ఇస్మత్ మంటో పెళ్లాడివుంటే...
ఉర్దూ కథ ప్రసక్తి వస్తే మొట్టమొదట గుర్తువచ్చే రెండు పేర్లు సాదత్ హసన్ మంటో, ఇస్మత్ చుగ్తాయీ. ఇద్దరూ సమకాలికులు, సమాజంలోని కుళ్లును బయటపెడుతూ కథలు రాశారు. ఇద్దరి మీదా విశృంఖలంగా రాస్తారన్న అభియోగం ఉంది. మా కథలు ప్రపంచాన్ని ప్రతిబింబిస్తున్నాయంటూ ఇద్దరూ మొండికెత్తారు. కోర్టుల పాలయ్యారు. పాఠకలోకం మాత్రం ఇద్దరినీ తలకెత్తుకున్నది. ఈనాటికీ దించలేదు. అయితే, ఇద్దరికీ వారి వారి సంసారాలున్నాయి. కానీ, వాళ్లిద్దరూ పెళ్లిచేసుకుంటే బాగుండేదనుకునే అభిమానులున్నారు. అలాంటి ‘ప్రతిపాదన’ వచ్చినప్పుడు మంటో సరదా స్పందన ఇది:
ఏడాదిన్నర అయింది. నేను బాంబేలో ఉండగా హైదరాబాద్లోని ఒక పెద్దమనిషి నుంచి ఉత్తరం వచ్చింది. అందులో సంగతులు ఇలాగున్నాయి. ‘ఇస్మత్ చుగ్తాయీని నీవు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మీరిద్దరూ ఒకటయితే బ్రహ్మాండంగా ఉండేది. ఇస్మత్ ఎవరో షాహిద్ లతీఫ్ని పెళ్లాడటం సిగ్గుచేటు...’ ఇంచుమించు ఆ రోజుల్లోనే హైదరాబాద్లో అభ్యుదయ రచయితల సమావేశాలు జరిగాయి. నేను వెళ్లలేదుగాని, హైదరాబాద్ నుంచి వచ్చే ఒక ప్రచురణలో వివరాలు చదివాను. అక్కడ చాలామంది అమ్మాయిలు ఇస్మత్ చుగ్తాయీని చుట్టుకుని మీరు మంటోను ఎందుకు పెళ్లి చేసుకోలేదంటూ అడిగారట!
ఆ రాసిన సంగతులు అబద్ధమా, నిజమా తెలియదు. ఇస్మత్ మాత్రం బాంబే తిరిగివచ్చిన తరువాత మా ఆవిడతో ఒక సంగతి చెప్పింది. హైదరాబాద్లో ఒక అమ్మగారు మంటోకి పెళ్లి కాలేదటగదా అని అడిగిందట. తాను అది నిజం కాదు అన్నదట. అది విని ఆవిడగారు నిరాశపొంది నిశ్శబ్దంగా వెళ్లిపోయిందట! నిజమేమిటో తెలియదుగానీ, హైదరాబాద్లోని ఆడ, మగ మాత్రం ఇస్మత్కూ, నాకూ పెళ్లి కాలేదని బెంగ పెట్టుకున్నట్టున్నారు.
నేను ఆ సంగతి గురించి అప్పట్లో పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇస్మత్ నేనూ భార్యభర్తలం అయి ఉంటే? ఇదేదో చిత్రమయిన ప్రశ్న. క్లియోపాత్ర ముక్కు అంగుళంలో 18వ వంతు పొడుగు ఎక్కువగా ఉంటే ఏమయి ఉండేది? చరిత్ర ఎలాగుండేది? అన్నట్టు ఉంటుంది. ప్రస్తుత కథలో ఇస్మత్ క్లియోపాత్ర కాదు, నేను మార్క్ అంటోనీ అంతకన్నా కాదు. అయినాసరే, మంటో, ఇస్మత్ పెళ్లి చేసుకుని ఉంటే, సమకాలీన కథా సాహిత్యంలో అటామిక్ బాంబులాంటి ప్రభావమే ఉండేది. కథలు వెనుకబడిపోయేవి. మా గురించిన కథలు చిక్కు ప్రశ్నల్లా ఎక్కువయి ఉండేవి. మాటకారితనం మంటగలిసిపోయి బూడిదగా మిగిలిపోయేది. వాళ్ల రాతలు పెళ్లి కాగితాలమీది సంతకాలతో అంతమయి ఉండేవి. అసలు పెళ్లి కాగితాలు అంటూ ఉండేవా లేదా? పెళ్లి కాంట్రాక్ట్ మీద కూడా బహుశా ఇద్దరూ కథలే రాసి సంతకాలను మాత్రం కాజీగారి నుదుటిమీద చేసి ఉండేవారు. ఆ తంతు జరుగుతుంటే, బహుశా మాటలు ఈ రకంగా నడిచి ఉండేవి:
‘ఇస్మత్, కాజీసాహెబ్ నుదురు రాతబల్లలాగ ఉంది కదూ!?’
‘ఏమిటన్నావ్?’
‘నీ చెవులకు ఏమయింది?’
‘ఏమీ కాలేదు. నీ పీలగొంతు బయటకి రానంటోంది.’
‘పిచ్చిగా మాట్లాడకు, కాజీసాహెబ్ నుదురు రాతబల్లలా ఉంది అన్నాను.’
‘రాతబల్ల చదునుగా ఉంటుంది.’
‘ఆయన నుదురు చదునుగా లేదా?’
‘నీకు చదును అంటే ఏమిటో తెలుసా?’
‘తెలీదు!’
‘నీ తల చదునుగా ఉంది. కాజీ గారిది..?’
‘చాలా అందంగా ఉంది.’
‘అదే అంటున్నాను.’
‘నువ్వు నన్ను ఏడిపిస్తున్నావ్’
‘నీవు ఆ పని చేస్తున్నావని నేను అంటున్నాను.’
‘నన్ను ఆట పట్టిస్తున్నావని నీవు ఒప్పుకు తీరాలి.’
‘ఇది బాగుంది. అప్పుడే మొగుళ్లాగా మాట్లాడుతున్నావ్’
‘కాజీసాహెబ్ ఈవిడను నేను పెళ్లి చేసుకోను. మీ అమ్మాయి నుదురు, మీ నుదురులా చదునుగా ఉన్నా సరే, ఆమెను నాకిచ్చి పెళ్లి చేయండి.’
‘కాజీ సాహెబ్, ఇతగాడిని నేను పెళ్లాడటం లేదు. నన్ను మీ భార్యగా చేసుకోండి! ఇప్పటికే నలుగురు ఉండి ఉంటారు. మీ నుదురు నాకు చాలా నచ్చింది!’
వ్యవహారం ఇలా సాగుతుంటే పెళ్లి సంగతి ఏమవుతుందో!
అనువాదం: కె.బి. గోపాలం
9849062055
సాదత్ హసన్ మంటో
1912-55
ఇస్మత్ చుగ్తాయీ
1915-91