
సాక్షి, అమరావతి: తిరుపతిలో వచ్చే నెల 14న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీవులకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులు హాజరవుతారు. ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం తదితరాలపై చర్చిస్తారు.
ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆదేశించారు. జోనల్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై గురువారం సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో వివిధ శాఖల కార్యదర్శులు, టీటీడీ ఈవో, చిత్తూరు కలెక్టర్, ఎస్పీ తదితరులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. ఎలాంటి లోపాలకు ఆస్కారమివ్వకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి చర్చించాల్సిన అంశాలు, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అజెండాపై వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, ఎల్. ప్రేమచంద్రారెడ్డి, అనిల్ సింఘాల్, వి.ఉషారాణి, శ్యామల రావు, పి.బాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.