ప్రభుత్వ ఆస్పత్రిలో ఎండలో క్యూలో నిలబడిన దివ్యాంగులు, వాకర్ సాయంతో శిబిరానికి వస్తూ..
సాక్షి, కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంపు నిర్వహణ తీరుపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపులో దివ్యాంగులు, వృద్ధులు, మానసిక వికలాంగులు నరకం చూశారు. ఎండలో గంటల తరబడి భారీ క్యూలలో నిల్చున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేకపోయారు. కనీసం అక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేరు. ప్రతి నెల మూడు, నాల్గో శుక్రవారాల్లో సదరం క్యాంపు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు కానీ ఇతరులు కానీ ఈ శిబిరానికే వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో జిల్లాలోని పిట్లం, మద్నూర్, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ, నస్రుల్లాబాద్ తదితర దూర ప్రాంతాల నుంచి వచ్చి నానా తంటాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కేవలం ఒకే సదరం క్యాంపు ఏరియా ఆస్పత్రిలో నిర్వహించడంతో సమస్య ఏర్పడుతోంది. శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపు కోసం కొందరు ఉదయం 7 గంటలకే వచ్చి ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నా గంటల తరబడి క్యూలో నిల్చున్నారు.
కొందరు మహిళలు చంటి పిల్లలను ఎత్తుకుని ఎండలో క్యూలో నిల్చున్నారు. శిబిరం నిర్వహించే అధికారులు సౌకర్యలు ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఎండ తాకిడికి తట్టుకోలేక విలవిలలాడుతున్నామని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేరని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండలాల్లో శిబిరం క్యాంపులను ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలుగుతాయని, తక్షణమే అధికారులు స్పందించి మండలానికో శిబిరం ఏర్పాటు చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆజయ్‌కుమార్‌ను వివరణ కోరగా డీఆర్‌డీఏ పీడీతో మాట్లాడానని తెలిపారు. ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపామన్నారు. అర్హులు మాత్రమే రావాలని, అనర్హులు కూడా వస్తున్నారని ఆయన తెలిపారు.
నిర్లక్ష్యంగా క్యాంపు నిర్వహణ
నేను పిట్లం నుంచి పొద్దున 7 గంటలకు మా తండ్రితో వచ్చా. ఎండలో చస్తున్నాం. క్యాంపు కనీస సౌకర్యాలు లేవు. తాగే నీరు కూడా లేదు. ప్రతి మండలంలో రెగ్యులర్‌గా క్యాంపులు నిర్వహిస్తే దివ్యాంగులకు ఇబ్బందులు తప్పుతాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
–శ్రీనివాస్, పిట్లంవాసి.
Comments
Please login to add a commentAdd a comment