కు బయలుదేరిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.
► భారీ వర్షాలు, బాధితులను ఆదుకునేందుకు స్వయంగా సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ పనుల్లో నిమగ్నమై ఉన్నందున సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకాలేకపోతున్నానని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు.
► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తిరుపతికి బయలుదేరారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 వరకు సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్లో సీఎం జగన్ స్వాగత ఉపన్యాసం ఇవ్వనున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో ఉన్న సమస్యలను ప్రస్తావించనున్నారు.
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వంతో పాటు పొరుగు రాష్ట్రాల వద్ద అపరిష్కృతంగా ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాల్సిందిగా ఆదివారం తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 3వ తేదీన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో ఆరుకు పైగా అంశాలను ప్రస్తావించేందుకు అజెండా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, వివిధ పెండింగ్ సమస్యలను ప్రస్తావించి త్వరగా పరిష్కరించాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్రవిభజన చట్టంలోని హమీలతో పాటు అపరిష్కృత అంశాలను, పెండింగ్ బకాయిలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో రాష్ట్రానికి మేలు చేకూరేలా ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్–నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ హాజరు కానున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు శ్రీవారి ప్రసాదం అందజేస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అర్చకులు
చక్కటి సంబంధాలే లక్ష్యం
► రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం, కేంద్రం –రాష్ట్రాల మధ్య చక్కటి సంబంధాలను నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా జోనల్ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేశారు.
► భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత.. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం–1956 ప్రకారం ఐదు జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలతో ఏర్పడ్డ కౌన్సిల్ ఐదోది. ఆ తర్వాత 1972లో రాష్ట్రాల రీ ఆర్గనైజేషన్ కింద ఆరవది నార్త్ ఈస్ట్ జోనల్ ఏర్పాటైంది.
► మొట్టమొదటి సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశం 1957 జులై 11న మద్రాసులో నిర్వహించారు. మొత్తంగా ఇప్పటి వరకూ 28 సార్లు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండళ్ల సమావేశాలు జరిగాయి. చివరగా 2018 సెప్టెంబరు 18,న సౌత్ జోనల్ కమిటీ సమావేశం బెంగళూరులో జరిగింది.
► ఈ సమావేశాలకు కేంద్ర హోం శాఖ మంత్రి చైర్మన్‌గా, రొటేషన్ పద్ధతిలో ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రులెవరైనా రాలేకపోతే మంత్రులు హాజరవుతారు.
► మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ సమావేశం ఆదివారం తిరుపతిలో జరుగుతోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఆర్థిక, సామాజిక పరమైన అంశాలు చర్చిస్తారు. ఈ అంశాల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తారు. రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలు, సరిహద్దు వివాదాలు, భాషా పరంగా మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం, అంతర్ రాష్ట్ర రవాణా, రాష్ట్రాల పునర్ విభజన చట్టంలో పెండింగ్ అంశాలు.. తదితర విషయాలన్నీ ప్రస్తావనకు వస్తాయి.
ఏపీ ప్రస్తావించనున్న అంశాలు
► తెలుగు గంగకు సంబంధించి తమిళనాడు నుంచి రావాల్సిన బకాయిలు.
► పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు.
► తెలంగాణా నుంచి రావాల్సిన రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిలు.
► రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక ఏడాది ఏర్పడిన రెవిన్యూ లోటు కింద రావాల్సిన నిధులు.
► రేషన్ బియ్యంలో హేతు బద్ధతలేని కేంద్రం కేటాయింపులు.
► తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిల అంశాలు.
► ఎఫ్డి ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలు.
► కేఆర్ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావడం.
►నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల ప్రస్తావన. రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలు.
► ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే.. వాటిపై తగిన రీతిలో స్పందన.
ముస్తాబైన తిరుపతి నగరం
నేడు 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణకు తిరుపతి నగరం ముస్తాబైంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానున్న ఈ సమావేశం కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి సమావేశం జరిగే తాజ్ హోటల్‌తో పాటు వీవీఐపీలు, వీఐపీల బస, వారు పర్యటించే ప్రదేశాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేసింది. సమావేశ ప్రాంగణాన్ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం పరిశీలించారు.
తాజ్ హోటల్లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బాడీవార్న్ కమెరాలతో 24 గంటలూ నిఘా ఉంచాలని ఈ సందర్భంగా ఆదేశించారు. జిల్లా సరిహద్దుల్లో ప్రతి చెక్‌పోస్టులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
మొత్తంగా మూడు వేల మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్‌రెడ్డి, అనంతపురం రేంజ్ ఐజీ క్రాంతి రాణా టాటా, అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు, చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్, టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, ఏఎస్పీ నిషాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, కౌన్సిల్ సమావేశం అనంతరం ప్రముఖులందరూ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లనున్నారు.