safe water projects
-
ఇక ఉద్దానం ‘సురక్షితం’
సాక్షి, అమరావతి: నలభై ఏళ్లుగా కిడ్నీ వ్యాధుల భయాలు వెంటాడుతున్న ఉద్దానం ప్రాంత ప్రజలకు భరోసా కల్పిస్తూ అక్కడకు వంద కి.మీ.పైగా దూరంలోని హిర మండలం రిజర్వాయర్ నుంచి సురక్షిత జలాలు కదిలాయి. భూగర్భ పైపులైన్ల ద్వారా ఉద్దానానికి నీటి తరలింపుపై గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వారం రోజులుగా నిర్వహిస్తున్న తొలిదశ ట్రయల్ రన్ విజయవంతమైంది. దాదాపు 132 కి.మీ. మేర భూగర్భ పైపు లైన్‌ను నిర్మించగా మార్గమధ్యంలో మెలియాపుట్టి వద్ద నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటైంది. మొదటి దశలో 32 కి.మీ. పొడవున భూగర్భ పైపులైన్ ద్వారా నీటిని తరలించారు. రానున్న 15 రోజులలో నీటి శుద్ధి కేంద్రం నుంచి ఉద్దానం చివరి ప్రాంతం ఇచ్ఛాపురం వరకు వంద కిలోమీటర్ల పొడవున ప్రధాన భూగర్భ పైపు లైన్ ద్వారా నీటి తరలింపు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ.. దాదాపు 807 నివాసిత ప్రాంతాలకు కొళాయిల ద్వారా తాగునీటి సరఫరాకు ఉద్దానం ప్రాంతాన్ని పది క్లస్టర్లుగా వర్గీకరించారు. అక్కడ నివసిస్తున్న దాదాపు 8 లక్షల మంది ప్రజలకు ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ట్రయల్ రన్‌కు ఐదు కోట్ల లీటర్లు.. ఉద్దానం తాగునీటి అవసరాల కోసం రోజూ 8.40 కోట్ల లీటర్ల చొప్పున హిర మండలం నుంచి తరలిస్తారు. ఇందుకోసం 1,300 హెచ్‌పీ సామర్థ్యంతో మూడు భారీ నీటి పంపింగ్ మోటార్లను హీర మండలం రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేశారు. మొదటి దశ ట్రయల్ రన్ కోసం ఐదు కోట్ల లీటర్లను మెలియాపుట్టి నీటి శుద్ధి కేంద్రం వద్దకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మూడు మోటార్ల పనితీరును కూడా పరీక్షించారు. మాట ప్రకారం.. ఖర్చుకు వెనుకాడకుండా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు ఏడు మండలాల పరిధిలో ఉద్దానం ప్రాంతం విస్తరించి ఉంటుంది. స్థానికులను దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం జగన్ రూ.700 కోట్లతో ఉద్దానానికి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేయడం తెలిసిందే. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండటంతో ఖర్చుకు వెనుకాడకుండా హిర మండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు చేపట్టాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా ఉద్దానం నీటి అవసరాలను తీర్చేందుకు ఒక టీఎంసీ కన్నా తక్కువ అవసరం కాగా హిర మండలం రిజర్వాయర్‌లో కనీస మట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రభుత్వం నూతనంగా నిర్మించింది. -
కుళాయి ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని సరఫరా చేసేలా రూపొందించిన సరికొత్త వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు..రానున్న 30 ఏళ్ల కాలంలో అంటే 2051 సంవత్సరం నాటికి రాష్ట్రంలో పెరిగే జనాభా, పశు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ డ్రింకింగ్ వాటర్ స్లప్లయి కార్పొరేషన్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తుంది. ఏడాది మొత్తం సరఫరాకు అవసరమయ్యే నీరు ఏ ఏ సాగునీటి ప్రాజెక్టులలో అందుబాటులో ఉంటుందన్నది అంచనా వేసి.. ఆయా ప్రాజెక్టుల నుంచి వాటికి సమీపంలో ఉండే ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా నీటి తరలించడానికి వీలుగా ప్రాజెక్టు రూపకల్పన ఉంటుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. - ఈ ప్రాజెక్టు ద్వారా రోజూ గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి 105 లీటర్లు, పట్టణ, మున్సిపల్ ప్రాంతంలో135 లీటర్లు, నగరాల్లో ఉండే వారికి 150 లీటర్ల చొప్పన నీటి సరఫరా చేస్తారు. - ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి ఇంటికి మధ్య నీటి సరఫరా సమయంలో 10 శాతానికి మించి నీరు వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. - నిర్ణీత ప్రామాణిక ప్రమాణల మేరకు ఉండే నీటినే సరఫరా చేస్తారు. - ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే నిధులను ప్రభుత్వ కేటాయింపులకు తోడు ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, ఇతర విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టును ప్లబిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ), హైబ్రీడ్ యానిటీ విధానంలో కాంట్రాక్టుకు అప్పగించేందుకు అనుమతి తెలిపింది. -
అటకెక్కిన నీటి పరీక్ష కిట్లు
ప్రజలకు కలుషిత నీరే దిక్కు - వేసవిలో కృష్ణపట్టె గ్రామాల్లో పొంచి ఉన్న ముప్పు - చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం - నెరవేరని ప్రభుత్వ లక్ష్యం రక్షితనీటి పథకాల ద్వారా ప్రజలకు సరఫరా చేసే నీరు కలుషితం కాకుండా తద్వారా వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆరు నె లల క్రితం జిల్లాలోని ప్రతి గ్రామానికి నీటి పరీక్ష కిట్లు అందజేసింది. గ్రామీణ నీటిసరఫరా శాఖ ఆధ్వర్యంలో సంబంధిత సిబ్బందికి పలుమార్లు శిక్షణ కూడా ఇచ్చారు. శిక్షణపొందిన ఫీల్డ్ అస్టెంట్లు గ్రామాలను సందర్శించాలి. ఆయా గ్రామాలకు చెందిన ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు, గ్రామ పంచాయతీ సిబ్బంది సాయంతో స్థానికంగా ఉన్న చేతి పంపులు, బావులు, బోర్లలోని నీటిని పరీక్షించాలి. వాటి ఫలితాన్ని బట్టి ఆనీటిని గ్రామస్తులు వాడవచ్చా.. లేదా అనేది నిర్ధారించాలి. నీటిని పరీక్ష చేయగా వచ్చిన ఫలితాలను రికార్డు చేయాలి. నీరు కలుషితం, ఫ్లోరిన్‌శాతం అధికంగా ఉంటే ఆబోరుపై రెడ్ కలర్‌తో మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసిన బోర్లలో నీటిని వాడకానికి నిషేధిస్తారు. ఇది నిత్యం జరగాల్సిన పని. కానీ ఎక్కడా జరుగుతున్న దాఖలాలు లేవు. మూలనపడ్డ నీటి పరీక్ష కిట్లు నీటి పరీక్ష విధానం క్షేత్రస్థాయిలో ఎక్కడా సక్రమంగా అమలైన దాఖలాలు లేవు. నీటి పరీక్ష కిట్లు గ్రామ పంచాయతీల్లోనే, ప్రజాప్రతినిధుల ఇళ్లలోనే మూలకు పడి దర్శనమిస్తున్నాయి. గ్రామస్థాయిలో పని చేస్తున్న సిబ్బంది ఇటువైపు చూసిన పాపాన పోలేదు. వీరిపై ఉన్నతస్థాయిలో పర్యవేక్షణ కూడా లేకపోయింది. గ్రామ పంచాయతీ కార్మికులే రక్షిత నీటి పథకాల్లో బ్లీచింగ్ పౌడర్ కలిపి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. పొంచి ఉన్న అంటువ్యాధులు దామరచర్ల మండలంలోని కృష్ణపట్టె గ్రామాల్లో తాగునీటి కలుషితం వల్ల వ్యాధులు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా ఇర్కిగూడెం, తాళ్ల వీరప్పగూడెం, ముదిమాణిక్య, చిట్యాల, నడిగడ్డ, కల్లెపల్లి, వర్లీపలాలెం గ్రామాల ప్రజలు తాగునీటి కోసం కృష్ణా నదిపైనే ఆధారపడతారు. వేసవికాలం కావడంతో నదిలో నీటి మట్టం పడిపోతుంది. అదే నీటిని గ్రామాలకు నేరుగా పంపింగ్ చేస్తుంటారు. దీంతో కలుషిత నీటిని ఆయా గ్రామాల ప్రజలు తాగడం వల్ల డయోరియా, కలరా తదితర వ్యాధులకు గురయ్యే అవకాశం లేకపోలేదు. అదే నీటిని పరీక్షల కిట్టుతో టెస్ట్ చేసి సురక్షితమని గుర్తిస్తే వాటిని తాగకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చు. ఇప్పటికైనా ఆర్డబ్ల్యూఎస్, ఆరోగ్యశాఖ, గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పని చేసి నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురు కోతున్నారు.